Hyderabad:దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేర్చాం

Health Minister Damodar Rajanarsimha

Hyderabad:దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేర్చాం:ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటిది కాదు, స్వాతంత్య్రం వచ్చిన 15 ఏండ్లకే ఈ డిమాండ్ మొదలైందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దళితుల దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేరుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి, కేబినెట్ సబ్‌కమిట్ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డికి, ఇతర సభ్యులకు ధన్యవాదాలు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. వర్గీకరణ కోసం ఉమ్మడి ఏపీలో పలు ఉద్యమాలు జరిగాయి.

దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేర్చాం

హైదరాబాద్, మార్చి 1
ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటిది కాదు, స్వాతంత్య్రం వచ్చిన 15 ఏండ్లకే ఈ డిమాండ్ మొదలైందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దళితుల దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేరుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి, కేబినెట్ సబ్‌కమిట్ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డికి, ఇతర సభ్యులకు ధన్యవాదాలు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర అసెంబ్లీలో కీలక ప్రసంగం చేశారు. వర్గీకరణ కోసం ఉమ్మడి ఏపీలో పలు ఉద్యమాలు జరిగాయి. వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే మేం వర్గీకరణ చట్టం చేసుకుంటున్నాం. 2025 ఫిబ్రవరి 4వ తేదీ(సోషల్ జస్టీస్ డే), మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయి. గతంలో ఓసారి వర్గీకరణ చేసినా, కోర్టు తీర్పులతో నిలిచిపోయింది.నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడా లేదు. కేవలం 1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయి. మొత్తం మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమే కావడం గమనార్హం. మిగిలిన 33 కులాలు, పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో వర్ణ వివక్ష, బానిసత్వం ఉంటే, మన దేశంలో అత్యంత నీచమైన అంటరానితనం ప్రజలను పీడించింది.

19వ శతాబ్దంలో అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవం కోసం మహాత్మ జ్యోతిరావు ఫూలె, మహాత్మ గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో పోరాటాలు చేశారు. తత్ఫలితంగా ఉపశమన చర్యలు, సంఘ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. 1931లోనే తొలిసారి కుల గణన చేశారు. 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించారు. అంబేద్కర్ పోరాట ఫలితంగా దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు.అంబేద్కర్ విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఆర్థిక స్వావలంభన కోసం ఉద్యోగాలు, పాలనలో భాగస్వామ్యం కోసం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ, ఆ రిజర్వేషన్ల ఫలాలు షెడ్యూల్డ్ కులాల ప్రజలందరికీ వారి వారి జనాభా ప్రాతిపదికన పంపిణీ కాలేదు. ఇదే దళిత సమాజంలో ఆందోళనకు, అసంతృప్తికి కారణమైంది. స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే, 1965లోనే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు బీఎన్‌ లోకూర్ కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని నాడే ఆ కమిటీ గుర్తించింది. మా వాటా, హక్కులు మాకు కావాలని ప్రజలు ఆందోళన చేయడంతో 1975లో పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది.

1990వ దశకం నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉదృతమైంది. ఫలితంగా నాటి ప్రభుత్వం జస్టీస్ రామచంద్రరాజు నేతృత్వంలో 1996లో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వెనుకబాటుతనం, జనాభా, చారిత్రక నేపథ్యం ఆధారంగా షెడ్యూల్డ్ కులాలను 4 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించింది. కమిషన్ సూచనల మేరకు 2000వ సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలను A, B, C, D గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారు.అత్యంత వెనుకబడిన రెల్లి, దాని ఉపకులాలను గ్రూప్ Aలో చేర్చి, వారికి కమిషన్ సూచనల ప్రకారం అదనపు ప్రయోజనం కల్పించారు. వారి జనాభా ప్రకారం 0.25 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండగా, 1 శాతం రిజర్వేషన్ కల్పించారు. దీన్నే ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ అన్నారు. కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి వర్గీకరణ ఆగిపోయింది. 2006లో దవిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్, కేసుతో పంజాబ్‌లోనూ వర్గీకరణ ఆగిపోయింది. నాటి నుంచి గతేడాది వరకూ వర్గీకరణ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. 2023 డిసెంబర్‌‌లో ప్రజలందరి దీవెనతో రేవంత్‌రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఆ వెంటనే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ కేసులో, వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం తరపున సీనియర్‌‌ అడ్వకేట్‌ను నియమించాం. సుదీర్ఘ విచారణ, వాదోపవాదనల అనంతరం గతేడాది ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తుది తీర్పును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చునని పేర్కొంది. వర్గీకరణకు ఎంపిరికల్ డేటాను ప్రమాణికంగా తీసుకోవాలని చెప్పింది.

