Salaries in AP Taxes in Telangana Weekend Chalo Hyderabad | ఏపీలో జీతాలు… తెలంగాణలో పన్నులు.. | Eeroju news

Salaries in AP Taxes in Telangana Weekend Chalo Hyderabad

 ఏపీలో జీతాలు… తెలంగాణలో పన్నులు..

వీకెండ్ ఛలో హైదరాబాద్

విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్)

Salaries in AP Taxes in Telangana Weekend Chalo Hyderabad

వాళ్లంతా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు అందుకునే అధికారులు. కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులైతే మరికొందరు స్టేట్ సర్వీస్ అధికారులు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్‌ కోరుకుని వచ్చిన వారు కొందరైతే స్థానికత కారణంగా తప్పనిసరిగా రావాల్సి వచ్చిన వాళ్లు మరికొందరు. ఇక ఆలిండియా సర్వీస్ అధికారులకైతే యూపీఎస్సీ కేటాయింపుల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన వారే ఎక్కువ. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల్లో చాలామంది 2014కు ముందే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారుల విభజనలో భాగంగా చాలామంది అధికారులు బలవంతంగా, అయిష్టంగా, అసంతృప్తిగా ఏపీకి వచ్చారు.

ఇలా వచ్చిన అధికారుల్లో చాలామంది వారంలో ఐదు రోజులు బలవంతంగా ఏపీలో గడపడానికి అలవాటు పడ్డారు. శుక్రవారం వస్తే చాలు బడి గంట మోగినట్టు వరుస పెట్టి ఎయిర్‌ పోర్ట్‌కు క్యూ కడతారు. మరికొందరు అధికారిక వాహనాల్లోనే హైదరాబాద్ వెళ్లిపోతారు. పదేళ్లుగా ఇదే తంతు ఏపీలో నడుస్తోంది.2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2014 డిసెంబర్‌లో విజయవాడ-గుంటూరు మధ్య కృష్ణానది తీరంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటికి ఏపీ పాలనా వ్యవహారాలు హైదరాబాద్‌ కేంద్రంగానే సాగేవి. 2015లో భూసమీకరణ పూర్తి చేసి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారు.

2016లో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి అటుఇటుగా ఏపీ రాజధాని కార్యకలాపాలను విజయవాడకు తరలించారు.రాజధాని తరలింపుపై అయిష్టంగా ఉన్న ఉద్యోగుల్ని బుజ్జగించడానికి వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఉచిత వసతి సదుపాయం కల్పించారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ సదుపాయాలు ఉద్యోగులకు కొనసాగుతున్నాయి. ఏపీ వాతావరణానికి అనుగుణంగా సెంట్రల్ ఏసీ ఆఫీసుల్ని ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చారు.2014లో రాష్ట్రవిభజన తర్వాత కేటాయింపుల్లో భాగంగా ఏపీకి వచ్చిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మొదలుకుని సచివాలయాల్లో వివిధ హోదాల్లో సెక్రటరీల స్థాయి అధికారుల వరకు మెజార్టీ ఉద్యోగులు వీకెండ్ వస్తే హైదరాబాద్‌ వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నారు.

తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి ఆఫీసులకు రావడం చాలామందికి అలవాటుగా మారింది. చీఫ్‌ సెక్రటరీల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు అందరి తీరు ఇలాగే ఉంది. హైదరాబాద్‌లో సొంతిళ్లు ఉండటం, పిల్లల చదువులు, మెరుగైన వైద్య సదుపాయాలు, పిల్లలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటి కారణాలతో చాలామంది ఎప్పటికి తమ గమ్యస్థానం హైదరాబాద్‌ అనే భావించేవారు. పదేళ్లలలోపు సర్వీసు ఉన్న వారు రిటైర్ అయిపోతాం కాబట్టి ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని భావించే వారు. పదేళ్లకు మించి సర్వీస్ ఉన్న వారు గత ప్రభుత్వంలో విశాఖపట్నం రాజధాని తరలింపు అన్నపుడు ఆందోళన చెందారు.

విశాఖపట్నం వెళితే ప్రయాణ సమయాం ఎక్కువవుతుందని మదనపడ్డారు. ఆ తర్వాత రెండేళ్లు కోవిడ్‌తో గడిచిపోవడంతో ఉద్యోగులు ప్రశాంతంగా వారాంతాల్లో సొంతిళ్లకు వెళ్లి వచ్చేవారు. మూడు రాజధానుల ముచ్చట తీరకుండానే ప్రభుత్వం మారిపోవడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రజల డబ్బుతో ప్రతి నెల జీతాలు తీసుకునే బ్యూరోక్రాట్లలో చాలామంది భవిష్యత్ గమ్యస్థానంగా హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మొదలుకుని గ్రూప్ 4 ఉద్యోగుల వరకు హైదరాబాద్‌‌లో స్థిరపడిన వారు అక్కడికి వెళ్లిపోడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిలో గ్రూప్‌ 3, 4 ఉద్యోగుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న వారు దాదాపు 2వేల మంది వరకు ఉన్నారు.

సర్వీస్ అధికారులు, గెజిటెడ్ అధికారుల్లో చాలామంది ఏపీపై పెద్దగా ఆసక్తి లేదు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్లో కొత్తగా సర్వీసులో చేరిన వారిలో కూడా ఈ ధోరణి ఉంది. హైదరాబాద్ కల్చర్‌కు అలవాటు పడిన వారికి ఏపీలో ఉద్యోగం భారంగా భావిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ స్థాయి సిటీ లైఫ్‌, వినోదం ఏపీలో ఉండవనే భావనతోనే వీకెండ్‌ వస్తే రయ్యిన ఎగిరిపోడానికి రెడీ అయిపోతుంటారు. సాధారణ ఉద్యోగులకు మరోరకం కష్టాలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఏపీలో రాజధాని చుట్టుపక్కల భూములు, సొంతింటి నిర్మాణాలపై పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత 2019-24మధ్య మారిన రాజకీయ ప్రాధాన్యతలతో ఉద్యోగుల పెట్టుబడుల్ని తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఏపీలో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన కూడా ఉద్యోగుల్లో ఉంది..

Salaries in AP Taxes in Telangana Weekend Chalo Hyderabad

 

Telangana Budget | తెలంగాణ బడ్జెట్ | Eeroju news

Related posts

Leave a Comment