ఒక్క రోజే 7 వేల మంది రిటైర్మెంట్…
నెల్లూరు, ఆగస్టు 2(న్యూస్ పల్స్)
7 thousand people retired in one day…
జులై 31 ఒక్క రోజులోనే దాదాపు ఏడు వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించడానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం రెండేళ్ల నిర్బంధ సర్వీస్ పొడిగింపు అమలు చేశారు. ఉద్యోగులు స్వచ్ఛంధ పదవీ విరమణ చేసినా రెండేళ్ల తర్వాతే పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని నిబంధన విధించారు. జులై 31 కావడంతో ఒకేసారి భారీగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. గత జనవరి నుంచి ఉద్యోగుల పదవీ విరమణ మొదలైనా ఇంత భారీ సంఖ్యలో రిటైర్మెంట్లు కావడం ఇదే తొలిసారి.
2022లో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఏపీ సర్కారు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేని పరిస్థితుల్లో సర్వీసును రెండేళ్లు పొడిగించింది. 2024 జనవరితో రెండేళ్ళ పొడిగింపు కూడా ముగిసింది. జనవరి 31నుంచి ఉద్యోగుల రిటైర్మెంట్ మొదలైంది. పదవీ విరమణ చేసిన మూడు నెలల నుంచి ఆర్నెల్లలోపు వారికి సెటిల్మెంట్ చేస్తున్నారు. సర్వీస్ పూర్తైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది జులైలో పుట్టిన వారు కావడంతో ఒకేసారి 31వ తేదీన రిటైర్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ చేయాల్సిన వారు ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 58 ఏళ్ళ నుంచి 60ఏళ్లకు పొడిగించారు. ఆ తర్వాత జగన్ హయంలో 62ఏళ్లకు పొడిగించారు. ఓ దశలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 63ఏళ్లకు 65ఏళ్లకు పెంచాలని కూడా జగన్ ప్రయత్నించారు. ఉద్యోగుల వ్యతిరేకతతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుకు గత కొన్నేళ్లుగా జాప్యం జరుగుతోంది. నవరత్నాల్లో భాగంగా సంక్షేమ కార్యక్రమాలకు నగదు బదిలీ చేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.
సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి నెల ఒకటో తేదీన లబ్దిదారులకు పెన్షన్ల నగదును పంపిణీ చేసేవారు. ఇతర నగదు బదిలీ పథకాలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల జీతాల చెల్లింపుకు తర్వాత స్థానం ఇచ్చింది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కోవిడ్ ముంచుకు రావడం, దాదాపు రెండేళ్ల పాటు దాని ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్ధికంగా తీవ్ర ఒడిదడుకుల్ని ఎదుర్కొన్నా నగదు బదిలీ పథకాలు, నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు మాత్రం కొనసాగాయి. ఈ క్రమంలో జీతాలు, పెన్షన్ల చెల్లింపు గణనీయంగా ఆలస్యమయ్యేది.
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆలస్యం కావడంతో గ్రూప్ సి,డి ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెన్షనర్లు కూడా ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయోనని పడిగాపులు పడాల్సి వచ్చేది. ఎన్నికలకు ఆర్నెల్లు ముందు నుంచి పెన్షనర్లకు మాత్రం సకాలంలో నగదు జమ చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలు, పాత పథకాలకు నగదు బదిలీలకు మార్చిలో బ్రేకులు పడ్డాయి. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపుకు ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడం, ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పాలన సాగడంతో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీతాలను చెల్లించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 14.76లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 4,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో లక్షా 28వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైన ఏపీఎస్ ఆర్టీసీలో 53వేల మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు అందుకున్న వారు ఆరులక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఏపీలో సర్వీస్ పెన్షనర్లు 3.58లక్షల మంది ఉన్నారు. సర్వీస్ పెన్షన్లపై ఆధారపడి ఫ్యామిలీ పెన్షన్ అందుకునే వారు మరో లక్ష మంది ఉన్నారు. ఇలా ప్రభుత్వ పెన్షనర్లు 4.58లక్షల మంది ఉన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లక్షా 20వేల మంది వరకు ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు 80వేల మంది, అంగన్ వాడీ వర్కర్లు, సహాయకులు మరో లక్షమంది ఉన్నారు. హోమ్ గార్డులు 15వేల మంది ఉన్నారు. మొత్తం అన్ని శాఖల్లో కలిపి 14.76లక్షల మంది ప్రభుత్వం నుంచి జీతాలు, పెన్షన్లు అందుకుంటున్నారు. వరుసగా ఐదో నెలలో కూడా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నారు. ఏప్రిల్, మే , జూన్, జులైలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించారు. ఒకటో తేదీన జీతాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక సతమతం అయ్యేవారిమని, నెలవారీ ఖర్చులకు డబ్బులు కూడా ఉండేవి కాదని గుర్తు చేస్తున్నారు.