Hyderabad:తెలంగాణలో పీజీ మెడికల్ కోర్సులకు 2023-25 కాలానికి సంబంధించి పెంచిన ఫీజుల్లో వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని, అదనపు చెల్లించాలని పిటిషనర్లపై ఒత్తిడి తీసుకురావద్దని హైకోర్టు ఏప్రిల్ 3న మెడికల్ కాలేజీలను ఆదేశించింది.
మెడికల్ విద్యార్ధులకు ఊరట
హైదరాబాద్, ఏప్రిల్ 4
తెలంగాణలో పీజీ మెడికల్ కోర్సులకు 2023-25 కాలానికి సంబంధించి పెంచిన ఫీజుల్లో వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని పీజీ మెడికల్ కాలేజీలకు హైకోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని, అదనపు చెల్లించాలని పిటిషనర్లపై ఒత్తిడి తీసుకురావద్దని హైకోర్టు ఏప్రిల్ 3న మెడికల్ కాలేజీలను ఆదేశించింది. ఈ మేరకు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా విద్యార్థులను తరగతులకు అనుమతించాలని తేల్చిచెప్పింది. 2023-2026 బ్లాక్ పీరియడ్ సంబంధించి పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ట్యూషన్ ఫీజును ఏడాదికి రూ.5.8 లక్షల నుంచి రూ.24 లక్షలకు, కన్వీనర్ కోటా ఫీజును రూ.3.2 లక్షల నుంచి రూ. 7.75 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవోలు జారీచేసింది.
దీన్ని సవాల్ చేస్తూ డాక్టర్ అద్వైత శంకర్ సహా 124మంది మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టేసింది. దీంతో పిటిషనర్లందరూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకల ధర్మాసనం విచారణ చేపట్టింది. 2020-23లో కూడా ఫీజుల పెంపునకు ఉత్తర్వులివ్వగా 50 నుంచి 60 శాతం వసూలు చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఫీజు వసూలు చేసుకోవాలని, మిగిలిన ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి చేయరాదని, వారిని తరగతులకు అనుమతించాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
స్థానికత అంశంలోనూ వివాదమే..
స్థానికత నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్‌లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో ప్రవేశాలు పొందిన వారే.. పీజీలోనూ స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులు అని కోర్టు గతేడాది డిసెంబరులో స్పష్టంచేసింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు తెలంగాణలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన పీజీలో స్థానిక కోటా వర్తించదంటూ తెచ్చిన జీవో 148, 149లను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో ఎంబీబీఎస్, బీహెచ్‌ఎంఎస్/బీఏఎంఎస్ చేసినవారికి ఇకపై పీజీలో స్థానిక కోటా పరిధిలోనే ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. అదేవిధంగా తెలంగాణలో స్థానికులై ఉండి.. రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చదివిలన, ఇన్ సర్వీసు(తెలంగాణలో సివిల్ సర్జన్లుగా చేస్తున్న) అభ్యర్థులకు సైతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుందని అప్పట్లో కోర్టు తెలిపింది.స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్న విధానం పూర్తిగా తొలగించాల్సింది కాదు. పీజీ కోర్సుల్లో స్థానికత ఆధారంగా ప్రవేశాలు కల్పించే వెసులుబాటు ఉంది.
అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. నాన్-లోకల్ కేటగిరీలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌లో చేరినవారు స్థానిక కోటా కింద పీజీలో ప్రవేశాలకు అర్హులుకాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 నుంచి ఇంటర్ వరకు రాష్ట్రంలో చదివినవారికే స్థానిక కోటా కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు లభిస్తాయి. వారికే పీజీ ప్రవేశాల్లో స్థానిక కోటా కింద అర్హత లభిస్తుందన్న వాదన చట్టవిరుద్ధం. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగేళ్లు స్థానికంగా చదువుకున్నట్లయితే స్థానిక అభ్యర్థిగా పరిగణించాలి. ప్రభుత్వ జీవోలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. రాష్ట్ర విద్యాసంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(2)కు సైతం విరుద్ధం. 2021 చట్టంలోని నిబంధన 8 ఇన్ సర్వీసు అభ్యర్థులకు పూర్తిస్థాయి నిషేధం కల్పించలేదు. ఇందులో నిబంధన 1, 6, 8ల మధ్య తేడాలేదు. ఒకసారి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలను సవరించడం సరికాదు. ఈ కారణాలతో జీవో 148, 149లను కొట్టివేస్తున్నామని తీర్పులో ధర్మాసనం పేర్కొంది.
Read more:వినాశనానికి సిద్ధంగా ఉండండి.. ముంపు ముంచుకొస్తోంది..