AP Inter Exams : ఇంటర్ పరీక్షలకు అంతా సిద్ధం

ap inter exams
  • ఇంటర్ పరీక్షలకు అంతా సిద్ధం

విజయవాడ, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్‌ పరీక్షలకు అంతా సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్‌ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్‌ ఇయర్‌, మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఇప్పటికే ఇంటర్‌ బోర్డు జారీ చేసింది. హాల్‌టికెట్లను విద్యార్థులే నేరుగా ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.మరోవైపు పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్‌ ఇంటర్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 కేంద్రాలను ఏర్పాట్లు చేయగా.. అందులో 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. వీటన్నింటిలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి అమరావతిలోని చీఫ్‌ సూపరింటెండెంట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్‌ విధించనున్నారు. అలాగే చుట్టుపక్కల ఉండే జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్‌ నెట్‌ కేంద్రాలు పూర్తిగా మూసేలా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను కూడా నెలకొల్పనున్నారు..పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించేది లేదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్ధులతోపాటు ఉపాధ్యాయులు కూడా మొబైల్‌ ఫోన్లను పరీక్ష కేంద్రానికి బయటే వదిలేసి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్షాకేంద్రాలకు విద్యార్ధులు సకాలంలో చేరుకోవడానికి వీలుగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రశ్నపత్రాలను పోలీసు అధికారుల సమక్షంలో భద్రపరిచి.. ఎలాంటి లీకేజీలకు తావులేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు సదుపాయాలను అధికారులు పూర్తి చేశారు.

Read : Vijayawada:ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు.. వచ్చే ఏడాది నుంచి రద్దు

Related posts

Leave a Comment