పవర్ ఈజ్ ఆల్ వేస్ పవర్ ఫుల్. అందుకే అధికార పార్టీలో ఉండేందుకు..ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు నేతలు. ఒకసారి పార్టీ అధికారం కోల్పోయిందంటే చాలు..లీడర్లు సైలెంట్ అయిపోతుంటారు.
పార్టీలో హాట్ హాట్ గా ఎంవీపీ వ్యవహారం
విశాఖపట్టణం, జనవరి 17
పవర్ ఈజ్ ఆల్ వేస్ పవర్ ఫుల్. అందుకే అధికార పార్టీలో ఉండేందుకు..ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు నేతలు. ఒకసారి పార్టీ అధికారం కోల్పోయిందంటే చాలు..లీడర్లు సైలెంట్ అయిపోతుంటారు. అలాంటి నేతల్లో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఒకరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకంటూ అంతో ఇంతో పేరుంది. పాలిటిక్స్‌కు వచ్చేసరికి ఓ సారి ఎంపీ అయ్యారే తప్ప..ఎంవీవీ అంటే ఎవరూ ఠక్కున చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన విశాఖ ఎంపీగా పనిచేసిన కాలంలో కూడా పెద్దగా ప్రజల్లో తిరిగింది లేదు. జగన్ వస్తే వేదిక మీదకు మొక్కుబడిగా వచ్చి వెళ్లడం తప్పితే ఎంపీగా ఆయన పాత్ర చాలా పరిమితం. ఇందుకు బలమైన కారణమే ఉంది. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాలు చక్కబెట్టుకోవాలనున్నారు తప్పితే..రాజకీయం కోసం ఆయన ఏనాడూ వ్యాపారం చేయలేదని వైసీపీ నేతలే చెబుతుంటారు.అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖ వంటి సిటీకి ఎంపీ అంటే రాష్ట్ర రాజకీయాలకు చాలా కీలకం. విశాఖలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల కార్యకలాపాల అంశంలోనూ, విభజన హామీలతో పాటుగా అనేక విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పలు సంప్రదింపులు, కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కానీ ఎంవీవీ స్టైలే వేరు. ఆయన ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టిన దాఖాలాలు లేవు.ఏపీలో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలంతా డీలా పడిపోయారు. అక్కడో ఇక్కడో ఒకరిద్దరు నేతలు కాస్త మీడియా ముందు కనిపిస్తున్నారే తప్ప..దాదాపుగా అందరు నేతలూ సైలెంట్‌గా ఉన్నారు.
అవంతి శ్రీనివాస్, ఆడారి ఆనంద్‌తో పాటుగా పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. మరి కొంతమంది నేతలు కాస్తో, కూస్తో యాక్టీవ్‌గా ఉన్నారు. కానీ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆయన పార్టీలో యాక్టీవ్‌గా లేరు. పోనీ అలాగని అవంతి శ్రీనివాస్, ఆడారి ఆనంద్‌లా బయటకు వెళ్లిపోయారా అంటే అదీ లేదు. దీంతో అసలు ఎంవీవీ పార్టీలో ఉన్నారా..లేరా..? అనే కన్ఫ్యూజన్ క్యాడర్, లీడర్లలో కొనసాగుతోంది. పార్టీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడమే లేదు. విశాఖ జిల్లా పార్టీ పరిస్థితులపై అధినేత జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశాలకు కూడా ఎంవీవీ వెళ్లలేదు. అలాగే ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి నియమితులైన తర్వాత పార్టీ కార్యాలయంలో విశాఖ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌కు కూడా ఎంవీవీ ఎగనామం పెట్టేశారు.అంతేకాదు రైతు సమస్యలపై అన్నదాతకు అండగా వైసీపీ, విద్యుత్ ఛార్జీలపైనా ఇటీవల వైసీపీ నిరసనలు చేపట్టింది. పార్టీ నేతలంతా పాల్గొనాలని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎంవీవీ సత్యనారాయణ ఎక్కడా పత్తా లేరు.
దీంతో ఈ మాజీ ఎంపీ వ్యవహారంపై వైసీపీలో అందరికీ క్లారిటీ వచ్చేసింది. పార్టీకి దూరంగా ఉంటున్నాడంటే.. ఆయన కండువా మార్చేందుకు రెడీ అయ్యారన్న భావనకు వచ్చేశారట.ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ కార్యకలాపాల్లో అస్సలు పాల్గొనడం లేదు. పార్టీని విడిచి పెట్టరు..అలాగని పార్టీ కోసం పనిచేయరు. పోనీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారా అంటే అదీ లేదు. దీంతో వైసీపీ పెద్దలకు, క్యాడర్‌కు ఆయన వ్యవహారం ఏ మాత్రం అర్థం కావడం లేదట. 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి అనూహ్యంగా ఎంపీ అయిన ఎంవీవీని పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఓడిపోగానే మొహం చాటేస్తున్న నేత ఉంటే ఏంటీ, లేకపోతే ఏంటీ అన్న రీతిలో పెద్దలు ఉన్నారట. ఆయనంతట ఆయనే రాజీనామా చేసి వెళ్లిపోతాడోమో అని ఎదురు చూస్తున్నారట.కానీ ఎంవీవీ మాత్రం ఆ పార్టీని వీడటం లేదు. ఏదో పార్టీలోకి దారి దొరికితే వైసీపీకి గుడ్‌బై చెబుదామని ఎదురు చూస్తున్నారట. కూటమి పార్టీల నుంచి లైన్ క్లియర్ కాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారట ఎంవీవీ సత్యనారాయణ. సైలెంట్‌గా వైసీపీలో ఉన్నంత కాలం ఉండటం, రూట్ క్లియర్ కాగానే జంప్ కొట్టాలనే ప్లాన్‌లో ఎంవీవీ ఉన్నారని విశాఖ వైసీపీ వర్గాల టాక్. ఓవరాల్ ఎపిసోడ్‌ను చూసిన వారంతా ఈ పొలిటికల్ బిజినెస్మెన్ రాజకీయాలను బాగా ఒంట పట్టించుకున్నారని చర్చించుకుంటున్నారట. ఎంవీవీ ఫ్యాన్ కిందే ఉంటారా లేక కూటమి గొడుకు కిందకు వెళ్తారా అన్నది వేచి చూడాలి మరి.