విజయవాడ, జూన్ 15,(న్యూస్ పల్స్)
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో ఆయన డిప్యూటీ సీఎం అని ప్రమాణం చేయలేదు. కేబినెట్ మంత్రిగానే ప్రమాణం చేశారు. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారు.. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు. కానీ రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రులు తమ డిప్యూటీలను పెట్టుకోవచ్చు.
వైసీపీ హయాంలో ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ వారికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఏమీ లభించలేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉండేలా ప్రభుత్వం చూస్తోంది. డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తన తో సమానమని చంద్రబాబు కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు.
శాఖల పరంగా కూడా అత్యంత కీలక శాఖలను కేటాయించారు. మామూలుగా హోంశాఖ నిర్వహించేవారు ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉంటారని అనుకుంటారు. కానీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు హోంశాఖ కేటాయించారు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు చేతిలోనే ఉంది. పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఇవ్నీ అత్యంత కీలకమైనశాఖలే. అందుకే పవన్ ప్రాధాన్యం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉంటుంది.
డిప్యూటీ సీఎంలకు ఇచ్చే విలువ సీఎం ఇచ్చే అధికారాల్ని బట్టే ఉంటుంది. ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఉన్న ఐదుగురు డిప్యూటీ సీఎంలను చూసి అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు – ఈ ఐదు వర్గాలకూ డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు జగన్. జగన్ హయాంలో మొత్తం 9 మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. పాముల పుష్పశ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, రెండు నుంచి మూడేళ్ల మధ్య డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు.
కానీ వీరెవరూ ఎప్పుడూ స్వతంత్రంగా తమ శాఖలపై సమీక్షలు నిర్వహించినట్లుగా కూడా ఎప్పుడూ మీడియాకు సమాచారం రాలేదు. తమ శాఖల్లో విధులు వారు ఎంత నిర్వర్తించారో స్పష్టత లేదు. ఎక్కువగా వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. అయితే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తే మాత్రం పలుకుబడి ఉంటుంది. పవన్ కల్యాణ్ తనతో సమానమని చంద్రబాబు చెబుతున్నారు. సీఎం స్థాయిలో కాకపోయినా కాస్త తక్కువగా ఆయినా పవన్ కల్యాణ్‌కు ప్రోటోకాల్ లభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో పలుకుబడి లభిస్తుంది. అది రాజకీయంగా వచ్చే హోదా. పవన్ కల్యాణ్‌కూ దీనిపై స్పష్టత ఉంది. ప్రస్తుతం ప్రోటోకాల్ వ్యవహారాల్లోనూ చంద్రబాబు తర్వాత పవన్ పేరే ఉంటోంది. అదే అసలైన డిప్యూటీ సీఎం గౌరవం అనుకోవచ్చు.