AP | విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత | Eeroju news

విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత

విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత

విశాఖపట్టణం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్)

AP

శాఖలో నూనె వ్యాపారులు కృత్రిమ కొరత గేమ్ మొదలెట్టేశారు. నూనెల దిగుమతులపై 20 శాతం సుంకం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. అది ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ డీలర్లు సిండికేట్‌గా మారిపోయి నూనె అమ్మకాల్ని రెండ్రోజుల పాటు నిలిపేసి కృత్రిమ డిమాండ్ సృష్టించేశారు. శని, ఆదివారాల్లో నూనె అమ్మకాలుండవంటూ చిరు వ్యాపారులకు వర్తమానం పంపించేశారు. అసలే వినాయక చవితి సంబరాల్లో భాగంగా చాలా చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులకు జెల్ల కొట్టేలా శనివారం తెల్లవారుజాము నుంచే వ్యాపారులు 30 శాతం ధరలు పెంచేసి విక్రయాలు చేస్తున్నారు.

వాస్తవానికి కేంద్రం ప్రకటించింది లూజ్ ఆయిల్‌పై.. అంటే ట్యాంకర్ల ద్వారా గుజరాత్, ముంబయి, కాకినాడ వంటి పోర్టులకు వచ్చే నూనెల్ని బడా వ్యాపారులు ఫిల్టర్ చేసి, ప్యాకెట్లు, డబ్బాల రూపంలో సరఫరా చేస్తుంటారు. ఇదంతా పూర్తవడానికి కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. కానీ కేంద్రం పేరు చెప్పి వ్యాపారులు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోట్లాది రూపాయల నూనె స్టాక్‌ను బ్లాక్ చేసేశారు. ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ వద్ద ఉన్న స్టాకుకు ధరల రెక్కలు తొడిగేశారు.పదిహేను కిలోల నూనె డబ్బా నిన్నటి వరకు రూ.1600 వరకు పలికేది. ఇప్పుడు ఆ డబ్బాను రూ.1900, రూ.2వేల వరకు అమ్ముకుంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బందులుంటాయంటూ పెద్ద డీలర్లు, చిన్న డీలర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

నూనె ప్యాకెట్ల ధరల్నీ పెంచేస్తున్నారు. కేంద్రం విధించిన 20 శాతం సుంకం పెంపుపై స్థానిక మార్కెట్ మరో 7.5 శాతం ట్యాక్సులు కలపబడతాయి. కానీ అంతకుమరింత అంటూ 30 శాతం అదనంగా ధరలు పెంచేసి విక్రయాలు చేసేస్తున్నారు.నూనె వ్యాపారులు కృత్రిమ మార్కెట్ సృష్టిస్తున్నా విశాఖలో అడిగే నాథుడే లేడు. వినియోగదారులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం కనీసం ఒక్క ప్రకటనా ఇవ్వలేదు. పౌర సరఫరాల శాఖ గానీ, మార్కెటింగ్ విభాగం గానీ, జాయింట్ కలెక్టర్ నుంచి గానీ కనీసం సమాచారం లేదు.

వరుసగా మూడ్రోజుల పాటు సెలవులు కూడా కలిసి రావడంతో వ్యాపారులు ఆడింది ఆట పాడిందే పాటగా మల్చుకుంటున్నారు. ఒక్కో బాక్సుపై (16ప్యాకెట్లుండే) కూడా 30శాతం ధరలు అధికంగా పెంచేసి అమ్మేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొవిడ్ విజృంభించిన సమయంలోనూ ఇంతలా ధరలు పెంచలేదని వినియోగదారులు వాపోతున్నారు. పామాయిల్, రిఫైండ్ ఆయిల్ ధరల పెంపుపై అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖలో నూనె వ్యాపారుల కృత్రిమ కొరత

 

Seizure of spoiled cheese and milk | పాడయిన పన్నీరు, పాలు స్వాధీనం | Eeroju news

Related posts

Leave a Comment