ప్రచారం నుంచి ఎంపీ వరకు…. ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ, నవంబర్ 26, (న్యూస్ పల్స్)
Priyanka Gandhi Vadra
2 దశాబ్దాల క్రితం గాంధీ – నెహ్రూ కుటుంబం వారసురాలిగా పాలిటిక్స్‌కు పరిచయమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డు విజయం అందుకున్నారు. కేరళ వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి చరిత్ర సృష్టించారు. ప్రచారంలో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ‘తానో ఫైటర్’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బలంగా నిలిచాయి. ‘ప్రజా ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో కానీ.. ప్రజల తరఫున పోరాటం నాకు కొత్త కాదు. 30 ఏళ్లు గృహిణిగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని నేను.. ఇప్పుడు మీ సమస్యలపైనా అలాగే పోరాడుతాను. నేనో ఫైటర్.. మీ తరఫున బలమైన గొంతుకనవుతా..’ అని ఆమె చేసిన వ్యాఖ్యలే ప్రజలను ఆమె దగ్గరకు చేర్చాయి.
1998 జనవరి 26న తన తల్లి సోనియాగాంధీతో కలిసి తమిళనాడులోని ఓ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొన్నారు. ‘అందరూ కాంగ్రెస్‌కు ఓటెయ్యండి.’ అంటూ తమిళంలో మాట్లాడిన ఒక్క వ్యాఖ్యమైనా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. తల్లి సోనియాకు అడ్వైజర్‌గా ఉంటూ తల్లికి రాజకీయ ప్రసంగాల్లో సాయం చేశారు.
2004లో తొలిసారిగా ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. యూపీ వెలుపల కొన్ని చోట్ల ర్యాలీల్లోనూ కనిపించారు.
అయితే, ఆమె యాక్టివ్ పాలిటిక్స్‌లోకి మాత్రం 2019లోనే అడుగుపెట్టారు. ఆ ఏడాది జనవరిలో ఆమె యూపీ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది మొత్తం యూపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
2019లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలగగా.. ఆ టైంలో ప్రియాంక బాధ్యతలు చేపట్టాలని డిమాండ్లు వినిపించాయి. అయితే, వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించారు. అనంతరం 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు.
యూపీలో కాంగ్రెస్ ఓటమి తర్వాత 2022 చివర్లో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక యావత్ దేశం దృష్టినే ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో తెరవెనుక ఆమె అన్నీ తానై పార్టీని నడిపించి విజయాన్ని అందించారు.
బలమైన నేతగా..
2024, సార్వత్రిక ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించగా.. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రం చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, అనూహ్యంగా అక్కడి నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. 2024 ఎన్నికల నాటికి మోదీకి దీటుగా సమాధానం ఇవ్వగల బలమైన నేతగా ప్రియాంక మారారు. మాటల మాంత్రికురాలిగా, వ్యూహకర్తగా, ప్రజలను ఆకర్షించే ప్రసంగాలతో ప్రచారంలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే కేరళ వయనాడ్‌లో తన సోదరుడు రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు.