టాలీవుడ్ పై పైరసి భూతం
హైదరాబాద్ ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్)
టాలీవుడ్ ను పైరసీ భూతం వెంటాడుతోంది. ఏ సినిమా అయినా…థియేటర్లలో విడుదలైన గంటల వ్యవధిలో ఆన్ లైన్ లో దర్శనం ఇస్తుంది. పవన్ కల్యాణ్ అత్తారింటిది దారేది చిత్రం నుంచి తాజాగా విడుదలైన తండేల్ వరకు ఎన్నో చిత్రాలు పైరసీ బారిన పడినవే. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి వందల వంది టెక్నీషియన్లతో నెలల పాటు తీసిన చిత్ర బృందం కష్టాన్ని గంటల వ్యవధిలో బూడిదపాలు చేస్తున్నారు. పైరసీ వెబ్ సైట్స్, ఫ్యాన్స్ వార్…ఇలా కారణాలు ఏమైనా చివరికి నష్టపోయేది సినిమా నిర్మాతలే.పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నా…ఎంత వరకూ ఆచరణలో ఉన్నాయన్నదే పెద్ద ప్రశ్న. ఎంత మంది నిందితులను చట్టం ముందు నిలబెట్టారనే ప్రశ్నలు తలెత్తు్తున్నాయి. టెక్నాలజీ సాయంతో రెచ్చిపోతున్న పైరసీ కేటుగాళ్లకు అడ్డుకట్ట వేయలేమా? అనే సందేహాలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయిహీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘తండేల్’ సినిమాను పైరసీ భూతం వెంటాడుతోంది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం తీవ్ర చర్చనీయాంశమైంది. చిత్ర నిర్మాత బన్నివాసు స్పందిస్తూ… ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఛైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ఘటనపై ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు.ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమ పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణమని నిర్మాత బన్నీవాసు ఆవేదన చెందారు.
చిత్ర విజయానికి పైరసీ ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఇలాంటి తప్పులు చేస్తున్నారన్నారు. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో పైరసీ లింక్స్‌ను ఫార్వర్డ్ చేస్తున్నారని అన్నారు. పైరసీ చేస్తున్న వారిని, దాన్ని ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతున్నామని, వాళ్లంతా జైలుకు వెళ్లే అవకాశముందని నిర్మాత బన్నీ వాసు హెచ్చరించారు.ఫిల్మ్ ఛాంబర్ చర్యలతో కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ జరగడం లేదని, ఇటీవల కాలంలో మళ్లీ ఈ రాక్షసి విరుచుకుపడుతోందని నిర్మాత బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు. గేమ్‌ఛేంజర్ సినిమా కూడా ఆన్లైన్లో విడుదల చేశారన్నారు. చాలా ప్రయత్నాలు చేసి ఆన్ లైన్ లింక్‌లు తొలగించినట్లుగా చెప్పారు. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్లో ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేశామన్నారు. వాళ్లు పగలూ రాత్రి పైరసీపై నియంత్రణకు పని చేస్తుంటారన్నారు.హీరో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ఏపీలోని కొన్ని కేబుల్ టీవీ ఛానెల్స్‌లో పైరసీగా ప్రసారం చేశారు. సినిమా నిర్మాతలకు తీవ్ర నష్టం కలిగేలా లోకల్ టీవీ ఛానెల్స్‌లో హెచ్డీ ప్రింట్‌ను ప్రసారం చేశారు. ఈ సినిమా పైరసీ కాపీ ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు.ఇటీవల కాలంలో సోషల్ మీడియా విచ్చలవిడితనంలో ఫ్యాన్స్ వార్ పేరిట ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఎవరో ఒక హీరో పేరు, ఫోటోతో సోషల్ మీడియా ఖాతా తెరిచి నిత్యం వివాదాస్పదత వ్యాఖ్యలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. దీంతో పాటు కొత్త సినిమాలు విడుదల సమయంలో సినిమాల్లోని కీలక అంశాల వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఫ్యాన్స్ వార్ పేరిట పైరసీ కాపీలను ప్రోత్సహిస్తు్న్నారు. థియేటర్లలోనే నేరుగా సెల్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు. ఫ్యాన్ వార్ లో హెచ్డీ ప్రింట్ లు సోషల్ మీడియాలో లీక్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి.
పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని 2023లో ఓ నివేదిక తెలిపింది. సినిమా నిర్మాణానికి పడిన కష్టం పైరసీ వల్ల వృథాగా పోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించారు. అలాగే ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం 1952లో సవరణలు చేసి, కొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ముంబయిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో, ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరిస్తారు.డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్న పైరసీ కంటెంట్‌పై నోడల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే 48 గంటల్లో ఆ కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించేలా సీబీఎఫ్సీ అధికారులు చర్యలు చేపడతారు. సినిమాలను అనధికారికంగా రికార్డ్ చేయడం, అనుమతి లేకుండా బహిరంగంగా ప్రదర్శించడం, ఆన్లైన్లో, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం తీవ్రమైన నేరంగా సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం పరిగణిస్తారు.ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి మూడు నెలల నుంచి మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతాన్ని నిందితులు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. సినిమాకు సంబంధించిన కొద్ది భాగాన్ని కూడా పైరసీ చేయడం శిక్షార్హమే.అయితే కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ వర్గాలు కోరుతున్నాయి. పైరసీపై చట్టాలను మరింత కఠినం చేసి బాధ్యులకు త్వరగా శిక్షలు పడేలా చేస్తే…భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు.
Read : Srikakulam:ప్రతి గ్రామంలోనూ..తండేల్ కథే