Hyderabad:ఫ్యూచర్ సిటీ పరిధిలోకి 56 గ్రామాలు

56 villages under Future City

Hyderabad:ఫ్యూచర్ సిటీ పరిధిలోకి 56 గ్రామాలు:తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర విస్తరణపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫోర్త్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సిద్ధమైంది. హైదరాబాద్ సౌత్ పార్ట్‌లో 30 వేల ఎకరాల్లో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. తాజాగా.. ఫ్యూచర్‌ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరిట కొత్త సంస్థను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది.

ఫ్యూచర్ సిటీ పరిధిలోకి 56 గ్రామాలు

హైదరాబాద్, మార్చి 13
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర విస్తరణపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫోర్త్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సిద్ధమైంది. హైదరాబాద్ సౌత్ పార్ట్‌లో 30 వేల ఎకరాల్లో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. తాజాగా.. ఫ్యూచర్‌ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ పేరిట కొత్త సంస్థను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 7 మండలాల పరిధిలోని 56 రెవెన్యూ గ్రామాలతో ఎఫ్ సీడీఏ పరిధిని డిసైడ్ చేశారు. ఈ అథారిటీలో సీఎం ఛైర్మన్‌గా, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, పరిశ్రమలు, ఐటీ వాణిజ్య శాఖ మంత్రులు వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సీఎస్ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పరిశ్రమలు, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, పర్యావరణ, అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ, TGIIC మేనేజింగ్‌ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఏ కమిషనర్, హైదరాబాద్‌ డీటీసీపీ సభ్యులుగా ఉంటారు. అథారిటీ కమిషనర్‌ మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ బుధవారం (మార్చి 12) ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఓటర్ రింగు రోడ్డు అవతల ఉన్న ప్రాంతాలు.. ముఖ్యంగా శ్రీశైలం నేషనల్ హైవే- నాగార్జునసాగర్‌ హైవేకు మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి వచ్చే 36 గ్రామాలు గతంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. తాజాగా వాటిని ఎఫ్‌సీడీఏకు బదిలీ చేశారు. ఎఫ్ సీడీఏ పరిధిలోకి మొత్తంగా 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలను చేర్చుతూ గెజిట్ విడుదల చేశారు. కందుకూరు మండలం

దాసర్లపల్లి, అన్నోజిగూడ, దెబ్బడగూడ, గూడూర్‌, గుమ్మడవల్లె, కందుకూరు, కొత్తూర్‌, గఫూర్‌నగర్‌, లేమూర్‌, మాదాపూర్‌, మీర్‌ఖాన్‌పేట, మొహమ్మద్‌ నగర్‌, ముచ్చర్ల, పంజాగూడ, రాచలూర్‌, సర్వరావులపల్లె, తిమ్మాయిపల్లె, తిమ్మాపూర్‌ ఇబ్రహీంపట్నం మండలం: కప్పపహాడ్‌, పోచారం, రామ్‌రెడ్డిగూడ, తులేకలాన్‌, తుర్కగూడ, ఎలిమినేడు, ఎర్రకుంట, తడ్లకల్వ
యాచారం మండలం: చౌదరిపల్లి, గున్‌గల్‌, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కాజిగూడ, మొగుళ్లవంపు, నక్కర్త, నానక్‌నగర్‌, నంది వనపర్తి, నజ్దిక్‌ సింగారం, తక్కెళ్లపల్లి, తాటిపర్తి, తులేఖుర్ద్‌, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి.
కడ్తాల్‌ మండలం: చెర్లికొండపట్టి కల్వకుర్తి, చెర్లికొండపట్టి పడ్కల్‌, ఏక్‌రాజ్‌గూడ, కడ్తాల్‌, కర్కాల్‌ పహాడ్‌, ముద్విన్‌
ఆమన్‌గల్‌ మండలం: కోనాపూర్‌, రామనూతుల
మహేశ్వరం మండలం: , మొహబ్బత్‌నగర్‌, తుమ్మలూర్‌
మంచాల మండలం: ఆగపల్లి, నోముల, మల్లికార్జునగూడ
కాగా, ఈ గ్రామాలకు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం పల్లెలుగా ఉన్న ఈ గ్రామాలు పట్టణాలుగా మారనున్నాయి. ఊహించని విధంగా అభివృద్ధి జరగనుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. హైదరాబాద్‌కు 60 కి.మీ దూరంలో ఉన్న యాచారం మండలం నల్లవెల్లి లాంటి గ్రామంలో ప్రస్తుతం ఎకరం రూ. కోటి వరకు ఉండగా.. ఆ ధర మరింత పెరగనుంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు రానున్నాయి.
మరింత పెరిగిన హెచ్ఎండీ పరిధి
హైదరాబాద్, మార్చి 13
హైదరాబాద్ విస్తరణపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ తాజాగా హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. HMDA స్థానంలో కొత్తగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ను తీసుకొచ్చింది. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు చుట్టూ.. తెలంగాణ ముఖచిత్రం మార్చేలా రీజనల్‌ రింగు రోడ్డు  ప్రాజెక్టు పట్టాలెక్కిస్తుండటంతో భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుని నగర పరిధిని విస్తరించారు. అందులో భాగంగానే హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం హెచ్‌ఎండీఏ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు ఉంది. 7 జిల్లాలు, 74 మండలాలు, సుమారు 1000 గ్రామపంచాయతీలు, ఎనిమిది కార్పొరేషన్లు, 38కి పైగా మన్సిపాలిటీలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. తాజాగా.. మరో 3 వేల చదరపు కిలోమీటర్లు విస్తరస్తూ.. హెచ్‌ఎంఆర్‌ పరిధిని 10,472.72 చదరపు కిలోమీటర్లగా నిర్ణయించారు. హెచ్ఎంఆర్ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి.

