Andhra Pradesh:షర్మిల దెబ్బకు కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్:సహజంగా అధికారపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపక్షపార్టీలను ఎవరూ పట్టించుకోరు. అధికారంలో లేని వారిని విమర్శించి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే వారు పవర్ లో లేరు కాబట్టి విమర్శలు చేసినా వారు చేసేది శూన్యమే.
షర్మిల దెబ్బకు కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్
విజయవాడ, ఫిబ్రవరి 17
సహజంగా అధికారపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపక్షపార్టీలను ఎవరూ పట్టించుకోరు. అధికారంలో లేని వారిని విమర్శించి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే వారు పవర్ లో లేరు కాబట్టి విమర్శలు చేసినా వారు చేసేది శూన్యమే. కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పట్ల సాఫ్ట్ కార్నర్ గా ఉండటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఇలా అయితే ఉన్ననాలుగు ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్, గిడుగు రుద్రరాజు వంటి వారు నాటి అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని పోరాడిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలే గుర్తు చేస్తున్నారు.. కానీ వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ అయిన నాటి నుంచి తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పై ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు ప్రయోజనం లేదు. ఎందుకంటే జగన్ అధికారంలో లేరు. ఆయనను విమర్శించినా జనం పెద్దగా పట్టించుకోరు. ఆయన చేతుల్లో ఏమీ లేదు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయి తన ఇంటికే పరిమితయ్యారు. అలాంటి జగన్ పై రోజూ విమర్శలు చేయడం వల్ల ఏం ప్రయోజనం చెల్లీ అంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది.
ఎన్నికల సమయంలో విమర్శలు చేసినా అర్థముంది. కానీ ఇప్పుడు జగన్ పై చేసే విమర్శలకు, ఆరోపణలకు విలువలేదన్న విషయం షర్మిలమ్మకు తెలియదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అవకాశమొచ్చినప్పుడల్లా జగన్ ను వైఎస్ షర్మిల విమర్శించడాన్ని ప్రజలు కూడా పార్టీ పరంగా చూడటం లేదు. ఇది వ్యక్తిగత ద్వేషంతోనే విమర్శలు చేస్తున్నారన్నది బలంగా ముద్రపడిపోయింది. జగన్ గత ఎన్నికలలో ఓటమి పాలయింది తన వల్లనే అనుకునే భ్రమలో షర్మిల ఉందని, దాని నుంచి బయటకు వస్తేనే కొంత పార్టీతో పాటు ఆమెకు కూడా ప్రయోజనం అని నెట్టింట ప్రశ్నిస్తున్నారు. చచ్చిన పామును ఇంకా ఎంతకొట్టినా ప్రయోజనం ఏముంటుందని వారు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు ఏపీలో ఒక్క శాతం ఓటు కూడా పెరగలేదు. ఎందరు పీసీసీ చీఫ్ లుగా మారినా కాంగ్రెస్ ను జనం ఆదరించలేదు. ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ గత మూడు ఎన్నికల్లో గెలుచుకోలేకపోయింది. పైగా వైఎస్ షర్మిల మిగిలిన పీసీసీ చీఫ్ లకు భిన్నంగా అధికార పార్టీ పట్ల మెతక వైఖరి తగదని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించకపోగా, ప్రతపక్ష పార్టీపై చిందులు తొక్కినందున కాంగ్రెస్ తో పాటు కూటమి పార్టీలకు కూడా నష్టమేనని, అది జగన్ కు లాభిస్తుందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. కానీ షర్మిల మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. మీడియా సమావేశం పెట్టినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అది జగన్ కు వ్యతిరేకంగానే ఉండటంతో పరోక్షంగా వైసీపీకి షర్మిల మేలు చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మెతక వైఖరిని ప్రదర్శించినంత మాత్రాన ఓట్లు పెరుగతాయా? చెప్పు చెల్లీ అని కాంగ్రెస్ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరి షర్మిలమ్మ దీనికి సమాధానం ఏంచెబుతారో చూడాలి.
Read more:Nellore:టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత