Mangalagiri:రెడ్ బుక్ పేరు వినగానే ఒకరికి గుండెపోటు:రెడ్ బుక్ పేరు వినగానే ఒకరికి గుండెపోటు… మరొకరికి బాత్రూమ్ లో పడి చేయి విరిగింది
చట్టాలను ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్
:వారి మాదిరిగా ప్రతిపక్షనేత ఇళ్లకు తాళ్లు కట్టడం లేదు…
స్వేచ్చగా తిరగనిస్తున్నాం
పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో పారదర్శకంగా దర్యాప్తు
సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయని వాడు, ప్రజలను కలవని వాడు మాకు చెబుతాడా?
ఉండవల్లి విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
మంగళగిరి
రెడ్ బుక్ పేరు చెప్పగానే వైసిపి నాయకులు బెంబేలెత్తుతున్నారు, ఇప్పటికే ఒకరికి గుండెపోటు వచ్చింది, మరొకరు బాత్రూమ్ లో పడి చేయి విరిగింది. చట్టాలు ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పట్టా అందించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలచేసింది. మేము అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. మేము ప్రతిపక్షనేత ఇంటిగేటుకు తాళ్లు కట్టలేదు, తప్పుడు కేసులు బనాయించడం లేదు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం. ఆయన స్వేచ్చగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నాం. వారు తప్పుడు ప్రచారం చేస్తే ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు.
తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే రెడ్ బుక్ పేరు చెప్పా:
కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 35వేలమంది ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు పొట్టచేతబట్టుకొని వలసలు వెళ్లారు. యువగళం పాదయాత్ర సమయంలో అక్కడ వలసలను నివారిస్తానని హామీ ఇచ్చా. ఆ మాటమేరకు కనిగిరిలో తొలి రిలయన్స్ సిబిజి ప్లాంటు ఏర్పాటుచేశాం. అక్కడ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 50వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు తమ రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దానిపై రిలయన్స్ డైరక్టర్ స్పందించి 50ప్లాంట్లు అక్కడే ఏర్పాటుచేస్తామని అన్నారు. కరువు ప్రాంతంలో పెద్దఎత్తున యువతకు ఉపాధి కల్పించేందుకు ఇటువంటి ప్రాజెక్టులు తెస్తుంటే వైసిపి వారికి కడుపుమంట దేనికి? బొబ్బలు వస్తాయంటూ దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ర్పచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే అటువంటి వారిని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తానని చెప్పా.
జగన్ కు సొంతవాళ్లను కలిసేందుకే తీరికలేదు:
సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయలేని వారు మాకు చెబుతారా? ప్రిజనరీ ఆలోచనలన్నీ జైలువైపే ఉంటాయి. తప్పుచేశారు కనుక ఆయన ధైర్యంగా ప్రజల్లో తిరగలేకపోతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎవరినీ కలవలేదు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తరువాత కూడా కనీసం కార్యకర్తలను కలిసే సమయం జగన్ కు లేదు. ప్రజలను కలిసే ఓపిక ఆయనకు ఎక్కుడుంది? ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అయిదేళ్లు ఆయన నివసించే ప్రాంతంలో ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? పైగా ఆయన ఇంటిదారి కోసం పేదోళ్ల ఇళ్లను కూల్చారు. పేదలకు అండగా నిలిచే ప్రజాప్రభుత్వం మాది. మాతో అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మా ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోంది. తప్పుచేసిన వారు ఎవరైనా వదిలే ప్రసక్తిలేదు.
విజనరీ – ప్రిజనరీకి ఎంతో తేడా ఉంది:
విజనరీ లీడర్ కు – ప్రిజనరీకి ఎంతో తేడా ఉంది. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా మనబిడ్డలను సిద్ధం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 1994లో చంద్రబాబు తొలిసారి సిఎం అయినప్పుడు కొందరు ప్రత్యర్థులు కంప్యూటర్లు అన్నం పెడతాయా అంటూ అవహేళన చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఐటి ఎన్నిలక్షలమంది యువత ఉద్యోగాలు చేస్తున్నారో కళ్లముందు కన్పిస్తోంది. చంద్రబాబునాయుడు ఎంతో ముందుచూపుతో ఆలోచించి ఐటి టవర్, ఐఎస్ బి, జీనోమ్ వ్యాలీ, అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటివాటిని అభివృద్ధి చేశారు. ఫలితంగా ఈరోజు హైదరాబాద్ అంతర్జాతీయస్థాయి నగరంగా తయారైంది. విభజిత ఆంధ్రప్రదేశ్ ను అదేస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. నిరుపేదలను పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తేవాలన్న లక్ష్యంతో పి4 విధానానికి రూపకల్పన చేసి, ఇటీవల ప్రారంభించారు.
రైతులకు న్యాయం చేసే బాధ్యత మాది:
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరల విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. వరికి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలను చెల్లించడమేగాక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొన్న ధాన్యానికి ఎప్పటికప్పుడే డబ్బు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నాం. తక్కువ ధర పలికే కొన్నిరకాల మిర్చి కనీస మద్ధతుధర రూ.11,500 అందజేస్తున్నాం. పసుపు ధరలకు సంబంధించి నేను దృష్టిసారించా. గిట్టుబాటు ధరలపై అచ్చంనాయుడు, నాదెండ్ల మనోహర్ లతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రైతు నష్టపోకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. కొన్నిరకాల పంటల ఎక్కువగా వచ్చినపుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ తో ధరలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ చెప్పారు.
Read more:Movie news:షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్