Politics revolving around coal | బొగ్గు చుట్టూ తిరుగుతున్న రాజకీయం | Eeroju news

Politics revolving around coal

బొగ్గు చుట్టూ తిరుగుతున్న రాజకీయం

హైదరాబాద్, జూన్ 24, (న్యూస్ పల్స్)

Politics revolving around coal :

తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు బొగ్గు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించకుండా కేంద్రం వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొన్నది. అందుకే బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమ హయాంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని సింగరేణిని కూడా వేలంలో పాల్గొనడానికి అంగీకరించలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ భిన్నంగా స్పందిస్తోంది. వేలంలో పాల్గొనకుండా సింగరేణికి నష్టం చేశారని కోల్ బ్లాకులు బీఆర్ఎస్ నేతల సన్నిహితులుక చెందడానికే ఇలా చేశారంటున్నారు.

సింగరేణికి ప్రస్తుతం ఉన్న బొగ్గు గనులు మరో పదేళ్లలో అయిపోతాయని ఆ తర్వాత పరిస్థితేమిటని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వేలంలో అయినా బొగ్గు గనులు దక్కించుకోవాలని.. తర్వాత కేంద్రంపై పోరాడి .. దొరికిన గనులు కేటాయింప చేసుకోవాలని కాంగ్రెస్ వాదిస్తోంది. బీఆర్ఎస్ వల్లే సింగరేణికి పెను ముప్పు ఏర్పడిందని అంటోంది. సింగరేణి ప్రభుత్వ సంస్థ. తెలంగాణ ప్రభుత్వానికి 51  శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయి. అంటే వంద శాతం ప్రభుత్వ సంస్థ. బొగ్గు గనులు వీటికి కేటాయించడం అంటే  ప్రభుత్వానికి కేటాయించడమే అనుకోవచ్చు. కానీ కేంద్రం.. ప్రైవేటు సంస్థలతో పాటు సింగరేణి కూడా పోటీ పడి బొగ్గు గనులు దక్కించుకోవాల్సిందేనని విధాన నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఉన్న బొగ్గు గనులన్నింటినీ వేలం వేస్తూ వస్తోంది. దేశంలోని సుమారు 500 బొగ్గు బ్లాకుల్లో ఇప్పటికే 300 బ్లాకుల వేలం పాట పూర్తయింది. ఈ విధానం వల్ల రాష్ట్రాలకు  ఆదాయం పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు గతంలో సింగరేణికే కేటాయించేవారు. కానీ కేంద్రం వేలం నిర్ణయం తీసుకున్న తర్వాత సింగరేణి కూడా వేలంలోనే గనులు దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా హైదరాబాద్‌లో శ్రావణపల్లి బ్లాకు వేలం ప్రక్రియ జరిగింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది.

సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. వేలంలో పాల్గొనలేదు.  ఫలితంగా ఆ బొగ్గు గనులు సింగరేణికి దక్కలేదు. వేలంలో ఇతరులకు దక్కాయి. ఇక ముందు కూడా వేలంలో పాల్గొనకపోతే సింగరేణి వట్టిపోతుందన్న ఆందోళనతో శ్రావణపల్లి బ్లాకును దక్కించుకునేందుకు వేలంలో పాల్గొన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కుట్రతోనే వేలంలో పాల్గొనలేదని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి.

బీఆర్ఎస్  ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం   బొగ్గు గనుల వేలం  వేసింది.   2022 అక్టోబర్‌లో  కోయగూడెం బ్లాక్‌ను వేలం వేశారు.  2023లో ఆగస్టులో  సత్తుపల్లి బ్లాక్‌ను వేలం వేశారు.   కోయగూడెం బ్లాక్‌ను దక్కించుకున్నది అరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది  అరబిందో సంస్థకు చెందినది.  సత్తుపల్లి బ్లాక్‌ను శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ దక్కించుకుంది. ఇది  ప్రతిమ గ్రూపు కంపెనీ. ఈ రెండు కంపెనీలు కేసీఆర్ కుటుంబ సన్నిహితులవేనని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. అవి వేలంలో పాడుకోగా.. సింగరేణిని ఎందుకు వేలంలో పాల్గొనకుండా ఆపారని ప్రశ్నిస్తున్నారు.   గోదావరి పరిసరాల్లో ఉన్న బొగ్గు గనుల వేలంలో పాల్గొనవద్దని అనధికారికంగా ఆదేశించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ వేలంలో సింగరేణి పాల్గొనలేదు. ఆ ఛాన్స్‌ను ప్రైవేట్ కంపేనీలు క్యాష్‌ చేసుకున్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

సింగరేణి కూడా వేలంలో పాల్గొందని కాంగ్రెస్ నేతలంటున్నారు. వైజాగ్‌ స్టీల్  ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ లేనందు వల్ల నష్టాల్లోకి వెళ్లిపోయింది. సింగేరణిని కూడా అలాగే చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పుడు  ప్రభుత్వం సింగరేణికి బొగ్గు గనులు కేటాయింప చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పదేళ్లలో సింగరేణి కనుమరుగు అవుతుంది.  కొయ్యగూడెం, సత్తుపల్లిలోని 6 కోల్ బ్లాకులను   ను సింగరేణికి కేటాయిస్తే అనువుగా ఉంటుందని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.   ఈ విషయమై కిషన్ రెడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క కోరారు. అవసరమైతే ప్రధానితో మాట్లాడేందుకు తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.   గనుల మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం   సింగరేణిని కాపాడుతామని అంటున్నారు.

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారుసింగరేణి వేలంలో పాల్గొనడం వల్ల.. ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్లేనని రెండు జాతీయ పార్టీలు కలిసి సింగరేణికి నష్టం చేస్తున్నాయని వాదిస్తున్నారు. గతంలో ప్రైవేటు సంస్థలు వేలంలో సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులు దక్కించుకున్నా వారు తట్ట బొగ్గు కూడా వెలికి తీయకుండా అడ్డుకున్నామని కేటీఆర్ చెబుతున్నారు. కానీ గనులను వారు పాడుకున్న తర్వాత అడ్డుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. మూడు బ్లాకులు వేలం పాడుకున్న ఫార్మా కంపెనీ బొగ్గు బయటికి తీసే యంత్రాలు లేక, సాంకేతిక పద్ధతులు రాక బొగ్గు తవ్వలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాదన ప్రకారం వేలంలో పాల్గొనకపోతే సింగరేణికి గనులు ఉండవు.. కేంద్రం కేటాయించదు. అప్పుడు సింగరేణికే నష్టం. అందుకే బీఆర్ఎస్ వాదనలో అసలు పస లేదని రెండు జాతీయ పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

Politics revolving around coal

 

Between Congress and BJP Coal Mines Panchayat | కాంగ్రెస్, బీజేపీ మధ్య బొగ్గు గనుల పంచాయితీ | Eeroju news

Related posts

Leave a Comment