సజ్జలకు మద్దతు ఇవ్వని నేతలు
గుంటూరు, అక్టోబరు 18, (న్యూస్ పల్స్)
Sajjala Ramakrishna Reddy
సిపి కీలక నేత, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నెంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అదే పార్టీలో ఒంటరి వారు అయ్యారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఆయన విదేశాల నుండి తిరిగి వస్తున్న సమయంలో ముంబై ఎయిర్పోర్టులో పోలీసులు ఆపారు. సజ్జల విదేశాలకు పారిపోతున్న సమయం లో పోలీసులు అడ్డుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి జరిగింది వేరు. ఆయన బాలీ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఉందన్న విషయం తెలిసి ఆయనను వదిలేసారు.
నిజానికి సజ్జలకు ఒక విధంగా ఇది పాజిటివ్ న్యూసే. కానీ విచిత్రంగా వైసిపి నుండి కీలక నేతలు ఎవరూ సజ్జల పై వచ్చిన వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు. మరోవైపు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇంకా సజ్జలపై లుక్ అవుట్ నోటీస్ అమలు లో ఉన్నట్టు కూడా చెప్పారు. తర్వాత మంగళగిరి పోలీసులు సజ్జలను తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు అందజేశారు. 2021 అక్టోబర్ 19న జరిగిన టిడిపి కార్యాలయం పై దాడి ఘటన లో విచారించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ నోటీసులు అందాయి. దీనిపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే ప్రెస్ మీట్ పెట్టి తనను తాను సమర్థించుకోవలసి వచ్చింది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ప్రస్తుత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు పదేపదే చెప్పే మాట YSR కాంగ్రెస్ లో Y అంటే వై.వి సుబ్బారెడ్డి, S అంటే విజయసాయిరెడ్డి, R అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనీ .పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే పవర్ అంతా ఈ ముగ్గురి మధ్య నడిచేది అనే ప్రచారం బలంగా ఉండేది. దానివల్ల వీళ్ళ మధ్య ఈగోలు కూడా పెరిగిపోయాయని అందువల్ల పవర్ సెంటర్ అనేది వీళ్ళ ముగ్గురి మధ్య మారుతూ వచ్చేది అనేది వైసిపి నేతల మధ్యే నడిచిన చర్చ. ఈ ముగ్గురిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో చాలా క్లోజ్ గా ఉండేవారు.
ఉద్యోగుల పిఆర్సి సమస్య అయినా,ఇతర కీలక అంశాలైనా సజ్జల ద్వారానే జగన్ వరకు వెళ్లేదనేది ఆ టైంలో జరిగిన కాదనలేని నిజం. అందుకే అప్పట్లో విపక్షాలు సజ్జలను “సకల శాఖల మంత్రి ” అంటూ విమర్శించేవారు. బహుశా ఆ ప్రయారీటీ నే సజ్జలను వైసీపీలోని ఇతర కీలక నేతల కోపానికో, అసూయకో గురి చేసిందంటారు ఎనలిస్ట్ లు. 2024లో ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో చాలామంది వేళ్ళు సజ్జల వైపే గురి పెట్టాయి.
జగన్ కు పార్టీకి మధ్య సజ్జల అడ్డుగోడలా మారారు అనేది వారి ఆరోపణ. దానికి తగ్గట్టే ఇటీవలి కాలంలో సజ్జల పార్టీ కార్యక్రమాల్లో కాస్త నెమ్మదిగానే ఉంటున్నారు. ఇక ఎన్నికల ముందు బాగా యాక్టివ్ గా ఉన్న ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ కూడా ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. టిడిపి కార్యాలయం పై దాడి కేసులో ఇప్పటికే దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం లాంటివాళ్ళు కేసులు ఎదుర్కొంటుండగా తాజాగా అదే కేసు లో సజ్జల కూడా విచారణకు హాజరు కావలసి వచ్చింది. అయితే సజ్జల స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడో లేక కనీసం “ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ అయ్యారు ” లాంటి వార్తలు వైరల్ అయినప్పుడో వాటిని ఖండిస్తూ పార్టీ లోని ఇతర నేతలు ఒక ప్రకటన జారీ చేయడమో లేక ప్రెస్ మీట్ పెట్టడమో చేస్తారని అందరూ భావించారు.
అయితే విచిత్రంగా అలాంటి సూచన ఏది ఇప్పటివరకూ కనిపించలేదు. దానితో సజ్జల రామ కృష్ణారెడ్డిని వాళ్లు లైట్ తీసుకుంటున్నారా లేక గతంలో అచల పాటించిన ఒంటెద్దు పోకడలు ఆయనను ఇతర నేతలకు దూరం చేసాయా అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మరి ఇప్పటికైనా సజ్జలకు మద్దతుగా వైసిపి నుండి ఎవరన్నా కీలక నేతలు బయటకు వస్తారో లేదో అన్నదానిపై ఈ చర్చ క్లైమాక్స్ ఆధారపడి ఉంది.