హైదరాబాద్ ను మించిన రంగారెడ్డి
హైదరాబాద్, జూలై 26, (న్యూస్ పల్స్)
Ranga Reddy beyond Hyderabad
ఒక భౌగోళిక ప్రాంతంలో పౌరుల యెుక్క ఆదాయాన్ని, జీవనస్థితిగతులను తెలుసుకునేందుకు తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ తలసరి ఆదాయంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర బడ్జెట్ 2024-25 సందర్భంగా సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించగా.. తాజా గణాంకాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర తలసరి ఆదాయ సగటు రూ.3,11,649గా వెల్లడించారు. అన్ని రకాల వస్తువులు, వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక జిల్లాలోని పౌరులందరికీ సమానంగా విభజిస్తే ఒక్కొక్క పౌరుడికి వచ్చే ఆదాయ వాటాను ఆ జిల్లా తలసరి ఆదాయంగా పేర్కొంటారు.
ఈ లెక్కింపు ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా రూ.9,46,862 ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.4,49,033 ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది. సంగారెడ్డి రూ.3,22,394తో మూడో స్థానంలో, మేడ్చల్-మల్కాజిగిరి రూ.2,95,514తో నాలుగో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి రూ.2,67,605 ఆదాయంతో టాప్ 5లో నిలిచింది. ఇక మెుత్తం 33 జిల్లాల్లో రూ.1,80,241 ఆదాయంతో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం జాబితాలో రూ.1,81,825 ఆదాయంతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కింది నుంచి రెండో స్థానంలో నిలవగా.. రూ.1,83,094 ఆదాయంతో జగిత్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.
ఇక దేశ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంది. గత మూడేళ్లుగా చూసుకుంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 1,50,906 కాగా.. తెలంగాణ తలసరి ఆదాయం 2,69,169 లక్షలుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ తలససరి ఆదాయం 1,69,469 లక్షలు కాగా.. తెలంగాణ తలసరి ఆదాయం 3,11,649 లక్షలు. ఇక 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో దేశ తలసరి ఆదాయం 1,83,236 లక్షలు కాగా.. తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 లక్షలకు పెరిగినట్లు సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది.