KCR : కాళేశ్వరం విచారణ-అన్ని వేళ్లు కేసీఆర్ వైపే

kaleshwaram project

– కాళేశ్వరం విచారణ-అన్ని వేళ్లు కేసీఆర్ వైపే

హైదరాబాద్, డిసెంబర్ 19, (న్యూస్ పల్స్)
కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాలన్నది అప్పటి సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేనని, మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల ఎంపిక కూడా ఆయనదేనని రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు చేసిన కేటాయింపులతో పాటు సప్లిమెంటరీ పేరుతో నిధులు విడుదలయ్యేవన్నారు. భారీ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులు కష్టసాధ్యం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహట్టి దగగర ప్రాణహిత ప్రాజెక్టు కట్టాలనే నిర్ణయం జరిగిందని, నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం ఇచ్చిన రిపోర్టుతో పాటు మహారాష్ట్రలో ముంపు ప్రాంతం ఉంటుండడంతో వచ్చిన అభ్యంతరం కూడా మరో కారణమని జస్టిస్ ఘోష్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రాజెక్టు స్థలాన్ని అప్పటి సీఎం కేసీఆర్ మార్చాలనే నిర్ణయం తీసుకున్నారని ఎస్‌కే జోషి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమంటూ పదేపదే ప్రస్తావించినా కేసీఆర్ పేరును వెల్లడించడానికి తటపటాయించారు. కేబినెట్ సమావేశంలో జరిగిన నిర్ణయమంటూ కొద్దిసేపు దాటవేశారు. మంత్రులందరూ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయమని, ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదన అని సీఎం కంటే కేబినెట్ విస్తృతమైనదని, పెద్దదని ఇలాంటి పలు రకాల వాదనలను తెరపైకి తెచ్చారు. హై పవర్ కమిటీ ఏర్పాటు, ఐబీఎం కమిటీ నిర్ణయం, ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి మంజూరైన అనుమతులు, ఇలాంటి విషయాల్లోనూ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడంతో జస్టిస్ ఘోష్ తనదైన శైలిలో వివరాలను రాబట్టారు. హైపవర్ కమిటీ, ఐబీఎం కమిటీల గురించి తనకు అవగాహన లేదని బదులివ్వడంతో ఆ ఉత్తర్వులను చూపించడంతో అనివార్యంగా ఒప్పుకోక తప్పలేదు. ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల గురించి ఎస్‌కే జోషి బదులిస్తూ, ఇది ఒక కాంప్లెక్సు ప్రాజెక్టు అని, మొత్తం 28 ప్యాకేజీలు, 8 లింకులు ఉన్నందున వేర్వేరు తేదీల్లో అనుమతులు మంజూరై ఉండొచ్చని, మొత్తంగా దాదాపు 200 ఉంటాయని సూచనప్రాయంగా తెలిపారు. బ్యారేజీ నిర్మాణ సంస్థలు ఇతర సబ్ ఏజెన్సీల నుంచి తీసుకున్న సాయంపై వివరణ ఇస్తూ, కాంట్రాక్ట్ సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సబ్ కాంట్రాక్టు కంపెనీల సాయం తీసుకొని ఉండొచ్చన్నారు.

