ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం 10 రోజులపాటు కల్పించారు.
తొక్కిసలాటపై విచారణ కమిటీ
తిరుపతి, జనవరి 23
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశించింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం 10 రోజులపాటు కల్పించారు. ఈనెల 10 నుంచి 19 వరకు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించుకున్నారు. అయితే ఈ దర్శనాలకు సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ ఈనెల 9న తిరుపతిలో ప్రారంభించారు. చాలా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓ కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తిరుమల చరిత్రలోనే అత్యంత విషాద ఘటన ఇది. అందుకే ప్రభుత్వం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది. కొంతమంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మరికొందరిపై బదిలీ వేటు వేసింది. త్వరలో ఈవో తో పాటు అడిషనల్ ఈవో పై చర్యలు ఉంటాయని ప్రచారం నడిచింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో న్యాయవిచారణ జరిపించాలని నిర్ణయించింది. ఆరు నెలల లోగా ఈ ఘటనపై న్యాయవిచ్చారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.ఈ ఘటనలో చనిపోయిన వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేసింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షలు, గాయాలైన వారికి రెండు లక్షలు చొప్పున పరిహారం అందించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కూడా ఇచ్చారు. ఆయా కుటుంబాల్లో చదువుకోవాల్సిన పిల్లల బాధ్యతను టీటీడీ తీసుకుంది. అయితే ఈ ఘటన విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. న్యాయ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.గత రెండు వారాలుగా తిరుపతితొక్కిసలాట ఘటనకు సంబంధించి వివాదం కొనసాగింది. ప్రభుత్వంతో పాటు టీటీడీపై విమర్శలు చేసింది వైసిపి. ఇందులో టిటిడి బాధ్యతరాహిత్యం ఉందని స్పష్టమైంది. అయితే ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా స్పందించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో అంతా క్షమాపణలు చెప్పాలని కోరారు. స్వయంగా మృతుల కుటుంబాలను పరామర్శించి పరిహారం చెక్కులు అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రెండు బృందాలు మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశాయి. అయితే ఈ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. అయినా సరే న్యాయవిచారణకు ప్రభుత్వం ఆదేశించడం విశేషం.జస్టిస్ సత్యనారాయణమూర్తి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఆయన నేతృత్వంలో ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ జరగనుంది. జూలై నాటికి నివేదిక అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరోవైపు టీటీడీ విషయంలో కఠిన చర్యలకు దిగేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సమూల ప్రక్షాళనకు.. టీటీడీలో సమన్వయానికి సైతం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read:Vijayawada:గెలిచినా హవా వాళ్లదేనా