Mumbai:న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైనల్ ఖరారు:ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలింది. పాత కాపు కివీస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం టోర్నీ రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై 50 పరుగులతో విజయం సాధించిన న్యూజిలాండ్ దూసుకెళ్లింది. లాహోర్ లోని గఢాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా.. టోర్నీ ఫైనల్ ఖరారు
ముంబై, మార్చి 6
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలింది. పాత కాపు కివీస్ తో అమీతుమీ తేల్చుకోనుంది. బుధవారం టోర్నీ రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై 50 పరుగులతో విజయం సాధించిన న్యూజిలాండ్ దూసుకెళ్లింది. లాహోర్ లోని గఢాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర సెంచరీ (101 బంతుల్లో 108, 13 ఫోర్లు, 1 సిక్సర్) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతనితో పాటు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్టన్నింగ్ శతకం (94 బంతుల్లో 102, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. దీంతో న్యూజిలాండ్ టోర్నీ చరిత్రలో హైయెస్ట్ స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది. ఇక ఛేదనలో చోకర్స్ అనే ముద్రకు సఫారీలు న్యాయం చేశారు.
50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేశారు. దీంతో 50 పరుగులతో కివీస్ నెగ్గింది. విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ (67 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసినా లాభం లేకుండా పోయింది. అలాగే రస్సీ వాన్ డర్ డస్సెన్ (66 బంతుల్లో 66, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. మిషెల్ శాంట్నర్ మూడు వికెట్లతో కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాడు. ఈమ్యాచ్ లో గెలిచిన కివీస్ ఈనెల 9న దుబాయ్ లో జరిగే ఫైనల్లో భారత్ ను ఢీకొననుంది. భారీ టార్గెట్ ను చూసి ప్రొటీస్ ముందే చేతులెత్తేసింది. ఏ దశలోనూ మ్యాచ్ ను ఛేజ్ చేస్తుందని అనిపించలేదు. ఆరంభంలోనే ర్యాన్ రికెల్టన్ (17) వికెట్ కోల్పోయిన సఫారీలు వెనుకంజ వేశారు. ఆ తర్వాత కెప్టెన్ టెంబా బవూమా (71 బంతుల్లో 56, 4 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నాన్ని డస్సెన్ చేశాడు. వీరిద్దరూ చాలా నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం మందగించింది. ముఖ్యంగా బవూమ జిడ్డుగా ఆడుతూ సహచర బ్యాటర్ పై ఒత్తిడి పెంచాడు.
మరోవైపు డస్సెన్ మాత్రం కాస్త దూకుడుగా ఆడారు. నాకౌట్ లో ఛేజ్ చేసే సమర్థవంతమైన ప్రణాళికను ప్రొటీస్ రూపొందించ లేకపోయింది. వీరిద్దరూ 105 బంతుల్లో 105 పరుగులు జత చేశారు. ఈ క్రమంలో 64 బంతుల్లో బవూమా, డస్సెన్ 51 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో బవూమా ఔటయ్యాడు. జిడ్డూ బ్యాటింగ్ కు తోడు, మిడిలార్డర్ వైఫల్యం సఫారీల కొంపముంచింది. ఐడెన్ మార్క్ రమ్ (31), హెన్రిచ్ క్లాసెన్ (3), వియాన్ మల్డర్ (8) విఫలమయ్యారు. అయితే మరో వైపు డేవిడ్ మిల్లర్ మాత్రం చివరికంటా పోరాటం చేసి, ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇక బౌలర్లు సమష్టిగా రాణించి, బ్యాటింగ్ ప్యారడైస్ పై ప్రొటీస్ ను కట్టడి చేశారు. మిగతా బౌలర్లలో మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిఫ్స్ లకు రెండు, మిషెల్ బ్రేస్ వెల్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం ద్వారా.. ప్రొటీస్ పై నాకౌట్ లో అజేయ రికార్డును కివీస్ నిలబెట్టుకుంది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి ప్రాతినిథ్యం వహించిన రెండు జట్లు భారత్, కివీస్ ఫైనల్ కు చేరుకున్నాయి. దీంతో 2000 టోర్నీ ఫైనల్ మరోసారి రిపీట్ అయిందని పలువురు భావిస్తున్నారు. ఆ ఎడిషన్ లో భారత్ పై విజయం సాధించి, కివీస్ టోర్నీని నెగ్గింది. దీంతో ఆదివారం మ్యాచ్ లో విజయం సాధించి, ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.
Read more:Lucknow:45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం