రేషన్ కార్డులకు రుణమాఫీకి లింకా
హైదరాబాద్, జూలై 17 (న్యూస్ పల్స్)
Link to loan waiver for ration cards
రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో సుమారు 10-12 లక్షల మంది కొత్త రేషన్‌కార్డులు, మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు. రేషన్‌కార్డులకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం రుణమాఫీకి రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో లక్షల మంది అర్హులు కూడా రుణమాఫీకి అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబసభ్యులను గుర్తించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉండగా ఇందులో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే కొన్నేండ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. అదేవిధంగా కుటుంబ సభ్యులను చేర్చడం, తొలగించే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో కొత్తగా పెండ్లి అయినవారు, కుటుంబం నుంచి వేరుపడినవారు కొత్త కార్డులు, మార్పుల కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లకు గతంలో అవకాశం లేకపోవడం, ఇప్పుడు కూడా అవకాశం రాకపోవడంతో అర్హులైనప్పటికీ రేషన్‌కార్డు దక్కలేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీకి రేషన్‌కార్డు లింకు చేయడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్త రేషన్‌కార్డు లేకపోవడంతో అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ పొందలేకపోతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు అన్ని పథకాలకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకొని అమలు చేస్తున్నది. దీనిపై గతంలోనే విమర్శలొచ్చాయి. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకుండా పథకాలకు రేషన్‌కార్డును లింకు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దీంతో ప్రభుత్వం త్వరలోనే కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కొత్త కార్డుల జారీకి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా కొత్త కార్డులు జారీ లేకుండా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి రేషన్‌కార్డును లింకు పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త కార్డులు ఇవ్వకుండా రుణమాఫీకి రేషన్‌కార్డును ఏవిధంగా లింకు చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.