Andhra Pradesh:కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్

vijaysai reddy virel news

Andhra Pradesh:కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్:వైసీపీ హయాంలో మద్యం సరఫరాలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమీ లేదు.. అంతా పారదర్శకంగానే జరిగిందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. విజయసాయి రెడ్డి పేల్చిన లిక్కర్ బాంబ్.. ఆంధ్రా పాలిటిక్స్‌ని కుదిపేస్తోంది.నిప్పు లేనిదే పొగ రాదు. ఎంతో కొంత నిజం లేనిదే.. విమర్శలు, ఆరోపణలు రావు! ఇప్పుడు.. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి వినిపిస్తున్న చర్చలు, నాయకుల మాటలు వింటుంటే.. ఇదే అనిపిస్తోంది.

కలకలం రేపుతున్న విజయసాయిరెడ్డి లీక్స్

విజయవాడ, మార్చి 14
వైసీపీ హయాంలో మద్యం సరఫరాలో అవకతవకలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తుంటే.. అలాంటిదేమీ లేదు.. అంతా పారదర్శకంగానే జరిగిందని వైసీపీ గట్టిగా వాదిస్తోంది. ఇలాంటి టైమ్‌లో.. విజయసాయి రెడ్డి పేల్చిన లిక్కర్ బాంబ్.. ఆంధ్రా పాలిటిక్స్‌ని కుదిపేస్తోంది.నిప్పు లేనిదే పొగ రాదు. ఎంతో కొంత నిజం లేనిదే.. విమర్శలు, ఆరోపణలు రావు! ఇప్పుడు.. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి వినిపిస్తున్న చర్చలు, నాయకుల మాటలు వింటుంటే.. ఇదే అనిపిస్తోంది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ బలంగా చెబుతుంటే.. అలాంటిదేమీ లేదని వైసీపీ చెబుతూ వస్తోంది. ఈ విషయంలో రెండు పార్టీలు దెబ్బలాడుకుంటున్న సమయంలో.. వైసీపీలో కీలకంగా పనిచేసిన విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నా.. విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు విన్నాక.. తెరలన్నీ తొలగిపోతున్నట్లనిపిస్తోంది.విజయసాయి రెడ్డి వెర్షన్. ఇందులో.. ఇంకో డౌటే అవసరం లేదు. తమ హయాంలో మద్యం సరఫరాలో అవకతవకలే జరగలేదని వైసీపీ గట్టిగా వాదిస్తున్న సమయంలో.. విజయసాయి రెడ్డి పేల్చిన లిక్కర్ బాంబ్ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్‌లో.. కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేల్చి చెప్పేశారు. మద్యం సరఫరా అవకతవకల్లో.. పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనన్నారు.

దాంతో.. లిక్కర్ విషయంలో టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా.. స్కామ్ జరిగిందనే విషయాన్ని విజయసాయి చెప్పకనే చెప్పారనే చర్చ జరుగుతోంది.ఇప్పటికే.. ఈ వ్యవహారానికి సంబంధించి సీఐడీ కేసు నమోదు చేసింది. దానిపై.. వేగంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఎఫ్ఐఆర్‌లోనూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ఉంది. పైగా.. ఇతను వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఆ పార్టీలో కీలక నేతగానూ, పార్టీ పెద్దలకు సన్నిహితుడిగానూ కసిరెడ్డికి పేరుంది. అతని కనుసన్నల్లోనే లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయి రెడ్డి చెప్పడంతో.. ఏపీలో నెక్ట్స్ ఏం జరగబోతోందనేది ఆసక్తి రేపుతోంది. అంతేకాదు.. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి త్వరలోనే మరిన్ని విషయాలు బయటపెడతానని చెప్పడం కూడా.. పొలిటికల్‌గా మరింత హీట్ రేపుతోంది.వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీపై.. శాసనమండలిలోనూ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సిట్ విచారణకు ఆదేశించిన వెంటనే కీలక పత్రాలు తగలబెట్టేశారన్న ఆరోపణల్ని.. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు.వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగిందనేది కూటమి నేతల ప్రధాన ఆరోపణ. దీనిపై.. ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక విచారణ జరుపుతోంది. ఈ కేసులో వైసీపీలోని కొందరు ముఖ్య నేతల పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు విజయసాయి రెడ్డి మరో కీలక వ్యక్తి పేరు బయటపెట్టారు. దాంతో.. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందనే విషయం దాదాపుగా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే.. గత ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి కీలకంగా పనిచేశారు. ఆయనకు అన్నీ తెలుసని.. కీలక ఆధారాలు సైతం ఆయన దగ్గర ఉండొచ్చని అనుమానిస్తున్నారు.రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన విజయసాయి రెడ్డి.. వైసీపీ హయాంలో రహస్యాల గుట్టు మొత్తం విప్పేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. దాంతో.. వైసీపీలోని కీలక నేతలకు చిక్కులు తప్పవంటున్నారు. ప్రధానంగా.. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు ఏమీ లేకుండా.. డిస్టిలరీల నుంచి నేరుగా మద్యం తెచ్చి అమ్ముకున్నారని.. అలా వేల కోట్లు వెనకేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు.. వాటికి బలం చేకూర్చేలా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయడం.. వైసీపీలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో.. రాష్ట్ర రాజకీయాల్లోనూ.. ఈ వ్యవహారం హాట్ డిబేట్‌గా మారింది.కొత్త లిక్కర్ పాలసీ, దశలవారీగా మద్య నిషేధం, ప్రభుత్వమే వైన్ షాపులు నిర్వహించే విధానం ముసుగులో.. వైసీపీ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారనేది.. చాలా రోజులుగా వినిపిస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఈ లిక్కర్ స్కామ్‌లో.. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. డిస్టిలరీస్‌ని చేజిక్కించుకోవడం నుంచి కొత్త బ్రాండ్ల తయారీ దాకా అంతా మాఫియా తరహాలో జరిగిందనే వాదనలున్నాయి.

