కర్నూలు, జూన్ 14, (న్యూస్ పల్స్)
రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. యువకులు, సీనియర్లు సమ్మిళితంగా రాష్ట్ర మంత్రివర్గం కూర్పు ఉంది. క్యాబినెట్లో కొండపల్లి శ్రీనివాస్ అత్యంత చిన్న వయసు. ఆయనకు 40 సంవత్సరాల వయసు కాగా.. ఎన్ఎండి ఫరూక్ అత్యంత పెద్దవారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు.
సామాజిక సమతూకంతో పాటు యువతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సీనియార్టీ కి సైతం పెద్దపీట వేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసు పరంగా ఎన్ ఎం డి ఫరూక్ అందరికంటే పెద్దవారుగా నిలిచారు. టిడిపిలో ఆయన సీనియర్. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అందుకే ఆయనకు గౌరవించి మైనారిటీ కోట కింద పదవి ఇచ్చారు చంద్రబాబు.
విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనే క్యాబినెట్లో అత్యంత చిన్న వయసు గల నేత. విజయనగరం ఎంపీగా పనిచేసిన కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడే కొండపల్లి శ్రీనివాస్. తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు.
ఇక మంత్రివర్గంలో 13 మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవారే. వీరిలో పవన్ కళ్యాణ్, అచ్చెనాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత తదితరులు 60 సంవత్సరాల లోపు వారే.ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారిలో.. నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారిలో.. పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ లు ఉన్నారు. ఏడుపదులు దాటిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ ఎండి ఫరూక్ లు ఉన్నారు.