తవ్వే కొద్ది అక్రమాలు…
తిరుమల, జూలై 12, (న్యూస్ పల్స్)
Some irregularities in excavations at Tirumala
తిరుమలలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వీఐపీలు, వివిధ దర్శనాల విషయంలో ఎన్నెన్నో అవకతవకలు బయటపడ్డాయి. ఒకేరోజు పదుల సంఖ్యలో బ్రేక్ దర్శనాలు కొనసాగాయి. మంత్రులు, ప్రజా ప్రతినిధుల వెంట పదుల సంఖ్యలో అనుచరులు బ్రేక్ దర్శనానికి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అవి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దర్శన టికెట్ల విషయంలో సైతం భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు ఒకే ఫోన్ నెంబర్ తో ఎక్కువ టికెట్లు పొందారని టీటీడీ ఐటీ విభాగం సిబ్బంది పరిశీలనలో వెలుగు చూడడం గమనార్హం. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
చిత్తూరు జిల్లాకు చెందిన వైసిపి మాజీ మంత్రుల పేరుతో భారీగా బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు అందినట్లు తెలుస్తోంది. గత ఏడాది 100 ఫోన్ నెంబర్లతో అధిక సంఖ్యలో ప్రత్యేక దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్లు తీసుకున్నారని,తరువాత వాటిని ఇతరులకు విక్రయించారని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఒకే ఫోన్ నెంబర్‌తో 34 సార్లు దర్శన టికెట్లు బుక్ చేశారని అధికారుల పరిశీలనలో వెలుగు చూసింది. పేరుకే ఆన్ లైన్ అని.. గోల్ మాల్ భారీగా జరిగిందని ఐటీ విభాగం చెబుతోంది. ఆన్లైన్ లో ఓ వ్యక్తి అయితే తన ఫోన్ నంబర్ తో 1279 సార్లు ఆర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడని తాజాగా వెలుగు చూసింది. ఇది సామాన్య విషయం కాదని.. ఇంటి దొంగల సహకారం లేనిదే సాధ్యపడదని టీటీడీ అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈవో శ్యామలరావు దీనిపై సీరియస్ గా దృష్టి సారించారు. ప్రత్యేక విచారణకు ఆదేశించారు.
సుదీర్ఘకాలం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి వ్యవహరించారు. దీంతో అక్రమాలకు అడ్డాగా తిరుమల మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వైసిపి ప్రజాప్రతినిధుల సిఫారసులకు పెద్దపీట వేశారన్న విమర్శ ఉంది. అప్పట్లో కొందరికి లబ్ధి చేకూరేందుకు టీటీడీ సిబ్బంది కూడా చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో ఫోన్ నెంబర్‌తో అయితే 403 సార్లు ప్రత్యేక దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేశారని వెలుగు చూసింది. ఇంకో నెంబర్‌తో అయితే ఏకంగా 807 గదులు బుక్ చేశారని వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వ్యక్తి సంవత్సరంలో 807 సార్లు తిరుమల వచ్చి ఉండడం ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అధికార వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రోజుకు రెండుసార్లు గదులు బుక్ చేసిన కూడా ఒక సంవత్సరంలో 807 గదులు బుక్ చేయడం అసాధ్యమని..దీని వెనుక మాఫియా ఉందని.. భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని.. సమగ్ర దర్యాప్తు కావాలని భక్తులు కోరుతున్నారు.వైసిపి పాలనలో తిరుమలలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. కానీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించింది. ఫలితంగా అవినీతి పతాక స్థాయికి చేరుకుంది. ప్రత్యేక దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్లు, గదులు.. ఇలా అన్నింటిని దళారుల చేతిలో పెట్టి బ్లాక్ లో విక్రయించేవారన్న అనుమానాలు ఉన్నాయి.
గత ఏడాది 100 ఫోన్ నెంబర్లతో అధికంగా టిక్కెట్లు కేటాయించడాన్ని అధికారులు గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి?టిక్కెట్లు ఎందుకు బుక్ చేశారు?నిజంగా టిక్కెట్లు అర్హులకు అందించారా? లేకుంటే బ్లాక్ లో అమ్మేశారా? అనేది ఆరా తీసే పనిలో పడ్డారు టీటీడీ సిబ్బంది. గత వైసీపీ ప్రభుత్వంలో చేతివాటం చూపించిన దళారులతోపాటు కొందరు టీటీడీ ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. త్వరలో వీరికి చుక్కలు కనబడడం ఖాయమని తెలుస్తోంది.
Cleansing started in Tirumala | తిరుమలలో మొదలైన ప్రక్షాళన | Eeroju news