29న బీఆర్ఎస్ దీక్షా దివస్
హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్)
Telangana
ఈనెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించాలని.. కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణలో మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణపై కేసీఆర్ ముద్రను ఎవరూ చేరిపేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి.. తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు అని స్పష్టం చేశారు. నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని అందరికీ తెలుసన్నారు.
‘స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం. ఆనాడు కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో అని తెగువ కనబరిచిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి.. కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.’అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యింది. మళ్లీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవే నిర్భంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తున్నాయి.
ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో.. నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరుని మీద ఉన్నది’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.’కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణలో మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చింది. ఒక్క వర్గం కాదు.. సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. కాంగ్రెస్ కబంధ హస్తల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని కేటీఆర్ వివరించారు.స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ తరుచూ చెప్పేవారు. ఈ రోజు ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, ఆ నాటి పాలనను కోరుకుంటున్నారు. దాని కోసం మా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సందర్భం.
నవంబర్ 29న 33 జిల్లాల్లో మా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. తెలంగాణపై కేసీఆర్ ఏ విధంగా చెరగని ముద్ర వేశారో మళ్లీ గుర్తు చేసుకుంటూ.. రెండు జాతీయ పార్టీలకు బుద్ది చెప్పేందుకు కదం తొక్కుతాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.29 నవంబర్ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదం తొక్కాలని పార్టీ నేతలకు పిలుపు ఇస్తున్నాం. ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంఛార్జ్లుగా నియమించాం. దీక్షా దివాస్ కార్యక్రమ నిర్వహణ కోసం ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తాం. 29 నాడు దీక్షా దివస్ ఘనంగా నిర్వహించనున్నాం’ అని కేటీఆర్ వివరించారు.
‘కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9వ తేదీన మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. మా పార్టీ నాయకులంతా ఆరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతాం. కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఘనమైనది. ఆ రోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. అందుకే ఆ రోజు నిమ్స్ హాస్పిటల్లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేసాం. దీక్షా దివస్ తోపాటు తెలంగాణ తల్లి విగ్రహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపుసున్నా. ఈ దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | కేటీఆర్ చుట్టూ ఉచ్చు.. అరెస్ట్ చేస్తారని ప్రచారం | Eeroju news