గ్రేటర్ లో బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్
హైదరాబాద్, ఫిబ్రవరి 12, (న్యూస పల్స్)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు అవిశ్వాస తీర్మానం వ్యవహారంతో రాజకీయపార్టీల వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయ సాధించి ఇటీవల కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతలపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలు తమ కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేస్తు్న్నాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవిశ్వాసంపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించారు. మరోవైపు బుధవారం నగర కార్పొరేట్లతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశం కానున్నారు. స్టాడింగ్ కమిటీలో పోటీ, మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పై బీఆర్ఎస్ కార్పొరేటర్లతో తలసాని చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని తలసాని గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. స్టాండింగ్ కమిటీలో పోటీ చేసే అంశంతో పాటు అవిశ్వాసంపై చర్చించారు. అయితే బీఆర్ఎస్ అవిశ్వాసం పెడితే తాము తీర్మానం పెట్టి తీరుతామని బీజేపీ కార్పొరేటర్లు అంటున్నారు. దీంతో ఈ రెండు పార్టీలు అవిశ్వాసం విషయంలో చేతులు కలిపే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఆవిశ్వాసాన్ని ఎదుర్కొడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. గురువారం రోజు నగర్ ఇన్చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశమై అవిశ్వాసాన్ని ఎదుర్కోనే అంశాన్ని చర్చించనున్నారు.ఇదిలా ఉంటే, స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నలుగురు కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ నుంచి కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుంచి హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప నామినేషన్లు దాఖలు చేశారు.జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారికి కార్పొరేటర్లు తమ నామినేషన్ పత్రాలను అందించారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. నాలుగేళ్లుగా తమకు స్టాండింగ్ కమిటీలో చోటు లేదని.. ఈసారి తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, పార్టీలకు అతీతంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా మాకు ఓటేస్తారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు.