జనసేన ఆచితూచి అడుగులు | Janasena Step by step | Eeroju news

జనసేన ఆచితూచి అడుగులు

కాకినాడ, జూన్ 18, (న్యూస్ పల్స్)

Janasena Step by step

ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన పార్టీ పోషించింది కీలక పాత్ర. ఇక ప్రభుత్వం నడపడంలోనూ దాన్ని కొనసాగించాలి. పొత్తులో ఉన్నంత మాత్రానా టీడీపీ నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ‘‘డూ డూ బసవన్న’’ లాగా జనసేన తలూపడం శోభించదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగేట్టు, ప్రభుత్వంపై అవసరం మేర ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుందిముఖ్యమంత్రి తర్వాత ఉపముఖ్యమంత్రిదే రెండో స్థానం అనుకుంటారు చాలామంది. అయితే రాజ్యాంగంలో ఉపముఖ్యమంత్రి పదవి గురించి ఏ ప్రస్తావనా లేదు. ఈ రాజకీయ పదవికి సంబంధించి చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఉపముఖ్యమంత్రికి అన్ని అధికారాలు ఇచ్చిన దాఖాలాలు ఏ రాష్ట్రంలోనూ లేవు.

అంతకముందు జగన్ మంత్రివర్గంలో పని చేసిన ఉపముఖ్యమంత్రులు అయినా, తెలంగాణలో కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన ఉప ముఖ్యమంత్రులైనా నెంబర్ 2 అంటే ఎవరైనా ఒప్పుకుంటారా?ఉపముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిలా వ్యవహరించాలి కానీ, ముఖ్యమంత్రి చెప్పింది చేయడానికే అనే పరిస్థితి తీసుకొచ్చారు. తనకు కేటాయించిన శాఖను నిర్వహించే మరే ఇతర మంత్రికి, ఉప ముఖ్యమంత్రికీ తేడా లేని స్థితిని తెచ్చిపెట్టారు. ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ మార్చాలి! పరిపాలన నిర్ణయాల్లో సమాన బాధ్యత తీసుకోవాలి.2019 నుంచి ’24 వరకు పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లినా… డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఊరువాడా ప్రచారం చేశారు.

కూటమి మేనిఫెస్టో ప్రజాగళంలో కూడా ‘‘అన్నా / డొక్కా సీతమ్మ’’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. కానీ, సీఎం చంద్రబాబు సంతకం చేసిన అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ జీవోలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ప్రస్తావనే లేదు! అయినా, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలని జనసేన నాయకులు ఒత్తిడి చేయకపోవడం… జనసేన రాజీ ధోరణికి అద్దం పడుతోంది.రాష్ట్ర మంత్రివర్గంలో కేవలం మూడు మంత్రి పదవులకే జనసేన పార్టీ ఒప్పుకోవడం పట్ల పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కామన్ పొలిటికల్ ప్రోగ్రాం (సీపీపీ)కి పట్టుబట్టకుండా జనసేన నాయకత్వం ఇదే విధంగా రాజీ పడుతూ పోతే, చివరికి తెలుగుదేశం తమ పార్టీని కబళిస్తుందని వారు భయపడుతున్నారు.

టీడీపీకి జనసేన ‘బీ టీం’ అనే ముద్ర వేయించుకోవడానికి వారేమాత్రం ఇష్టపడటం లేదు. ఎందుకంటే, దేశ రాజకీయాలను గమనిస్తే, పాలక కూటముల్లోని ప్రధానపార్టీకి ‘బీ టీం’ అని ముద్ర వేసుకున్న ఏ పార్టీ భవిష్యత్తులో బతికి బట్టకట్టలేదుజనసేన ఇప్పుడు ధృతరాష్ట్ర కౌగిలిలో ఉందని మర్చిపోకూడదు. టీడీపీ వాళ్లు, జనసేన ఎదగొద్దు, పెరగొద్దనే గోడచాటున ఎత్తులు వేస్తారు. ఇటువంటి విషయాల్లో వారు సిద్ధహస్తులు కూడా! బీజేపీతో టీడీపీ ఇప్పటికే పలుమార్లు పొత్తుపెట్టుకుంది. అయినా, తెలుగు రాష్ట్రల్లో బీజేపీని ఎదగనీయకుండా చేయడంలో తెలుగుదేశం విజయం సాధించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తన ఉనికిని, ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా జనసేన ఎదిగేందుకు ప్రయత్నించాలి. లేదంటే, ఆ ఖాళీలో వైఎస్సార్సీపీకి లేదా కాంగ్రెస్ కి రాజకీయ పునర్జన్మ లభిస్తుంది!! గోదావరి జిల్లాల్లో కాపులు, బీసీలు, దళితుల మధ్య తరతరాల వైరం ఉన్నా… దానిని పక్కనపెట్టి మూకుమ్మడిగా జనసేనకు మద్దతిచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ తాను చెప్పిన సామాజిక న్యాయం అనే సూత్రాన్ని పాటిస్తారా? లేదా? అనేది సందేహాత్మకంగా మారింది.

జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు కాపులే. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపులు, ముగ్గురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒకరు క్షత్రియ, ఒకరు కమ్మ, ఇంకొకరు బ్రాహ్మణ సామాజికవర్గం వారు ఉన్నారు.ఎన్నికల్లో జనసేన పోషించిన పాత్ర చాలా పెద్దది. రాజమండ్రి జైలు ముందు, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించి టీడీపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహాన్ని నింపారు. దీంతో, సంస్థాగతంగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ తన సంస్థాగత బలాన్ని జనసేనకు ఇచ్చింది.

ఫలితంగా ఓట్ల బదిలీ సక్రమంగా జరిగి జనసేన వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధించిందిఅధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంస్థాగతంగా… గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు లేకపోతే పార్టీ పేకమేడలా కూలిపోతుంది. దీనిని దృష్టి లో పెట్టుకుని టీడీపీకి ‘బి’ టీంగా ఉంటారా? లేక పాలనలో కీలక భూమిక పోషిస్తూ, సామాజిక న్యాయం పాటిస్తూ, స్వతంత్రంగా పార్టీని విస్తరించి ఒక శక్తిగా ఎదుగుతారా? అనే ప్రశ్నకు సమాధానం జనసేన నాయకత్వం చేతుల్లోనే ఉంది.

 

Janasena MLAs are on duty | జనసేన ఎమ్మెల్యేలే ఆన్ డ్యూటీ | Eeroju news

 

Related posts

Leave a Comment