Vijayawada:వైసీపీకి కొత్త కష్టాలు:వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి కొత్త కష్టం ప్రారంభమైంది. కేంద్రానికి ఆ పార్టీ వ్యతిరేకమైంది. ఇందుకు వక్ఫ్ సవరణ బిల్లు కారణమైంది. కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ఈ బిల్లు సవరణకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. పార్లమెంటు ఉభయ సభల్లో సైతం ఆ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఏపీకి సంబంధించి టిడిపి తో పాటు జనసేన మద్దతు తెలిపాయి.
వైసీపీకి కొత్త కష్టాలు
విజయవాడ, ఏప్రిల్ 5
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి కొత్త కష్టం ప్రారంభమైంది. కేంద్రానికి ఆ పార్టీ వ్యతిరేకమైంది. ఇందుకు వక్ఫ్ సవరణ బిల్లు కారణమైంది. కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ఈ బిల్లు సవరణకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. పార్లమెంటు ఉభయ సభల్లో సైతం ఆ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఏపీకి సంబంధించి టిడిపి తో పాటు జనసేన మద్దతు తెలిపాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకించడంతో పాటు వ్యతిరేకంగా ఓటు వేసింది కూడా. సహజంగానే ఇది కేంద్రానికి మింగుడు పడని విషయం. అందుకే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది. పాత కేసులను తిరగతోడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే వైసీపీపై విరుచుకుపడుతోంది. దీనికి కేంద్రం తోడైతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.వాస్తవానికి 2014 నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితోఎటువంటి శత్రుత్వం పెంచుకోలేదు.
2014లో టిడిపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. అయితే ఏపీలో మాత్రమే టిడిపిని వ్యతిరేకించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని పల్లెత్తు మాట అనలేదు. పైగా స్నేహాన్ని కొనసాగించింది. నాడు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగించింది బిజెపి. కానీ తెర వెనుక అదే స్నేహం వైసిపి తో సైతం కొనసాగించిందన్న విమర్శ ఉంది. అప్పట్లో అందుకే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా టిడిపి బయటకు వెళ్లిందో లేదో బిజెపితో బాహటంగానే స్నేహం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆ పార్టీ బిజెపికి మిత్రపక్షంగానే కొనసాగింది. అయితే ఎక్కడ అధికారికంగా జరగలేదు. దానికి కారణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనారిటీల మద్దతు ఉంది. బిజెపితో బహిరంగంగా వ్యవహరిస్తే ముస్లిం మైనారిటీలు దూరం కావడం ఖాయం.
దానికి భయపడే మొన్నటి ఎన్నికల్లో బిజెపి పొత్తు ప్రతిపాదనను కూడా జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. అటు బిజెపి సైతం చివరి వరకు వేచి చూసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతోనే తెలుగుదేశంతో జతకట్టేందుకు సిద్ధపడింది. అయితే గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల స్వేచ్ఛ ఇచ్చింది బిజెపి. కానీ అటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే.ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బిజెపి అడగకముందే మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చాలా రకాల బిల్లుల ఆమోదానికి మద్దతు ఇచ్చింది కూడా. మొన్నటికి మొన్న డి లిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని స్టాలిన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైతే బిజెపికి వ్యతిరేక ముద్ర పడుతుందని భావించిన జగన్మోహన్ రెడ్డి అటువైపు చూడలేదు. మద్యేమార్గంగా కేంద్రానికి లేఖ రాసి ఊరుకున్నారు. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు విప్ జారీచేసి మరి వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించడం అంటే చిన్న విషయం కాదు. దీనిపై బిజెపి అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇకనుంచి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Read more:Vijayawada: ఇక మారనున్న దివిసీమ