అసలు లిక్కర్ స్కామ్ విషయంలో.. వైసీపీ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలేంటి? నెక్ట్స్ ఏం జరగబోతోంది?ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర అని తెలుగుదేశం నేతలు గట్టిగా ఆరోపిస్తున్నారు. మద్యం కంపెనీలతో సంప్రదింపులు జరపడం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే.. లిక్కర్ సప్లై ఆర్డర్లు దక్కేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన ముడుపుల్ని.. బిగ్ బాస్‌కు చేర్చడంలో.. మిథున్ రెడ్డే కీలకంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. ఇందుకోసం.. వైసీపీ హాయంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందుపెట్టి.. భారీ నెట్‌వర్క్ రన్ చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒక్కో మద్యం కేసుకు.. 150 నుంచి 450 వరకు వసూలు చేశారంటున్నారు. ఈ లెక్కన.. నెలకు 60 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 3 వేల కోట్లు కొల్లగొట్టారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.ఈ వసూళ్ల నెట్‌వర్క్ రూపకల్పన, అది పక్కాగా అమలయ్యేలా చూడటం వెనుక మాస్టర్ మైండ్.. ఎంపీ మిథున్ రెడ్డేనని టీడీపీ నేతలు అంటున్నారు. లిక్కర్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన మద్యానికి.. బేసిక్ రేటుని అడ్డగోలుగా పెంచేసి.. అనుచిత లబ్ధి పొందారని అంటున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని.. ఈ స్కామ్‌ని అంతా తానై నడిపించారని చెబుతున్నారు. అంతేకాదు.. డిస్టిలరీల్లో పాగా వేసి.. వివిధ బ్రాండ్ల మద్యం తయారుచేయించి.. వాటికే అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నారని ఆరోపిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే.. ఏపీలో అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని.. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా ఆయన గుప్పిట్లోకి తెచ్చుకున్నారని.. అక్కడే పెద్ద ఎత్తున కొత్త బ్రాండ్లు తయారు చేయించారని ఆరోపిస్తున్నారు. వాటికే.. 2701 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ దగ్గర మొత్తం 235 మద్యం సరఫరా కంపెనీలు నమోదై ఉన్నాయి. అందులో 168 ఏపీలోనివే. వాటిలో.. కేవలం ఏడు సంస్థలకే 9221 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. అంటే.. 7 సంస్థలకే 60 శాతం విలువైన ఆర్డర్లు కట్టబెట్టారనే విమర్శలున్నాయి. వీటిలో.. అత్యధికంగా గత సర్కార్ పెద్దలకు అస్మదీయ కంపెనీలుగా ఉన్నవాటికి, ముడుపులు చెల్లించిన సంస్థలకేనని.. తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా.. అదాన్ డిస్టిలరీస్.. విజయసాయి రెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అనే ఫిర్యాదులు కూడా ఉన్నాయ్. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేదు. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ని.. సబ్ లీజు పేరిట ఆధీనంలోకి తీసుకొని.. అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను.. ఈ అదాన్ డిస్టిలరీస్ సంస్థ సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది.మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల నుంచి ముడుపుల వసూళ్లకు కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ చెల్లింపుల వ్యవహారాలు చూసేందుకు ప్రతి లిక్కర్ కంపెనీ, డిస్టిలరీ సంస్థ నుంచి ఒకరిని ప్రతినిధిగా నియమించుకున్నారట. అతను.. తనకు బాగా నమ్మకస్తులైన ఇద్దరు, ముగ్గురిని క్యాష్ హ్యాండ్లర్లుగా నియమించుకొని.. వారికి ముడుపుల సొత్తు అప్పజెప్పేవారట. వాళ్లు.. ఇందులో కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారని చెబుతున్నారు. ఎప్పుడూ ఒకేచోట కాకుండా.. వేర్వేరు ప్రాంతాల్లో ముడుపులు అందజేసేవారని.. ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చేసే వారని అంటున్నారు.ఇక.. ఈ సొమ్ము మొత్తాన్ని ఒక చోటుకు చేర్చేందుకు.. ఓ కీలక వ్యక్తిని ఆర్గనైజర్‌గా నియమించారని.. ఆ నగదు మొత్తాన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చేర్చేవారని అంటున్నారు. అతని దగ్గర్నుంచి.. పార్టీలోని మరో కీలక నేతకు వెళ్లేదంటున్నారు. అలా వచ్చిన బ్లాక్ మనీని వివిధ రూపాల్లోకి మార్చి.. బిగ్ బాస్‌కు చేర్చేవారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు.. వైసీపీలో కీలకంగా పనిచేసి.. పార్టీకి దూరమైన విజయసాయి రెడ్డి కూడా లిక్కర్ స్కామ్‌లో పాత్రధారి, సూత్రధారి అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని చెప్పడం కూడా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏదేమైనా.. లిక్కర్ స్కామ్ జరిగిందా? లేదా? అనే విషయంలో.. విజయసాయి మాటలతో కొంత క్లారిటీ అయితే వచ్చేసింది. సిట్ దర్యాప్తుతో.. అతి త్వరలోనే అసలు విషయంలో ఏపీ అంతటా రీసౌండ్‌లో వినిపిస్తుందనే చర్చ సాగుతోంది.

Read more:Andhra Pradesh:కెమెరా ముందు పులి… జైల్లో పిల్లి!

Related posts

Leave a Comment