బ్యారేజీల డిజైన్ల లోపం, ఆపరేషన్, మెయింటెనెన్స్ లోపం, గేట్ల ఆపరేషన్‌ల లోపం వంటి కారణాలతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని వెల్లడించారు. పబ్లిక్ బాండ్స్ ఇష్యూ చేయలేదని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు కుంగడానికి కారణం గేట్ల ఆపరేషన్స్ సరిగ్గా లేకపోవడమేనని పేర్కొన్న ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా పనిచేసిన రజత్‌ కుమార్, నాణ్యతలో లోపం కూడా ఉండొచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో వివరించారని, ఆ తర్వాత 2016లో అనుమతి ఇచ్చారని తెలిపారు. నీళ్ళను ఎగువ ప్రాంతానికి లిఫ్టు చేయడానికి వీలుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లో నిల్వ చేయాల్సి వచ్చిందని వివరించారు. తొలుత 2019 సెప్టెంబరులో వరదలు వచ్చాయని, అప్పుడే మేడిగడ్డ బ్యారేజీలో లోపం వెలుగులోకి వచ్చిందన్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి ఎలక్షన్ కోడ్ ఆంక్షలు అడ్డం వచ్చాయని చెప్పారు. నీరు నిల్వ ఉన్నందునే పిల్లర్ కుంగిన ప్రాంతంలో ఫౌండేషన్ కింద ఏం జరిగిందో వెంటనే తెలుసుకోలేకపోయినట్లు తెలిపారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లనే డ్యామేజీ జరిగి ఉండొచ్చన్నారు.నిర్మాణపు పనుల్లో నాణ్యత సరిగ్గా లేకపోవడంతో పాటు గేట్లను సరిగ్గా నిర్వహించకపోవడం, సకాలంలో సరైన తీరులో మెయింటెనెన్స్ పనులను చేపట్టకపోవడం కూడా కారణమన్నారు. మొదటిసారి లోపం వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురైనా 2020, 2021లో వచ్చిన వరదలప్పుడూ బ్యారేజీలు తట్టుకుని నిలబడ్డాయని గుర్తు చేశారు. నిజానికి బ్యారేజీల గేట్ల నిర్వహణ బాధ్యత ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌దేనని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు గురించి ప్రస్తావిస్తూ ఇరిగేషన్ డిపార్టుమెంటు ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పేమెంట్ చేసిందని తెలిపారు. బ్యారేజీ పిలర్ల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన కామెంట్లపై స్పందించడానికి రజత్ కుమార్ నిరాకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆదాయం సమకూరే మార్గాలపై డీపీఆర్‌లోనే ప్రభుత్వం వివరణ ఇచ్చిందని, కేంద్ర జల సంఘం సహా ద్రవ్య సంస్థలు సైతం సంతృప్తిచెంది రుణాలను ఇచ్చాయన్నారు. పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడంతో పాటు మిషన్ బగీరథకు త్రాగునీటిని ఇవ్వడం ద్వారా రెవెన్యూ సమకూరుతుందని, మరోవైపు ఆయకట్టు పెరగడం ద్వారా ‘పిసికల్చర్’ ద్వారానూ ఆదాయం వస్తుందని చెప్పారు.

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మాత్రమే ఆ ఆదాయం సమకూరుతుందని, అప్పటివరకూ రుణాలను, వాటిపై వడ్డీని ప్రభుత్వమే కట్టాల్సి ఉంటుందన్నారు.కాళేశ్వరం ఎంక్వయిరీ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సిందిగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. కానీ అసెంబ్లీ సెషన్ జరుగుతున్నందున విచారణకు తాను హాజరు కాలేనంటూ కమిషన్‌కు రిప్లై ఇచ్చారు. అసెంబ్లీ సెషన్ పూర్తయ్యేంతవరకూ వీలు పడకపోవచ్చన్న తీరులో కమిషన్‌కు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఒకటి రెండు రోజుల అనంతరం మరోసారి నోటీసులు జారీ చేసి ఆమె నుంచి వచ్చే సమాధానాన్ని తెలుసుకుని తదుపరి చర్యలపై కమిషన్ నిర్ణయం తీసుకోనున్నది.కమిషన్ నిర్వహిస్తున్న క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌ను జస్టిస్ పీసీ ఘోష్ విచారించే అవకాశమున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చీఫ్ సెక్రెటరీ హోదాలో తీసుకున్న నిర్ణయాలు, తెలిపిన ఆమోదం తదితరాలపై ఆయనను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఫైనాన్స్ డిపార్టుమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న రామకృష్ణారావును సైతం కమిషన్ ఈ దఫాలోనే విచారించనుంది.

Read: KTR : కేటీఆర్ అరెస్ట్ కు లైన్ క్లియర్

Related posts

Leave a Comment