Vasireddy Padma : జగ్గయ్యపేటపై వాసిరెడ్డి పద్మ  గురి

Vasireddy Padma

జగ్గయ్యపేటపై వాసిరెడ్డి పద్మ గురి

 

విజయవాడ, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్)
వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. బహుశ అంతా కుదిరితే ఈ నెలాఖరులోగా ఆమె టీడీలో చేరే అవకాశాలున్నాయి. వాసిరెడ్డి పద్మ చేరికకు అనేకమంది నేతలు అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఆమె చేరికకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. వాసిరెడ్డి పద్మ మాటకారి. మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పేరు. ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేదు. తర్వాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ వైఎస్ జగన్ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవి వరకే వాసిరెడ్డిని పరిమితం చేశారు. చివరకు జగన్ జిల్లాల పర్యటనలో కూడా ఆమె ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి వాసిరెడ్డి పద్మ అధికారం నుంచి వైసీపీ దిగిపోగానే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. వాసిరెడ్డి పద్మకు జనసేనలో ఎంట్రీ లేకపోవడంతో టీడీపీ వైపు ఆమె చూపు పడింది. అయితే వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన వారు. జగ్గయ్యపేట టిక్కెట్ కోసం గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తీవ్రంగానే పోటీ పడ్డారు. కానీ జగన్ మాత్రం టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి నుంచే కొంత అసంతృప్తితో ఉన్న వాసిరెడ్డి పద్మ వైసీపీ అధికారంలోకి వస్తుందేమోనని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వెయిట్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి వాసిరెడ్డి రాజీనామా చేశారు. జగన్ పార్టీపై విమర్శలు చేసి ఆమె బయటకు వచ్చారు జగ్గయ్యపేట నియోజకవర్గం కావడంతో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేనిచిన్నిని కలిసి ఆయన ద్వారా పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు కేశినేని చిన్నితో వాసిరెడ్డి పద్మ సమావేశమయ్యారు. కేశినేని చిన్ని కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మాట్లాడి ఓకే చేయించినట్లు చెబుతున్నారు.

చంద్రబాబు వద్దకు వెళ్లకపోయినా అంతా పార్టీ వ్యవహరాలు లోకేష్ చూసుకుంటుండటంతో ఇటు నుంచి వాసిరెడ్డి నరుక్కొచ్చారు. లోకేష్ ద్వారా పార్టీలో చేరితే మంచి ప్రాధాన్యత దక్కుతుందని వాసిరెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. వాసిరెడ్డి చేరికపై కొందరు జిల్లా నేతలతో పాటు మహిళ నేతలు అభ్యంతరం చెప్పినా అది లోకేష్ చేతిలో ఉండటంలో మిన్నకుండిపోయారు.  ఇక వాసిరెడ్డి పద్మ లక్ష్యం కూడా ఆమెకు క్లియర్ గానే ఉందని తెలిసింది. ఈ నెలాఖరులోగా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. తాను టీడీపీలో చేరబోతున్నానని కూడా వాసిరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఇక తెలుగుదేశం పార్టీ మహిళ రాష్ట్ర అధ్యక్ష పదవికి కోసం ఆమె ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ అధికారంలో ఉండటంతో పాటు ఆ పదవిలో ఉన్న అనిత హోంమంత్రిగా ఉండటంతో తనకు ఆ పదవి దక్కుతుందని వాసిరెడ్డి భావిస్తున్నారు. మహిళ అధ్యక్షురాలిగా ఉంటే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల తర్వాతనైనా టిక్కెట్ తో పాటు మంచి పదవి లభించే అవకాశముందన్నది ఆమె ఆలోచనగా సన్నిహితులు చెబుతున్నారు. మరి వాసిరెడ్డి వ్యూహం సైకిల్ పార్టీలో ఎంత మేరకు పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది.

Read : Yanamala Ramakrishnudu : యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా

Related posts

Leave a Comment