Swaroopananda | స్వరూపానంద …రాజకీయ వైరాగ్యం.. | Eeroju news

Swaroopananda

స్వరూపానంద …రాజకీయ వైరాగ్యం..

హైదరాబాద్, నవంబర్ 28, (న్యూస్ పల్స్)

Swaroopananda

కేసీఆర్ కు స్వరూపానంద సరస్వతి ఆహ్వానం: జగన్ తో భేటీ అక్కడేనా...పొలిటికల్ స్వామీజీగా పేరు గడించిన స్వరూపానంద రాజకీయ వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారికి రాజగురువుగా ఆయన ఒక వెలుగు వెలిగారు.. రాజకీయంగా జగన్‌కు డైరెక్ట్‌గా మద్దతు పలికి వివాదాల్లో నిలిచారు. ఆయన స్థాపించిన శారదా పీఠానికి జగన్ విచ్చలవిడిగా భూములు కేటాయించారు. ఏపీలో ప్రభుత్వం మారాక కోట్లు విలువ చేసే ఆ భూకేటాయింపులను రద్దు చేసింది. మరి ఆ వైరాగ్యంతోనో ఏమో స్వరూపానంద ఇక హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటానంటూ అసలైన వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ క్యాటగిరీ 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం వ్యవస్థాపకుడు స్వరూపానందేంద్ర స్వామి కోరారు.

ఆ మేరకు గన్ మ్యాన్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ అందజేశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రతా, శ్రేయస్సు కోసం ప్రస్తుత, మునుపటి ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని స్వామీజీ లేఖలో పేర్కొన్నారు.2019 నుంచి శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు ప్రభుత్వాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై హిమాలయాలకు పోయి రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

స్వరూపానంద గతంలో జగన్‌కి మద్దతుగా ఉంటూ ఆయనకు రాజగురువుగా వ్యవహరించారు. హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జగన్ 2019 ఎన్నికలకు ముందు స్వరూపానంద సహాయం తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఆయన సలహా మేరకే జగన్ ఆలయ యాత్రలు కూడా చేశారంటారు.స్వరూపానంద అటు తెలంగాణలో కేసీఆర్‌కి, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు బలమైన మద్దతుదారుగా ఉండేవారు. ఆ ఇద్దరికీ ఆయన దైవసమానుడు. 2019 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానంద పేరు మారుమోగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యత‌ల‌ను స్వీక‌రించిన త‌రువాత కేసీఆర్ ప్రత్యేక విమానంలో వ‌చ్చి మ‌రీ స్వరూపానంద ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. జ‌గ‌న్ ప్రమాణ స్వీకార మ‌హోత్సవానికి ముహూర్త బ‌లాన్ని నిర్ణయించింది స్వరూపానందే. జగన్ మంత్రివ‌ర్గ ప్రమాణ స్వీకార మ‌హోత్సవానికీ ఆయ‌నే ముహూర్తాన్ని ఖాయం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల వరుస భేటీలు, పాదభివందనాలు చేయడం ఆయనను రాష్ట్రంలో సెలెబ్రెటీగా మార్చాయి. ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల‌ను చూసిన త‌రువాత రెండు రాష్ట్రాల నుంచి ప‌లువురు ప్రముఖులు ఆయ‌న‌ను సంద‌ర్శించడానికి వెళ్లేవారు. హైద‌రాబాద్‌లోని ఫిల్మ్‌న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో లేదా విశాఖ‌ప‌ట్నంలోని చిన‌ముషిరివాడలోని శార‌దా పీఠంలో నివ‌సించేవారు. అప్పట్లో స్వరూపానంత పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని 23 ప్రధాన దేవాలయాలకు సంబంధించిన అర్చకులు ఆయన ముందు క్యూ కట్టాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది. చివరికి హైకోర్టు జోక్యంతో ఆ ఉత్తర్వువులు ఉపసంహరించుకున్నారు.జగన్ శారదాపీఠానికి కోట్లు విలువ చేసే స్థలాలను నామమాత్రపు ధరలకే శారదాపీఠానికి దారాదత్తం చేశారు. ఇప్పుడా కేటాయింపులను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది.

భీమునిపట్నం మండలం కొత్తవలసలో గత వైసీపీ ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ గత నెలలో ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్‌ రోడ్డులో కొత్తవలస వద్ద సుమారు రూ.225 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి కేవలం రూ.15 లక్షలకు జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఎకరం 15 కోట్లు విలువ చేసే ఆ భూముల్ని ఎకరం లక్షలకే కట్టబెట్టి జగన్ తన భక్తి చాటుకున్నారు. అక్కడ ఎకరా రిజిస్ర్టేషన్‌ విలువే రూ.2 కోట్లు వరకూ ఉందని జిల్లా యంత్రాంగం చెప్పినా అప్పటి ప్రభుత్వం చెవికెక్కించుకోలేదంట. అంతేగాకుండా పీఠానికి కొండపై కేటాయించిన భూమికి వీఎంఆర్‌డీఎ రెండు కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తరించడంతోపాటు వేద పాఠశాల నిర్వహణ ఏర్పాటు చేస్తామని చెప్పి భూమి తీసుకున్న పీఠం.. దానిని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటామని అప్పటి పాలకులకు కోరగా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. అక్కడ ఎనిమిది అంతస్థులతో బోర్డింగ్‌ హౌస్‌ పేరుతో హోటల్‌ నిర్మాణానికి గుట్టుచప్పుడు కాకుండా జీవో ఇచ్చేసింది. శారదా పీఠం పేరున కాకుండా ఉత్తరాధికారి పేరిట భూమిని బదలాయించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల నివేదిక తెప్పించుకుంది. దానిని పరిశీలించిన అనంతరం చివరకు భూ కేటాయింపు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో కూడా శారదాపీఠం భవనాల నిర్మాణానికి అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

తిరుమల గోగర్భం డ్యామ్ ప్రాంతంలో 5,000 చదరపు అడుగుల స్థలాన్ని శారదాపీఠం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, భోజన సేవలందించేందుకు 2005 ఫిబ్రవరిలో 30 సంవత్సరాల పాటు స్థలం లీజుకు ఇవ్వడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు టీటీడీ పేర్కొంది. ఆ తర్వాత ఆ స్థలంలో ఐదు అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు 2007లో శారదాపీఠం అనుమతి పొందినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పుడు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ జగన్ సీఎం అయిన తర్వాత ఈ నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. అయితే, శారదాపీఠం నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతుండటంతో, వాటికి ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించార2019 జూన్‌లో పీఠాధిపతి బాధ్యతల నుంచి తప్పుకుని ఆయన శిష్యుల్లో ఒకరైన స్వాత్మనందేంద్ర సరస్వతికి అప్పగించారు. ఇప్పుడు పీఠానికి ఉత్తరాధికారిగా స్వాత్మనందేంద్ర సరస్వతే వ్యవహారిస్తున్నారు. స్వరూపానంద హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటానంటున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వం మారాక వరుస షాక్‌లు తగులు తుండటంతో ప్రైవేటు పీఠం పెట్టుకున్న స్వరూపానందకు అసలుసిసలు వైరాగ్యం వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Swaroopananda

Subrahmanya Swamy case on Rahul citizenship | రాహుల్ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేసు | Eeroju news

Related posts

Leave a Comment