రాజ్యసభ అభ్యర్థులలో లోకేష్ మార్క్…
కాకినాడ, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్)
రాష్ట్రంలోని అధికార టీడీపీలో రాజ్యసభ స్థానాల భర్తీ తరువాత లుకలుకలు నెలకొన్నాయి. పార్టీలోని సీనియర్లకు మొండి చెయ్యి దక్కడంపై అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ రాజ్యసభ స్థానాన్ని నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన సానా సతీష్‌కు కట్టబెట్టడంపై ఆ పార్టీలో నేతలు గరంగరంగా ఉన్నారు. మరోవైపు కొంత మంది నేతలు సానా సతీష్‌పై ఉన్న కేసుల విషయాలను ప్రస్తావిస్తున్నారువైసీపీకి చెందిన బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి ఈ మూడు స్థానాలు అధికార టీడీపీ కూటమికే వస్తాయి. అందులో భాగంగానే కూటమిలోని మూడు పార్టీల మధ్య చర్చోపచర్చలు అనంతరం టీడీపీ రెండు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. జనసేనకు రాజ్యసభలో స్థానం దక్కలేదు. దీంతో జనసేన నేత నాగేంద్రబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు.కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్‌ను, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే నాలుగో అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో ఈ ముగ్గురు దాదాపుగా ఏకగ్రీవం అయిపోయినట్లే. ఏకగ్రీవం అయినట్లు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. అయితే ఈ ముగ్గురులో ఇద్దరు వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీలో చేరిన వారికే మళ్లీ టిక్కెట్లు ఇచ్చారు. బీదా మస్తాన్ రావు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా, ఆర్. కృష్ణయ్య వైసీపీ నుంచి బీజేపీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణకు మాత్రం అవకాశం దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.ఇందులో మరో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్‌పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయనకు ఏ ప్రాతిపదిక రాజ్యసభ కట్టబెట్టారని టీడీపీలోని సీనియర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో రాజ్యసభ ఆశించిన సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి వంటి వారికి కాదని… కొత్తగా వచ్చిన సానా సతీష్‌కు రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వడంపై టీడీపీ నేతలు గరంగరంగా ఉన్నారు.మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి చెందుతామని తెలిసి కూడా వర్ల రామయ్య వంటి సీనియర్ నేతతో నామినేషన్ వేయించారు. ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు.
కానీ ఇప్పుడు ఆయనకు ఇవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ ఆయన పేరు మాత్రం ఖరారు కాలేదు. ఇక సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లాంటి వారు పార్టీ ఫిరాయించి… ఏకంగా రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసిన సమయంలో కూడా టీడీపీ పక్షానే చివరి ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్‌కు కూడా టిక్కెట్టు ఇవ్వలేదుసరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాల్లో వచ్చిన సానా సతీష్‌కు రాజ్యసభ టిక్కెట్టు వరించడం అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సానా సతీష్ ఎన్నికల ముందు కాకినాడ లోక్‌సభ ఎంపీగా పోటీ చేద్దామనుకున్నారు. కాకినాడ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ స్థాయిల్లో బ్యానర్లు, భారీ పోస్టర్లతో హడావుడి చేశాడు. ఆ బ్యానర్లలోనూ, పోస్టర్లలోనూ ఏ పార్టీ అని చెప్పకుండా… టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీ నేతల ఫోటోలు వేసి హల్‌చల్ చేశాడు. టీడీపీ తరపున కాకినాడ ఎంపీ టిక్కెట్టు ఇద్దామనుకున్నారు. కానీ ఈ టికెట్ ను తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఇచ్చారు. దీంతో సానా సతీష్ ఆ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం నామమాత్రంగానే పని చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాకినాడ జిల్లా, రాష్ట్రంలోనూ తన హవా కొనసాగించాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కు సానా సతీష్ సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, టీటీడీ చైర్మన్ వంటి కీలకమైన పదవుల విషయంలో లోకేష్ మార్క్ ఉంది. పార్టీ లోపల, పార్టీకి అండదండగా ఉన్న వారి నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ… లోకేష్ పట్టుపడి తన అనుకునేవారికి ఆయా పదవులను వచ్చేటట్టు చేశారన్న చర్చ జోరుగా జరుగుతోంది.ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవి బీఆర్ నాయుడికి, రాజ్యసభ సానా సతీష్‌కు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ నాయుడికి టీటీడీ పదవి వచ్చినప్పుడు పార్టీలో పెద్దగా వ్యతిరేకత రాలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం నుంచి కొంత మంది మాత్రమే వ్యతిరేకించారు. అందువల్లనే టీటీడీ బోర్డు నియామకం కూడా ఆలస్యంగా జరిగింది.ఇప్పుడు సానా సతీష్‌కు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు పరోక్షంగా లేఖాస్త్రాం సంధించారు. అలాగే సీనియర్ నేతలు కూడా చంద్రబాబు, లోకేష్ నిర్ణయాలపై విమర్శనాత్మకంగా చర్చించుకుంటున్నారు. గతంలో సానా సతీష్‌కు వ్యతిరేకంగా మీడియాలో పెద్ద కథనాలే వచ్చాయి. అలాంటి వ్యక్తి ఎలా రాజ్యసభ అభ్యర్థిగా ఖరారయ్యారనేది హాట్ టాపిక్ గా మారింది…
Read : నాగబాబుకు మంత్రి పదవి