Vijayasai Reddy | టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి…? | Eeroju news

టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి

టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి…?

విశాఖపట్టణం, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్)

Vijayasai Reddy

వైసీపీని వలసలు కుదిపేస్తున్నాయి. పేరున్న నాయకులంతా ఒకరొకరుగా జగన్‌కు గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు. జగన్‌కు సన్నిహితులుగా పేరున్న మాజీ మంత్రులు కూడా పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానిక సంస్థల్లో ఆధిక్యం ఉన్న ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజ్యసభ సభ సభ్యులు కూడా జగన‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి టీడీపీలో చేరడానికి ప్రయత్నించారని అచ్చెన్నాయుడు వెల్లడించడం హాట్‌టాపిక్‌గా మారింది.ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. కాగా రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు.

మోపిదేవి, బీద టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్‌.కృష్ణయ్య బీజేపీలో చేరతారని టాక్‌ నడుస్తోంది.మరోవైపు వైసీపీలో నంబర్‌ టూగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబుపేల్చారు. విజయసాయిరెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా రెండో సారి కొనసాగుతున్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు… ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్‌ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

గతంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అప్పట్లో నందమూరి హీరో తారక్‌రత్న చనిపోయినప్పుడు ఆయన భార్య తరపు బంధువైన విజయసాయి అక్కడకు వెళ్లి టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలిగారు. దానిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవడం.. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడం ఇందుకు నిదర్శనమన్న వాదన కూడా కనిపించింది.అయితే విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగారు.

ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేరతానని తమను వేడుకున్నట్టు బాంబుపేల్చారు. మూడు నెలలుగా ఆయన స్వయంగా తననే బతిమలాడుతున్నట్లు వెల్లడించారు. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటివారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు. టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు.అయితే విజయసాయిరెడ్డి దానిపై తీవ్రంగా స్పందించారు.

అచ్చంనాయుడూ.. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని ట్వీట్‌లో విమర్శించారు. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా? అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిపై అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

టీడీపీ గూటికి విజయసాయిరెడ్డి

 

Vijayasai Reddy | విజయసాయిరెడ్డికి ఇంటి పోరేనా | Eeroju news

Related posts

Leave a Comment