Andhra Pradesh: మళ్లీ కీలకంగా సజ్జల:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ రాజకీయ వ్యవవహారాల కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని చైర్మన్ గా ప్రకటించారు. మరో 33 మంది సభ్యులను ప్రకటించారు. ఈ కమిటీ నిర్ణయాల ద్వారా పార్టీ కార్యక్రమాలు ఖరారు అవుతాయి. నిజానికి వైసీపీలో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మొదటి నుంచి ఉంది. ఇది ఓ రకంగా పొలిట్ బ్యూరో లాంటిది.
మళ్లీ కీలకంగా సజ్జల
విజయవాడ, ఏప్రిల్ 14
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ రాజకీయ వ్యవవహారాల కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని చైర్మన్ గా ప్రకటించారు. మరో 33 మంది సభ్యులను ప్రకటించారు. ఈ కమిటీ నిర్ణయాల ద్వారా పార్టీ కార్యక్రమాలు ఖరారు అవుతాయి. నిజానికి వైసీపీలో పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మొదటి నుంచి ఉంది. ఇది ఓ రకంగా పొలిట్ బ్యూరో లాంటిది. కానీ సమావేశాలు జరిగినట్లుగా పెద్దగా సమాచారం బయటకు రాదు. పార్టీ పదవులు ఇవ్వాలనుకున్న సీనియర్లకు ఇందులో సభ్యులుగా నియమించేవారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకునే నిర్ణయాలతో పార్టీ కార్యక్రమాలు నడిచిపోయేవి. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో పీఏసీని ఏర్పాటు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.పార్టీని నడిపించే ఈ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంచార్జ్ గా నియమించడం ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఓ కోటరీలో ఉండిపోయారని.. ఆ కోటరీకి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వం వహిస్తారన్న ఆరోపణలు కొంత కాలంగా వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేదు.
మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు పార్టీలోని ఆయన వ్యతిరేకులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకే పరిమితమవుతున్నారు. వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డినే మిగతా అన్ని విషయాలు చూసుకునేందుకు వీలుగా పీఏసీకి కన్వీనర్ పదవి ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన సలహాదారుగా సజ్జల ఉన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించేవారు. అయితే ఆయన తీరు వల్లనే పార్టీ ఓడిపోయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కోటరీ పేరుతో జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన విజయసాయిరెడ్డి పార్టీ వీడటంతో సజ్జల రామకృష్ణారెడ్డికి ఎదురు లేకుండా పోయింది. ఆయన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమని.. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను కాదనలేని పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఉక్కపోత తట్టుకోలేక బయటకు వచ్చారు.. ఇప్పుడు సజ్జలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇష్టం లేని మరికొంత మంది నేతలు కూడా బయటకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ ను నేరుగా కలవడానికి నేతలకు అవకాశం లేదు. సజ్జల ద్వారానే జరగాలి. ఆయన తమను జగన్ వద్దకు పోనివ్వడం లేదని చాలా మంది ఫీలవుతున్నారు. వీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Read more:Andhra Pradesh:రాజకీయాల్లోకి ఏబీవీ.