వంశీని పక్కాగా బుక్ చేస్తున్నారా ?
విజయవాడ, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్)
వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ నేతలు ఖండిస్తుంటే.. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. లిస్టులో మరికొందరు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. వంశీకి నోటీసులు ఇచ్చారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ ఖండించగా.. టీడీపీ నాయకులు సమర్థిస్తున్నారు.’వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ ఏంటి. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు’ అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ ప్రత్యక్ష ఉదాహరణ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు కేసు వెనక్కి తీసుకున్నాడు. అయినా అక్రమంగా వంశీని అరెస్ట్ చేయడమేంటి? వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని పలువురు వైసీపీ నేతలు స్పష్టం చేశారు’వల్లభనేని వంశీ లాంటి వారిని వేటాడే ఆట మొదలైంది. వంశీ, దేవినేని అవినాష్, కొడాలి నాని చీడపురుగులు. కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వంశీకి తగిన శాస్తి జరిగింది. వంశీ అరెస్టుతో కూటమికి ఓటేసిన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈరోజు నుంచి తెలుస్తుంది. వంశీ, అతని అనుచరులు నా ఇంటి పైన దాడికి వచ్చిన సందర్భంలో ఆనాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నేను ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం డిమాండ్ చేశారు.వంశీపై కేసులు నమోదు చేసే క్రమంలో పోలీసులు ఆధారాలు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో వంశీపై ఫిర్యాదు చేసిన కిరణ్, సత్య వర్ధన్ కుల ధ్రువీకరణ పత్రాల కావాలంటూ విజయవాడ రూరల్ ఎమ్మార్వోకు విజయవాడ ఏసిపి దామోదర్ లేఖ రాశారు. వల్లభనేని వంశీతో పాటు మరికొందరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినందుకు ఫిర్యాదుదారుల కుల దృవీకరణ పత్రం అవసరం ఏర్పడింది.కేసు విచారణ ముందుకు వెళ్లాలంటే ఫిర్యాదు దారుల కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అంటున్నారు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్. ఏసీపీ లేఖతో రెవిన్యూ అధికారులను రామవరప్పాడులోని సత్యవర్ధన్ ఇంటికి వెళ్లారు. అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఆయన ఫ్యామిలీ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. రామవరపాడులో ఇంట్లో ఎవరు అందుబాటులో లేనందున రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు.వంశీతోపాటు మరికొందరిపై ఎస్టీ, ఎస్సీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఫిర్యాదుదారుల కమ్యూనిటీ నిర్ధారించాల్సి వుంది. ఇదిలావుండగా వారం రోజులుగా సత్య వర్థన్‌ను విశాఖపట్నంలో బంధించారు వంశీ అనుచరులు. సత్యవర్థన్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్యామిలీ సభ్యులు. వర్థన్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వైజాగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వంశీ అనుచరుల నుంచి సత్యవర్థన్ ను కాపాడారు పోలీసులు.ఇదిలావుండగా పోలీసుల తీరుపై వంశీ లాయర్లు మండిపడ్డారు. గంటకు పైగా కృష్ణలంక పీఎస్ లో వల్లభనేని వంశీ ఉంచి విచారించారు పోలీసులు. ఆయన నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. మరి న్యాయమూర్తి ముందు ఇవాళ వంశీని హాజరుపరుస్తారా లేదా అనేది చూడాలి.
కేసు ఏంటీ.. రెండేళ్ల కిందట గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. రాళ్లు, కర్రలతో కొందరు దాడికి తెగబడ్డారు. ఓ కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సత్యవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అతన్ని బెదిరించి, కిడ్నాప్ చేసి.. దాడి చేసినట్టు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.
పక్కాగా సెక్షన్లు వల్లభనేని వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 140 (1), 308, 351 (3), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. అయితే పోలీసులు గత నాలుగు గంటలుగా సత్యవర్థన్ కిడ్నాప్ పైనే ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. కోర్టులో అఫడవిట్ ను విత్ డ్రా చేసుకోవడం వెనక ఆయనను బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలోనే ప్రశ్నిస్తున్నారు. పది లక్షల రూపాయల నగదును కూడా సత్యవర్థన్ కు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఐదుగురిపైన కూడా కేసులు నమోదు చేశారు. వల్లభనేని వంశీపై పెట్టిన కేసులు నాన్ బెయిల్ బుల్ వి ఉండటంతో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవని న్యాయనిపుణులు చెబుతున్నారు. విశాఖలో ఉన్న సత్యవర్థన్ ను కూడా విజయవాడకు తీసుకు వచ్చి పటమట పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు. సత్యవర్థన్ స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేస్తున్నారు. పకడ్బందీగా పోలీసులు ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటి వరకూ తమకు చెప్పలేదని వంశీ సతీమణి తెలిపారు. పోలీసులు ఇప్పటి వరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని భార్య పంకజ శ్రీ అన్నారు. అయితే విచారణ ముగిసిన తర్వాత వల్లభనేని వంశీని వైద్య పరీక్షలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపర్చనున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.