వణుకుతున్న హైదరాబాద్..
హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్)
Hyderabad
తెలంగాణలో రాత్రిపూట ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో 3 రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం చలికి వణికిపోతోంది. ఉత్తర, దక్షిణ భాగ్యానగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.తెలంగాణలో ఉష్టోగ్రతలు పడిపోయి.. చలి తీవ్రత పెరిగింది. 3 రోజులుగా తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్‌లో 12.4, బీహెచ్ఈఎల్లో 12.8 ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నం శివార్లలో 11.4 నమోదైంది. ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ఏరియాల్లో 13 నుంచి 15 డిగ్రీలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక కోర్ హైదరాబాద్ సిటీలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.
ఆయా ప్రాంతాల్లో 17 నుంచి 19 డిగ్రీల ఉష్ట్రోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 8 రోజులు వాతావరణం ఇలానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని చాలాచోట్ల 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుందని.. చిన్న పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలి నుండి పిల్లలను రక్షించడానికి పిల్లలను వెచ్చని దుస్తులు వేయాలని.. వీలైతే లూజ్ ఉన్న దుస్తులు పైనుంచి మరొకటి వేయాలని వైద్యులు సూచిస్తు్ననారు. చిన్న పిల్లలకు జలుబు కాకుండా చూసుకోవాలని.. చలికాలంలో జలుబు అయితే తగ్గడం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. నవజాత శిశువు విశ్రాంతి తీసుకునేలా, శ్వాస సమస్యలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.చలికాలంలో వృద్ధులు తమ ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, హృద్రోగ సమస్యలు, ఇతరత్రా రోగాలకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
చల్లటి వాతావరణంలో కీళ్లనొప్పులు పెరుగుతాయని.. చలిలో వైరల్ ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు.చలికాలంలో వేడినీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆవిరి పడుతూ శ్వాసనాళాలను శుభ్రం చేసుకోవాలంటున్నారు. పాలు, పప్పులు, కూరగాయలు వంటి పోషకాలు, విటమిన్- సి కలిగిన పండ్లు తీసుకోవాలంటున్నారు. వృద్ధులు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ.. తగినంత నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తేలికపాటి నడక, వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.