Vizianagaram | విజయనగరంలో ఆగని కూల్చివేతలు | Eeroju news

Vizianagaram

విజయనగరంలో ఆగని కూల్చివేతలు

విజయనగరం, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్)

Vizianagaram

విజయనగరం జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు సంచలనంగా మారాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సైతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారనే కారణంతో అధికారులు కూల్చివేతలకు దిగారు. ప్రస్తుతం ఈ మాన్సస్ ట్రస్ట్ కు చైర్మన్ గా మాజీ కేంద్రమంత్రి, తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తున్నారు.మాన్సస్ ట్రస్ట్ ను అశోక్ గజపతిరాజు తండ్రి డాక్టర్ పివిజి రాజు 1958లో నెలకొల్పారు.

జిల్లాలో విద్యా వ్యవస్థ అభివృద్ధితో పాటు పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న సదుద్దేశ్యంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ట్రస్ట్ ప్రారంభించిన తరువాత ఈ ట్రస్ట్ పర్యవేక్షణలో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఆ విద్యాసంస్థల వ్యయప్రయాసలు, బాగోగులు చూసుకునేందుకు సుమారు పదిహేను వేల ఎకరాల భూమిని డాక్టర్ పివిజి రాజు దానం చేశారు. ఆ భూమి ద్వారా వచ్చే సంపాదన ట్రస్ట్ పరిధిలో ఉన్న విద్యాసంస్థలకు మాత్రమే వినియోగించాలని బైలాస్ లో పొందుపరిచారు. అలా ఆ ట్రస్ట్ పరిధిలో ఉన్న పదిహేను వేల ఎకరాల భూమి పాలకమండలి నిర్ణయం లేకుండా ఎవరు అమ్మడానికి కానీ, కొనుగోలు చేయడానికి కుదరదు. అలా అప్పటి నుండి మాన్సస్ భూములు విద్యాసంస్థలు అభివృద్ది కోసం మాత్రమే ఉపయోగిస్తూ వచ్చారు.

అయితే ఈ క్రమంలోనే జిల్లాకేంద్రంతో పాటు పలు చోట్ల విలువైన మాన్సస్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అలా అన్యాక్రాంతమైన భూమి మార్కెట్ ధర ప్రకారం కోట్లలోనే ఉంటుంది. ఆ భూముల్లో సుమారు 340 వరకు పక్కా భవనాలు కూడా నిర్మించారు. ఇప్పుడు ఆ భవనాలను తొలగించి భూములను స్వాధీనం చేసుకుంటుంది మాన్సస్ ట్రస్ట్. భవనాలను తొలగించే ముందు నోటీసులు జారీ చేసి చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే ధర్మపురిలో నిర్మాణంలో ఉన్న ఒక విల్లాను కూల్చివేశారు. మరికొన్ని నిర్మాణాలు కూడా కూల్చబోతున్నట్లు తెలియజేశారు మాన్సస్ అధికారులు.

దీంతో బాధిత కుటుంబాలు లబోదిబోమంటున్నారు. తమకు మాన్సస్ భూమని తెలియదని, వేరే వారి దగ్గర నుండి భూమిని కొనుగోలు చేసి నిర్మాణాలు చేసుకున్నామని గగ్గోలు పెడుతున్నారు. జీవితకాలం కష్టపడి వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నామని ఇప్పుడు ఆ భూమిని కూల్చివేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీని పై ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు పునరాలోచించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Vizianagaram

 

What is the real en convention dispute? | అసలు ఎన్ కన్వన్షన్ వివాదం ఏమిటీ | Eeroju news

Related posts

Leave a Comment