Andhra Pradesh:రాజధాని అయినా.. మురికి వాడే

construction of Amaravati

Andhra Pradesh:రాజధాని అయినా.. మురికి వాడే:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి 11ఏళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు ముగిసి ఏడాది సమీపిస్తోంది. విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. పదేళ్లలో హైదరాబాద్‌ స్థాయిలో కాకపోయినా కనీసం ఓ మాదిరి నగరాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌ పదేళ్లలో అభివృద్ధి చేసుకోలేక పోయింది.విజయవాడ నగరానికి పొరుగునే ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నగరం అమరావతి ఉంది. అమరావతి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా విజయవాడ రూపు రేఖలు మార్చే ప్రయత్నాలు మాత్రం జరగవు.

రాజధాని అయినా.. మురికి వాడే..

విజయవాడ, మార్చి 12,
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి 11ఏళ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు ముగిసి ఏడాది సమీపిస్తోంది. విభజన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. పదేళ్లలో హైదరాబాద్‌ స్థాయిలో కాకపోయినా కనీసం ఓ మాదిరి నగరాన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌ పదేళ్లలో అభివృద్ధి చేసుకోలేక పోయింది.విజయవాడ నగరానికి పొరుగునే ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నగరం అమరావతి ఉంది. అమరావతి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా విజయవాడ రూపు రేఖలు మార్చే ప్రయత్నాలు మాత్రం జరగవు. విభజన తర్వాత పదేళ్లుగా విజయవాడ కేంద్రంగానే పాలనా వ్యవహారాలు సాగుతున్నా దానిని బాగు చేసే ఆలోచన మాత్రం పాలకుల్లో కనిపించడం లేదు.2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్‌ తలరాత మారిపోతుందని అంతా భావించారు. 2014 డిసెంబర్‌లో రాజధాని ప్రాంతంపై స్పష్టత వచ్చిందిముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు విజయవాడ కేంద్రంగానే రాజధాని కార్యకలాపాలు సాగుతాయని క్లారిటీతో ఉన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందనే స్పష్టత దాదాపు ఆర్నెల్ల తర్వాత వచ్చినా చంద్రబాబు మాత్రం విజయవాడ కేంద్రంగానే పాలనా వ్యవహారాలు చక్కబెట్టడానికి మొగ్గు చూపారు.

హైదరాబాద్‌ నుంచి పాలనా వ్యవహారాలు నడిపించడం సరికాదనే ఉద్దేశంతో 2014లోనే విజయవాడలో నిర్మించిన పులిచింతల ఎస్‌ఈ కార్యాలయంలో సిఎం క్యాంపు కార్యాలయంగా మార్చారు. మొదట్లో దానిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కార్యాలయంగా చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత దానినే సిఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు.దాదాపు ఏడాదిన్నర పాటు విజయవాడలో ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలోనే సిఎంఓ నడిచింది. చంద్రబాబు ఉండవల్లి మకాం మార్చిన తర్వాత కొంత కాలం పాటు దానిని ఏపీ హైకోర్టుగా వినియోగించారు. ఆ తర్వాత దానిని గవర్నర్‌ బస చేయడానికి వీలుగా రాజ్‌భవన్‌ చేశారు. 2014-19 మధ్య కాలంలో విజయవాడలో అంతకు మించి పెద్దగా మార్పు ఏమి రాలేదు.2015 మే తర్వాత హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ తరలించాలని నిర్ణయించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. విజయవాడ శివార్లలో ఉన్న ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, తాడేపల్లి, ప్రసాదం పాడులో అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.మరికొన్ని కార్యాలయాలను విజయవాడ బస్టాండ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేశారు. పదేళ్లుగా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు సాగుతున్నాయి. పదేళ్లలో ప్రభుత్వ శాఖలు చెల్లించిన అద్దెలతో ఈ పాటికి వాటికి సొంత భవనాలు సమకూరి ఉండేవి.

అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాన్ని పట్టించుకోలేదు.పదేళ్లుగా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవహారాలు సాగుతున్నా విజయవాడ నగరంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. 2002-2003లో చివరి సారి విజయవాడలో రోడ్లను విస్తరించారు. ఆ తర్వాత 2016 పుష్కరాల సమయంలో మరికొన్ని రోడ్లను విస్తరించారు. 2014లో, 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రత్యేకంగా విజయవాడ నగరాభివృద్ధి కోసం ఒక్క రుపాయి కూడా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయలేదు. వరద నీటి ముంపు నివారణ కోసం కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లను వరదలు రాని ప్రాంతాల్లో మురుగు నీటి కాల్వల కోసం ఖర్చు పెట్టేశారు. అవి కూడా అసంపూర్ణంగా ముగిశాయి.రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో పట్టణీకీకరణ విపరీతంగా పెరిగింది. నగరంలో రద్దీ పెరిగింది. కానీ అభివృద్ధి జాడలు మాత్రం లేవు. ఇప్పటికీ ప్రభుత్వం సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే ప్రైవేట్ హాటళ్లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. రాజధాని స్థాయి నగరంగా విజయవాడ ఎదిగినా అందుకు తగ్గ ఏ హంగు ఆర్భాటం అక్కడ కనిపించవు. అందుకే ఆలిండియా సర్వీస్ అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు పదేళ్లుగా శుక్రవారం మధ్యాహ్నం మాయమై సోమవారం ప్రత్యక్షం అవుతుంటారు.

విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థగా ఉన్న ఉడాను రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌‌డిఏగా మార్చారు. ఈ క్రమంలో సీఆర్‌‌డిఏ అంటే అమరావతి మాత్రమే అన్నట్టు మారిపోయింది. మిగిలిన పట్టణాల్లో అభివృద్ధి ఊసు లేకుండా పోయింది. సీఆర్‌డిఏ పరిధిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాలు ఉంటే రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 గ్రామాలు తప్ప మరో ధ్యాస లేకుండా పోయిందని సీపీఎం నాయకుడు చిగురుపాటి బాబు రావు ఆరోపించారు. సీఆర్‌డిఏ చట్టంలో ఇండిస్ట్రియల్‌, ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌, సీఆర్‌డిఏ పరిధిలోని నగరాలు, పట్టణాల అభివృద్ది కోసం పదేళ్లలో ప్రత్యేకంగా ఏమి ఖర్చు చేయలేదని గుర్తు చేశారు.2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టినా వాటిని తాత్కలిక రాజధానిగా చెప్పుకుంటూ వచ్చారు. అంతర్జాతీయ సంస్థల డిజైన్లు, దేశ విదేశాల్లో పర్యటనలు, ప్రపంచ స్థాయి నగర నిర్మాణం కోసం తపించారు. ఈ క్రమంలో విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. దీంతో కనీసం మధ్య స్థాయి నగరాలుగా కూడా అవి ఎదగలేకపోయాయి.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ మరో రకమైన గండాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.చంద్రబాబు ప్రారంభించిన అమరావతి నిర్మాణాన్ని కొనసాగించడానికి ఇష్టపడని వైసీపీ అధ్యక్షుడు జగన్‌, విశాఖపట్నాన్ని గమ్యస్థానంగా మార్చుకోవాలని భావించారు. కాస్మోపాలిటిన్‌ కల్చర్‌ ఉన్న విశాఖతో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ అభివృద్ధి చెందుతుందని భావించారు. దీంతో అమరావతి ఐదేళ్లు పక్కకు పోయింది. అదే సమయంలో ఐదేళ్లుగా విజయవాడ పొరుగునే ఉంటున్నా నగరాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమల్ని ఆకర్షించడం, ఉపాధి కల్పించే ప్రాజెక్టులు విజయవాడకు తీసుకు రావడం వంటివి ఏమి జరగలేదు. ఇలా టీడీపీ అధికారంలో ఉన్నపుడు, వైసీపీ హయంలోను విజయవాడ నష్టపోయింది.

2014- 19 మధ్య కాలంలో విజయవాడ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ విపరీతంగా పెరిగింది. ఆరేళ్లుగా అది కోలుకోలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయవాడ మార్కెట్‌లో స్తబ్ధత పోలేదు. పెట్టుబడుల్లో అపనమ్మకం, అనిశ్చితి కొనసాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తైనా రెండు మూడేళ్లుగా ఖాళీగా ఉన్నవి గణనీయంగా ఉన్నాయి.అమరావతి నిర్మాణానికి చాలా సమయం ఉందని చంద్రబాబు భావించడం, ఆ తర్వాత అమరావతి కాకుండా విశాఖ వెళ్లిపోవాలని జగన్ భావించడం రెండూ విజయవాడను తీవ్రంగా దెబ్బతీశాయి. పొరుగు రాష్ట్రాల్లో మాదరి ఏపీలో కళ్లు జిగేల్ అనిపించే స్థాయిలో కాకున్నా కనీసం ఓ మోస్తరు అభివృద్ధి కూడా జరగలేదు. దీంతో ఇప్పటికి ఉపాధి కోసం హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు.మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వేల కోట్లను ఖర్చు చేస్తోంది. అందులో పదో వంతు ఖర్చుతో మరో రెండు, మూడు నగరాల్లో చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌‌లో డబ్బులు పెట్టాలనుకునే పెట్టుబడిదారుల కళ్లకు జిగేల్మని కనిపించే ఒక పెద్ద నగరం, స్థిరమైన నగరం కనిపించడం లేదు. అమరావతితో పాటు విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాలకు మరో నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన ఉంది. ఈ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.

Read more:Andhra Pradesh: అమరావతి నిర్మాణానికి రూ.64వేల కోట్ల ఖర్చు

Related posts

Leave a Comment