ప్రస్తుతం ఉన్న HMDA పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటుగా కొత్తగా నల్గొండ, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలను చేర్చారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలున్నాయి. అతి తక్కువగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడు గ్రామాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో రెవెన్యూ గ్రామాలు ఉండగా.. వాటికి అదనంగా కొత్త గ్రామాలు హెచ్ఎంఆర్‌లో కలిపారు.జిల్లాల వారీగా గ్రామాలు చూసుకుంటే.. రంగారెడ్డి జిల్లాలో 533, మేడ్చల్-మల్కాజిగిరి163, యాదాద్రి-భువనగిరి 162, సంగారెడ్డి 151, మెదక్ 101, సిద్దిపేట 74, హైదరాబాద్ 64, వికారాబాద్ 54, నల్గొండ 31, మహబూబ్ నగర్ 19, నాగర్ కర్నూల్ 3 గ్రామాలతో కలిపి మెుత్తం 1,355 గ్రామాలు హెచ్ఎంఆర్ పరిధిలో ఉండనున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే హెచ్ఎంఆర్ పరిధితో ఆయా మండలు, గ్రామాల్లో భూములకు రెక్కలు రానున్నాయి. నగర శివారు ప్రాంత భూములకు ఇప్పటికే డిమాండ్‌ లక్షలు, కోట్లలో ఉండగా.. కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకే ఛాన్స్ ఉంది.
డబుల్ డెక్కర్ కారిడార్
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మౌళిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య కాగా.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే నగరంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించారు. ఇక ఉత్తర తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నగరంలోకి ఈజీగా చేరుకునేందుకు జాతీయ రహదారి 44పై సికింద్రాబాద్‌ జంక్షన్‌ ప్యారడైజ్‌ నుంచి తాడ్‌బండ్‌ జంక్షన్, బోయినపల్లి జంక్షన్‌ మీదుగా డెయిరీఫాం వరకు డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ ఇప్పటికే ఈ పనులకు శంకుస్థాపన చేశారు.తాజాగా ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ఎలివెటేడ్ కారాడార్ నిర్మాణంలో భాగంగా.. బేగంపేట వద్ద సొంరగం నిర్మించాల్సి ఉంది. ఈ టన్నెల్ మార్గం పనులకు ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తం కారిడార్‌ పొడవు 5.40 కిలోమీటర్లు కాగా.. ఇందులో టన్నెల్ మార్గం 0.6 కిలోమీటర్లు ఉండనుంది. బోయినపల్లి కూడలి నుంచి బాలంరాయి రోడ్డును కనెక్ట్ చేస్తూ ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం ప్రైవేటు ఆస్తులను అధికారులు గుర్తించారు.

త్వరలో బాధితులకు నష్టపరిహారం అందజేయనున్నారు. రోడ్డుకు రెండు వైపులా 200 మీటర్ల వరకు వెడల్పు చేయాల్సి ఉంది. దీంతో ఆ మేరకు ఆస్తులను అధికారులు గుర్తించారు. కంటోన్మెంట్‌లో రక్షణశాఖ ఆస్తులను కూడా హెచ్‌ఎండీఏకు అప్పగించే ప్రక్రియ జరుగుతోంది.కాగా, నేషనల్ హైవే 44పై రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి తాడ్‌బండ్, బోయిన‌ప‌ల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్‌ రోడ్డు వరకు 5.40 కిలోమీటర్ల డబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట ఔటర్ రింగు రోడ్డును కలుపుతూ 18.1 కిలోమీటర్ల మేర మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరం నుంచి బయటకు వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే 3 నుంచి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ జాతీయ రహదారి వైపు ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Read more:Hyderabad:ఇంటర్ పరీక్షల్లో తప్పులు

Related posts

Leave a Comment