సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్సు
నెల్లూరు, నవంబర్ 19, (న్యూస్ పల్స్)
AP News
ఈనెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు భేటీకానుంది.ఈ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. ప్రత్యేక మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వాలంటీర్లు, 108 ఉద్యోగుల అంశం, పథకాల అమలుపైన నిర్ణయం తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాల నిరోధానికి ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.
ఈనెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. సభలో ఆమోదించాల్సిన బిల్లులపైన.. మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందు కోసం కొత్త చట్టం తీసుకురావటంతో పాటుగా ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మహిళలను కించ పరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టం తీసుకురానున్నారు.పెండింగ్లో ఉన్న పలు అంశాలపైనా మంత్రివర్గం చర్చించనుంది. వాలంటీర్ల కొనసాగింపు అంశం పైనా సస్పెన్స్ కొనసాగుతోంది. ఐదు నెలలుగా వారికి విధులు కేటాయించలేదు. వేతనాలు ఇవ్వలేదు.
బడ్జెట్ లోనూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా సూపర్ సిక్స్ హామీల పై వైసీపీ విమర్శలు చేస్తున్న సమయం లో ప్రభుత్వం వీటి అమలుకు వీలుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 20 వేల జమ చేయడంపైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పథకాల అమలుతో పాటుగా అమ్మకు వందనం అమలు ముహూర్తం పైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.