బడ్జెట్ ఎప్పుడు…
విజయవాడ, అక్టోబరు 21, (న్యూస్ పల్స్)
AP Budget
ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయ అంచనాలు ప్రతి ఏడాది మార్చిలోనే అసెంబ్లీలో పెడతారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఆ పని చేస్తుంది. అందులో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, ఇతర వివరాలు చూసుకుని పద్దు రెడీ చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది బడ్జెట్ లేకుండానే నడిచిపోతోంది. ఎన్నికల కారణంగా జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ నాలుగు నెలలైనా ఆర్థిక పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియడం లేదని ఇంకా బడ్జెట్ పెట్టలేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ విమర్శలు గుప్పిస్తోంది.
జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటాన్ అకౌంట్.. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పద్దులు నిర్వహిస్తున్నారు. జూన్లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాస్త చక్కదిద్దిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పింది. ఓటాన్ అకౌంట్ ద్వారా ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు నాలుగు నెలల కోసం రూ.1,29,972.97 కోట్లకు గవర్నర్ అనుమతి తీసుకుంది. ఈ సారి మాత్రం తప్పనిసరిగా బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిందే. అందుకే నవంబర్లో ఈ పని పూర్తి చేయాలని అనుకుంటోంది.
ఆషామాషీగా బడ్జెట్ ప్రవేశ పెడితే సరిపోదు.. సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వృద్ధాప్య, ఇతర పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. మిగతా పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. మెజార్టీ నిధులు సంక్షేమ పథకాలకే వెచ్చించాల్సి ఉంటుంది. నిధుల సమీకరణ, కేటాయింపుల విషయంలో ఆర్థిక శాఖ అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పథకానికి ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు వేస్తున్నారు.
గత ప్రభుత్వంలో పూర్తిగా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. దాని వల్ల ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. ఈ బడ్జెట్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యత అంశంగా నిధులు కేటాయించనున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, సాయంపైనా స్పష్టత రావడంతో అధికారుల బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. మరో వైపు వైసీపీ అధినేత జగన్ నాలుగు నెలలు గడిచినా సూపర్ సిక్స్ లేదని.. సూపర్ సెవన్ లేదని అసలు డీబీటీనే అమలు కావడం లేదని అంటున్నారు.
తాను ఉన్నట్లయితే ఈ పాటికి రైతు భరోసా, అమ్మఒడి అన్నీ జమ చేసేవాడినని అంటున్నారు. అయితే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి బహిరంగసభలు పెట్టి బటన్ నొక్కిన నిధులు కూడా విడుదల చేయలేదని ఆయన మరోసారి వచ్చి ఉన్నట్లయితే ఏపీ దివాలా తీసి ఉండేదని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది.. బడ్జెట్ ప్రవేశ పెడతున్నామని హామీ ఇచ్చిన ప్రతి పథకం అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు.
Full budget in September | సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ | Eeroju news