Andhra Pradesh:టీడీపీకి ట్రబుల్ షూటర్ కావలెను:ఏపీ రాజకీయాలు గమనిస్తున్న వాళ్లకి స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమవుతోంది. టీడీపీలో నెమ్మదిగా సీనియర్లను పక్కన పెడుతూ యువరక్తాన్ని పార్టీలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక పదవులు వాళ్లకే దక్కుతున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచాక అధిక శాతం మంత్రి పదవులు యువకులకు కొత్తగా ఎమ్మెల్యేలగా ఎన్నికైన వాళ్లకు దక్కాయి. ప్రస్తుత జనరేషన్‌కి ఇది కరెక్టే. కానీ దీనిలో ఒక చిన్న ఇబ్బంది కూడా కనిపిస్తోంది.
టీడీపీకి ట్రబుల్ షూటర్ కావలెను
విజయవాడ, మార్చి 13
ఏపీ రాజకీయాలు గమనిస్తున్న వాళ్లకి స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమవుతోంది. టీడీపీలో నెమ్మదిగా సీనియర్లను పక్కన పెడుతూ యువరక్తాన్ని పార్టీలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కీలక పదవులు వాళ్లకే దక్కుతున్నాయి. 2024 ఎన్నికల్లో గెలిచాక అధిక శాతం మంత్రి పదవులు యువకులకు కొత్తగా ఎమ్మెల్యేలగా ఎన్నికైన వాళ్లకు దక్కాయి. ప్రస్తుత జనరేషన్‌కి ఇది కరెక్టే. కానీ దీనిలో ఒక చిన్న ఇబ్బంది కూడా కనిపిస్తోంది. చాలామంది సీనియర్లు సైలెంట్ అయిపోవడంతో కీలకమైన అంశాల్లో ఇంకా చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు కనిపిస్తోంది. సంక్షోభాన్ని పరిష్కరించి పరిస్థితులను పార్టీకి అనుకూలంగా మార్చే ట్రబుల్ షూటర్స్ కరవైపోయారు. ఏదైనా ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదురైనప్పుడు పరిష్కరించాలంటే దానికి కచ్చితంగా సీనియారిటీ కావాలి. ప్రత్యర్థి పార్టీలు ఏదైనా అంటే కౌంటర్ ప్రెస్‌మీట్ పెట్టి ఇటువైపు నుంచి మరో తిట్టే వాళ్లే ఉంటున్నారు. కానీ ఆ విమర్శలను పార్టీకి అనుకూలంగా మార్చే నైపుణ్యం సీనియారిటీతోనే వస్తుంది. ప్రస్తుత టిడిపిలో అది లోపించిందన్న అభిప్రాయం ఉంది.
ఒకప్పుడు చంద్రబాబుకి అండగా ఎర్రన్నాయుడు, కడియం శ్రీహరి, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, లాల్ జన్ బాషా లాంటి నేతలు ఉండేవారు. తర్వాత కాలంలో దేవినేని ఉమా, తలసాని శ్రీనివాస్ యాదవ్, మోత్కుపల్లి నరసింహులు ఇలా లిస్టు పెద్దగానే ఉండేది. ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్లు ఎక్కువ మంది వ్యాపారస్థులు, యువకులు కావడంతో ఆ ట్రబుల్ షూటర్ స్థానం లోపించిందన్న మాటలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. టిడిపి ఇటీవల కాలంలో రెండు ఘటనల్లో సీనియరిటీ లేమిని ఎదుర్కొంది. మొదటిది గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఇష్యూ. రెండోది గుంటూరు మిర్చి యర్డు అంశం. గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కు సంబంధించి ఉన్న ఇబ్బందులను, రిజర్వేషన్ వివాదాన్ని నారా లోకేష్ దృష్టికి సరైన సమయంలో అధికారులు తీసుకెళ్లలేదని అంటారు. ఆ తర్వాత జరిగిన తతంగం అందరికీ తెలిసిందే. తాము ఇచ్చిన జీవో 77కు విరుద్ధంగా తామే ఇచ్చిన నోటిఫికేషన్ కావడంతో విపక్ష వైసిపి దీనిలో పెద్దగా కలుగజేసుకోలేదు. కానీ టిడిపికి చాలా ఇబ్బంది కలిగించే పరిణామాలే గ్రూప్ 2 పరీక్ష నిర్వహాణలో ఉన్నాయి. దాదాపు 90 వేలమంది అభ్యర్థులకు సంబంధించిన అంశం కావడంతో వారిలో ఎంత మందిలో ఇంకా దీనిపై వ్యతిరేకత ఉందో బయటకు తెలియని పరిస్థితి. ఈ ఇష్యూని డీల్ చేయడంలో కూటమి ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
రెండోది గుంటూరు మిర్చి యార్డ్‌లో జగన్ నిరసనకు వెళ్లిన అంశం. మిర్చి రేటు పెంపు అంశంలో తన నిరసన తర్వాతే కేంద్రంతో మాట్లాడిన టిడిపి ప్రభుత్వం ఆచరణలోకి తెచ్చిందని ఆ క్రెడిట్ తమదేనని వైసిపి ఓన్ చేసుకుంది. దీనిపై ఒకటి రెండు ప్రెస్ మీట్‌లు పెట్టి జగన్‌ని విమర్శించడం మినహా పెద్దగా చేసింది ఏమి లేదు. ఇలాంటి అంశాల్లోనే సీనియారిటీ అనేది పనికొస్తుంది. జరిగిన ఇష్యూలోని అన్ని వివరాలను పార్టీకి అనుకూలంగా మార్చుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచడం సీనియర్ల వల్ల మాత్రమే అయ్యే పని. ‘కాంగ్రెస్‌లో సీనియర్ మోస్ట్ లీడర్, తమిళనాడుకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కామరాజ్ రూపొందించిందే కామరాజ్ ప్లాన్. దీని ప్రకారం సీనియర్లు ప్రభుత్వ పదవులు నుంచి దిగిపోయి పార్టీకి పరిమితం కావాలి యంగ్ జనరేషన్ మంత్రి పదవిలో ఉండాలి. స్వయంగా తానే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి 1963లో ఈ ప్లాన్ ప్రకటించారు. నిజానికి ఇది లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీని ప్రధానులు చేయడానికి మొరార్జీ దేశాయ్‌ని దెబ్బ కొట్టడానికి తీసుకొచ్చిన ప్లాన్ అనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇందిరా గాంధీకి తర్వాత కాలంలో ఇది ఎంతో ఉపయోగపడింది. ఈ ప్లాన్ పేరుతో సీనియర్లను పార్టీ పదవుల్లో ఉండిపోయేలా చేసి తనకు కావలసిన యంగ్ టీమ్‌ని ప్రభుత్వ పదవుల్లో నియమించుకున్నారామె. అప్పట్లో సరైన విపక్షం ఉండేది కాదు కాబట్టి కాంగ్రెస్‌కి ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు టిడిపి జగన్ రూపంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. మరి ఇలాంటి సమయంలో సీనియర్లు అందర్నీ పక్కన పెట్టేయడం టిడిపి వేస్తున్న సరైన స్టెప్పో కాదో భవిష్యత్ రాజకీయాలే నిర్ణయిస్తాయి.
Read more:Andhra Pradesh:ఓడిపోయాక గుర్చొచ్చాయ.. నాయనా సోషల్ మీడియాలో జగన్ పై సెటైర్లు