“వర్గీకరణ లేకుండా, షెడ్యూల్డ్ కులాలలోని అత్యంత అణగారిన వర్గాలు రిజర్వేషన్లలో వారి చట్టబద్ధమైన వాటాను పొందలేరు’’ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడానికి, చట్టాలను రూపొందించడానికి ఆర్టికల్ 341 అడ్డురాదు.”అని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో కాకుండా, అందరికీ న్యాయం జరిగేలా వర్గీకరణ చేయాలని సూచించింది. ఇందుకోసం అక్షరాస్యత, వృత్తి, జనాభా, ఉద్యోగవకాశాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రమాణికంగా తీసుకోవాలని ఆదేశించింది. దీన్నే సుప్రీంకోర్టు ఎంపిరికల్ డేటాగా వర్ణించింది. వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ ఎంపిరికల్ డేటా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. దేశంలో వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలుస్తామని ప్రకటన చేశారు. ఇచ్చిన మాటను నిలుపుకునే లక్షణం మా నాయకుడిది. సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించి, వర్గీకరణను అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన సబ్ కమిటీ, దీనిపై మరింత అధ్యయనం అవసరం అని భావించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో వన్‌ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయించాలని సూచించింది.

రిటైర్డ్‌ జడ్జి, జస్టిస్ షమీమ్ అక్తర్ చైర్మన్‌గా వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.రాష్ట్రంలోని పాత పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను కమిషన్ తెలుసుకున్నది. ప్రజల నుండి మొత్తం 8 వేలకుపైగా విజ్ఞాపనలను కమిషన్ స్వీకరించింది. ఎస్సీల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. 82 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, 199 పేజీల నివేదికను ఫిబ్రవరి 3, 2025 న ప్రభుత్వానికి సమర్పించింది. 59 షెడ్యూల్డ్ కులాలను I, II, III మూడు గ్రూపులుగా విభజించాలని వన్ మ్యాన్ కమిషన్ సిఫారసు చేసింది.సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను మొదటి గ్రూపులో చేర్చారు. వీటి జనాభా 1,71,625 (మొత్తం SC జనాభాలో 3.288%). సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా అత్యంత వెనకబడి ఉన్నందున ఈ గ్రూప్‌కు ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ ఇచ్చి, వారి జనాభా శాతానికి మించి 1% రిజర్వేషన్ కేటాయించారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మధ్యస్థంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూపు 2లో చేర్చారు.

ఈ 18 కులాల జనాభా 32,74,377 ఉండగా, వీరికి 9% రిజర్వేషన్లు కేటాయించారు. సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్‌ 3లో చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. పాత A గ్రూపులోని 4 కులాలు, పాత B గ్రూపులోని 10, పాత C గ్రూపులో 20 కులాలు ఇప్పుడు కూడా అవ్వే గ్రూపులో కొనసాగుతున్నాయి.పాత వర్గీకరణకు, కొత్త వర్గీకరణకు తేడా ఎక్కువగా లేదు. మొత్తంగా 33 కులాలు పాత, కొత్త వర్గీకరణలో యథావిధిగా కొనసాగాయి. కొత్తగా చేరిన యాటాల, వల్లువాన్‌ కులాలతో కలిపి 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయి. ఈ 26 కులాల జనాభా 1,78,914(మొత్తం షెడ్యూల్డ్ కులాల జనాభాలో ఈ 26 కులాల జనాభా శాతం 3.43 మాత్రమే). సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం కారణంగా షెడ్యూల్డ్ కులాలను 2 లేదా 4 గ్రూపులుగా వర్గీకరించడం ఆచరణ సాధ్యం కాదు అని కమిషన్ తన అధ్యయనం ద్వారా తేల్చింది.ఎస్సీ సమాజాన్ని “అభివృద్ధి చెందిన” మరియు “అభివృద్ధి చెందని” 2 గ్రూపులుగా విభజించడం వలన వనరుల పంపిణీలో అసమతుల్యత మరియు అసమానతలకు దారితీస్తుందని సూచించింది.

ఎంపీరికల్ డేటా మరియు కమిషన్ అధ్యయనం ప్రకారం.. 4 గ్రూపులుగా వర్గీకరించే స్థాయిలో షెడ్యూల్డ్ కులాల మధ్య తేడాలు లేనందున, 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించింది. మా వాటా, మాకు కావాలన్న 30, 40 సంవత్సరాల ఆకాంక్ష ఈరోజు నెరవేరుతోంది.వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు, ఇది కేవలం సోషల్ జస్టిస్. కాంగ్రెస్ మొదట్నుంచీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. గతేడాది ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు జడ్జ్‌మెంట్ వచ్చిన వెంటనే, నేను సీఎం రేవంత్ రెడ్డికి తెలిపాను. ఆయన జడ్జ్‌మెంట్ వచ్చిన గంటలోనే వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా నిలుస్తామని ప్రకటించారు. 6 నెలల్లో ప్రక్రియ పూర్తయి, చట్టం వచ్చేలా రేవంత్‌రెడ్డి చేశారు. ఇది ఆయన కమిట్‌మెంట్‌, నిబద్దత, దార్శనికత్వానికి నిదర్శనంఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం నా అదృష్టం, గతంలో ఎస్సీ సబ్‌ ప్లాన్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇప్పుడు వర్గీకరణలో భాగస్వామిగా ఉండడం నాకు దక్కిన అదృష్టం. సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని కోరుకునేవారంతా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ సభ సంపూర్ణంగా వర్గీకరణను ఆమోదిస్తుందని’ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు.

Read more:Hyderabad:శాసన మండలిలో రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు

Related posts

Leave a Comment