Vijayawada:ఏపీలో క్రీడా రాజకీయాలు

Sports politics in AP

రాజకీయ పార్టీల ఆధిపత్యం తప్ప ఏపీలో క్రీడల ప్రోత్సాహానికి సహకారం మాత్రం కొరవడింది.కొన్నేళ్లుగా క్రీడా సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం క్రీడల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగు పడిపోయింది.

ఏపీలో క్రీడా రాజకీయాలు..

విజయవాడ, జనవరి 17
రాజకీయ పార్టీల ఆధిపత్యం తప్ప ఏపీలో క్రీడల ప్రోత్సాహానికి సహకారం మాత్రం కొరవడింది. కొన్నేళ్లుగా క్రీడా సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం క్రీడల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగు పడిపోయింది. క్రీడా సంఘాల్ని నిర్వీర్యం చేసి వాటిని ఫక్తు రాజకీయ సంఘాలుగా మార్చేయడంలో అన్ని పార్టీలకు వాటా ఉంది. క్రీడా సంఘాలతో వచ్చే గుర్తింపు, ఈవెంట్ల నిర్వహణలో వచ్చే ఆదాయం గురించి తప్ప క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడంతో వాటిని అక్రమాలకు కేంద్రాలుగా మార్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో క్రీడల్ని రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా ఉంచాల్సిన ప్రభుత్వాల పాపమే ఎక్కువగా ఉంది.మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్‌లో 38వ నేషనల్ గేమ్స్‌ ప్రారంభమవుతున్న తరుణంలో ఏపీ క్రీడాకారులు వాటిలో పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతుంది. ఏపీలో పేరు స్పోర్ట్స్ అథారిటీ, క్రీడల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రి ఉన్నా నేషనల్ గేమ్స్‌‌లో పాల్గొనే విషయంలో మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. నేషనల్‌ గేమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రాతినిథ్యం కంటే ఏపీ ఒలంపిక్ అసోసియేషన్‌ను దక్కించుకోడానికే అధికార పార్టీ నేతలు ప్రాధాన్యమిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి 250మంది క్రీడాకారులు, కోచ్‌లు, అయా సంఘాల ప్రతినిధులు ఉత్తరాఖండ్‌లో వేర్వేరు ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం క్రీడాకారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

నేషనల్ గేమ్స్‌లో పాల్గొనడానికి దాదాపు రూ.33లక్షల రుపాయలు ఖర్చుకానుండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏపీ ఒలంపిక్ సంఘానికి ఎలాంటి భరోసా దక్కలేదు.ఏపీలో క్రీడల్లో పతకాలు సాధిస్తే వారిక పురస్కారాలు, నజరానాలు, భారీ బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఊరు పేరు లేని క్రీడా సంఘాలు రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ నోటిఫికేషన్లలో కొన్ని నకిలీ సంఘాలు జారీ చేసిన ఫేక్ సర్టిఫికెట్లతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. శాప్‌ సహకారంతో జరిగిన కోట్ల రుపాయల స్కామ్‌ వ్యవహారంపై కొన్నాళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే కొందరు నేషనల్ గేమ్స్‌‌లో ఏపీ జట్లు పాల్గొనకుండా అడ్డుతగులుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయిఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనకు ముందు నుంచి శాప్‌ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఒలంపిక్ సంఘం పూర్తిగా రాజకీయాల్లో చిక్కుకుపోయింది. అధికారంలో ఉన్న పార్టీలు క్రీడల్ని, క్రీడా సంఘాల్ని తమ జేబు సంస్థలుగా మార్చేసుకున్నాయి. కొన్ని క్రీడా సంఘాల్లో నేరచరితులు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు, వైట్ కాలర్‌ నేరాలకు పాల్పడిన వారు చొరబడటంతో క్రీడలు మరింత దిగజారిపోయాయి.కేసుల నుంచి బయట పడటానికి రాజకీయ నేతల్ని ఆశ్రయించడం, క్రీడాకారుల జీవితాలను ఫణంగా పెట్టడం వంటి ఆరోపణలు కూడా కొన్ని సంఘాల నేతలపై ఉన్నాయి. వీటన్నింటికి అడ్డు కట్ట వేయాల్సిన శాప్‌ కూడా వారి చెప్పు చేతల్లోకి వెళ్లిపోయింది.రాష్ట్రం విడిపోయిన తర్వాత శాప్‌ బాధ్యతలు చేపట్టిన వారిలో ఒక్కరు కూడా క్రీడల్ని ప్రోత్సహించలా పనితీరు ప్రదర్శించ లేకపోయారు. తమకు పదవి ఇచ్చిన రాజకీయ పార్టీ భజన చేయడానికే సదరు నేతలు పరిమితం అయ్యారు. ప్రస్తుతం జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రోత్సహించే విషయంలో కూడా తమకు కలిగే ప్రయోజనాల గురించి లెక్కలు వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్‌ రెడ్డి సొంత వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో నేషనల్‌ గేమ్స్‌లో ఏపీ జట్టు ప్రాతినిథ్యం వహించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Read:Visakhapatnam:గాజువాకలో.. టూ లెట్ బోర్డ్స్

Related posts

Leave a Comment