మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో కురిడీ కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వరంగా మారింది.
విపరీతంగా పెరిగిన కొబ్బరి ధర..
రాజమండ్రి, జనవరి 20
మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో కురిడీ కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వరంగా మారింది. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో గోదావరి కొబ్బరిని ఉపయోగిస్తోన్నారు. దీంతో రికార్డు స్థాయిలో ధరలు పెరిగి, కొబ్బరి రైతులకు లాభాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అంతేకాకుండా గోదావరి జిల్లాల కొబ్బరిని మహా కుంభమేళాలో ఉపయోగించడం మహా ప్రసన్నంగా రైతులు భావిస్తోన్నారు. దీంతో కుంభమేళా గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వరంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని వినియోగిస్తారు. దీంతో గోదావరి జిల్లాల కొబ్బరికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దొరికే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ప్రతి ఏటా ఎగుమతి అవుతున్నప్పటికీ, ఈ ఏడాది మహా కుంభమేళా జరుగుతుండటంతో కొబ్బరి ఎగుమతులు విపరీతంగా పెరుగుతున్నాయి.దీంతో ఇప్పటి వరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం కొబ్బరికి ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి పంటకు కేరాఫ్ అడ్రస్‌గా కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పంట ఎక్కువ ఉత్పత్తి అవుతోంది.
కొబ్బరి మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో కురిడీ కొబ్బరి 1000 కాయల ధర రూ.17 వేలు నుంచి రూ.20 వేల వరకూ పలుకుంది. పాతకాయలో గండేరా రకం 1000 కొబ్బరి కాయల ధర రూ.20 వేలు వరకు ఉంది.దీనిలో గటగట రకం రూ.17,500 వరకు ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం 1000 కొబ్బరి కాయలకు రూ.20 వేల పలకడం ఇదే తొలిసారి. 2016లోని కుంభమేళా సందర్భంగా 1000 కొబ్బరి కాయలు రూ.18 వేలు మాత్రమే ఉండేది. ఇదే ఇప్పటి వరకు గరిష్ఠ ధరగా ఉంది. అయితే ఈ రికార్డుకు బ్రేక్ పడి ఇప్పుడు ఏకంగా రూ.20 వేలు దాటుతోంది.ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ్మ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తుంటారు. కురిడీ కొబ్బరి అధికంగా ఉత్పత్తయ్యే తమిళనాడు, కేరళలో సైతం ఉత్పత్తి తగ్గడంతో గోదావరి జిల్లాల కురిడీ కొబ్బరి ఎగుమతులు పెరిగాయి. రోజుకు రూ.8 లక్షల విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోన్నాయి. సాధారణంగా జరిగే ఎగుమతులకు కుంభమేళా తోడవ్వడంతో ఎగుమతులు పెరుగుతున్నాయని, దీంతో కురిడీ కొబ్బరికి ధర పెరిగిందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.మార్కెట్‌లో కొబ్బరికి మంచి ధర రావడంతో రైతుల్లో, వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీ కొబ్బరి ధర రూ.20 వేలకు తాకడంతో శుభపరిణామంగా రైతులు ఫీలవుతున్నారు. మహా కుంభమేళాలో డిమాండ్ పెరగడం, తమిళనాడు, కేరళ నుంచి ఉత్పత్తి తగ్గడంతో గోదావరి జిల్లాల కురిడీ కొబ్బరి ధర పెరగడానికి కారణం అయింది. రాష్ట్రం నుంచి మహా కుంభమేళాకు కొబ్బరి కాయలు వెళ్లడంతో కాసులు కురవడం, దేవుని చెంతకు చేరడం మహా ప్రసన్నంగా రైతులు భావిస్తున్నారు. 2027లో జరగబోయే గోదావరి పుష్కరాల్లో కూడా గోదావరి జిల్లాల కొబ్బరే సరఫరా కానున్నట్లు రైతులు చెబుతున్నారు.
Read:Balakrishna:ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు