Hyderabad:కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలతోపాటు..హెచ్‌సీయూకి కేటాయించిన భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నివేదిక ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రభుత్వ రికార్డులలో హెచ్‌సీయూ పేరుతో పట్టాలేదని.. అవన్నీ ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నాయంటూ నివేదికలో పేర్కొన్నారు.
రెవెన్యూ క్లారిటీ.
ఆ భూమంతా సర్కారుదే
హైదరాబాద్, ఏప్రిల్ 14
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలతోపాటు..హెచ్‌సీయూకి కేటాయించిన భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నివేదిక ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రభుత్వ రికార్డులలో హెచ్‌సీయూ పేరుతో పట్టాలేదని.. అవన్నీ ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నాయంటూ నివేదికలో పేర్కొన్నారు. 50 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటుకు అడ్వాన్స్ పొజిషన్ పద్దతిలో 2 వేల 375 ఎకరాలు ఇచ్చిందని తెలిపారు.కంచ గచ్చిబౌలి భూముల అంశంపై ప్రభుత్వం, పలు సంఘాలు, రాజకీయ నేతలతో వేర్వేరుగా భేటీ అయిన కమిటీ సభ్యులు చివరగా రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెవెన్యూ రికార్డుల పరంగా అన్ని వివరాలు సమర్పించాలని అడగడంతో… రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేసి కమిటీకి అందజేశారు. HCUకు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం అప్పుడప్పుడూ అవసరమైన మేరకు తీసుకున్నామని రెవెన్యూ అధికారులు నివేదికలో తెలిపారు. ఇలా తీసుకున్న ప్రతిసారీ వర్సిటీ పరిపాలనా విభాగం అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
క్రీడల అభివృద్ధి, ఇతర అవసరాలకు 2002, 2003 సంవత్సరాల్లో 534 ఎకరాలు HCU నుంచి తీసుకున్నామని రెవెన్యూ అధికారులు నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఇందులో IMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు, ప్రస్తుత TNGOకు 134 ఎకరాలు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఐఎంజీ సంస్థ ఒప్పందం ప్రకారం క్రీడల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో 2006లో 400 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ అప్పటి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని నివేదికలో పేర్కొన్నారు. 534 ఎకరాలకు బదులుగా గోపన్‌పల్లిలో 397 ఎకరాలు HCUకు తిరిగిచ్చామంటూ.. వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను నివేదికతో పాటు పొందుపరిచారు.తమకు కేటాయించిన 400 ఎకరాల భూములను తిరిగివ్వాలంటూ ఐఎంజీ భారత్ సంస్థ 2006లో వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. స్టే విధించిందని, అప్పటి నుంచి ఆ భూములను ఎవరూ పట్టించుకోకపోవడంతో చెట్లు, పొదలు పెరిగాయని అధికారులు నివేదికలో వెల్లడించారు. ఆ భూములు ప్రభుత్వానివేనని 2024 మార్చిలో హైకోర్టు, 2024 జూన్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాయని తెలిపారు.ఇదిలా ఉంటే.. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం పరిష్కార మార్గాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది.
ఇందులో భాగంగా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెకర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు.సుప్రీంకోర్టుకు చీఫ్ సెక్రటరీ సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్, ఈ నెల 16న జరగనున్న విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనలపై సీనియర్ న్యాయవాదులతో రెండు మూడు రోజుల పాటు సంప్రదింపులు జరుపనున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు పనులన్నింటినీ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రస్తుతం ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. దీనికి తోడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందిముగ్గురు సభ్యుల బృందం ఆభూముల్లో పర్యటించి, అక్కడి జీవ వైవిధ్యాన్ని, చెట్లు నరికివేసిన దృశ్యాలను, వన్యప్రాణుల సంచారాన్ని, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని అధ్యయనం చేసింది. సెంట్రల్ వర్సిటీ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో కమిటీ విడివిడిగా సమావేశమైంది.
ఈ భూముల్లో ప్రభుత్వం చేపట్టిన పనులపై చీఫ్ సెక్రటరీ సహా వివిధ విభాగాల అధికారులతో రివ్యూ నిర్వహించారు. చెట్ల నరికివేతకు అవసరమైన అనుమతులు పొందిన విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 16న విచారణ జరిగే సమయానికి మధ్యంతర రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించనునుంది.మరోవైపు చీఫ్ సెక్రటరీపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్ అఫిడవిట్‌లో పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. దీంతో పొందుపర్చాల్సిన అంశాలపై రెవెన్యూ, అటవీ, పరిశ్రమల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమైన చీఫ్ సెక్రటరీ .. ఆ భూమితో సెంట్రల్ వర్సిటీకి సంబంధం లేకపోవడం, పూర్తిగా రెవెన్యూశాఖకు చెందినదేనని ధృవీకరించే రికార్డులు, ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూమిని ప్రైవేటు సంస్థకు అప్పజెప్తూ తీసుకున్న నిర్ణయం.. వీటన్నింటినీ ఆ అఫిడవిట్‌లో పొందుపర్చాలని సీఎస్ భావిస్తున్నారు.జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, చెట్ల నరికివేత, వన్యప్రాణుల సంచారం, భూ యాజమాన్య హక్కులు తదితర లీగల్ అంశాలపై సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపుల తర్వాత అఫిడవిట్‌కు తుది రూపు ఇచ్చే అవకాశముంది. ప్రభుత్వ ఉద్దేశాలన్నింటినీ న్యాయవాదులకు వివరించి ఈ నెల 16న దీటుగా వాదనలను వినిపించాలన్నదే సీఎస్ టీమ్ ఢిల్లీ టూర్ ప్రధాన లక్ష్యం.