Hyderabad:ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, స్థల సేకరణ వేగంగా సాగుతోందని వెల్లడించారు.మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, ఇప్పటి వరకు 205 ఆస్తులకు చెక్కుల పంపిణీ జరిగిందని, ఆయా ఆస్తులకు సంబంధించిన రూ. 212 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ఓల్డ్ సిటీ మెట్రో పరిహారం కోసం 212 కోట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 14
ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విస్తరణ పనుల పురోగతిని సమీక్షించి, స్థల సేకరణ వేగంగా సాగుతోందని వెల్లడించారు.మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, ఇప్పటి వరకు 205 ఆస్తులకు చెక్కుల పంపిణీ జరిగిందని, ఆయా ఆస్తులకు సంబంధించిన రూ. 212 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారాన్ని ఆమోదించి ముందుకు వచ్చి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రజల సహకారం లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం కష్టమని ఆయన అన్నారు. ఈ మార్గంలో ఇరువైపులా చిక్కుముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించి తమ ఇంజినీరింగ్ సిబ్బంది మార్గాన్ని సుగమం చేసారని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో అధికారులతో పాటు, రెవిన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి.
ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి, అవశేషాలను తొలగించడం జరిగిందని చెప్పారు. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి రోడ్డు విస్తరణ ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా విస్తరణ పనుల వేగం కొంత తగ్గినప్పటికీ, ఇప్పుడు అవి మళ్ళీ పుంజుకుని సజావుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. పాతనగరంలోని చారిత్రాత్మక కట్టడాలకు ఎటువంటి నష్టం జరగకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెట్రో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు త్వరితగతిన పాతనగరం విస్తరణ పనులు పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైలు అందుబాటులోకి వస్తే పాతనగర ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయితే పాతనగరం రూపురేఖలు మారుతాయని, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
Read more:Hyderabad:కేటీఆర్ లో ఎంత మార్పో.