Hyderabad:ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ మీటింగ్..ఫిక్స్:బీఆర్ఎస్ ప్లీనరీ, సిల్వర్ జూబ్లీ వేడుకలకు సరైన వేదిక కోసం ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, భట్టుపల్లి ప్రాంతాలను ఆ పార్టీ నాయకులు పరిశీలించగా.. రెండ్రోజుల కిందట మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ పేరు తెరమీదకు వచ్చింది.రాష్ట్ర రాజధాని, హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఉండటం, బహిరంగ సభ కోసం జన సమీకరణకు వీలుంటుందనే ఉద్దేశంతో ఘట్ కేసర్ ఫిక్స్ అయినట్టేనని అంతా భావిస్తుండగా.. తాజాగా ఆ లొకేషన్ మరో చోటుకు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ మీటింగ్…ఫిక్స్
హైదరాబాద్, మార్చి 27
బీఆర్ఎస్ ప్లీనరీ, సిల్వర్ జూబ్లీ వేడుకలకు సరైన వేదిక కోసం ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, భట్టుపల్లి ప్రాంతాలను ఆ పార్టీ నాయకులు పరిశీలించగా.. రెండ్రోజుల కిందట మేడ్చల్ మల్కజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ పేరు తెరమీదకు వచ్చింది.రాష్ట్ర రాజధాని, హైదరాబాద్‌కు అతి దగ్గరలో ఉండటం, బహిరంగ సభ కోసం జన సమీకరణకు వీలుంటుందనే ఉద్దేశంతో ఘట్ కేసర్ ఫిక్స్ అయినట్టేనని అంతా భావిస్తుండగా.. తాజాగా ఆ లొకేషన్ మరో చోటుకు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. పై మూడు ప్రాంతాలను కాదని, గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు బహిరంగ సభ నిర్వహణకు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిని సెలెక్ట్ చేసినట్లు చర్చ జరుగుతోందిఈ మేరకు బుధవారం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ బాబు, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎల్కతుర్తి శివారులోని ఓపెన్ ల్యాండ్స్ ను పరిశీలించారు. అక్కడ సువిశాలమైన స్థలం ఉండటంతో దాదాపుగా ఎల్కతుర్తినే ఫైనల్ చేసేందుకు ఇక్కడి నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అక్కడ భూములున్న నేతల నుంచి సభ నిర్వహణకు స్థలం ఇచ్చేందుకు అంగీకార పత్రాలు కూడా సేకరిస్తుండటంతో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలకు ఎల్కతుర్తి వేదిక కానుందనే ప్రచారం జోరందుకుంది.
బీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పడగా.. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2021 నవంబర్ లో దీక్షా దివస్ రోజున వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు గులాబీ నేతలు కసరత్తు చేశారు. అప్పటికీ అధికారంలో ఉండటం, జన సమీకరణ ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వరంగల్ నగర శివారులోని దేవన్నపేట ప్రాంతాన్ని ఎంపిక చేశారు.అక్కడున్న వ్యవసాయ పొలాలు, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్లను చదును చేసి దాదాపు 15 లక్షల మందితో సభ నిర్వహించేందుకు కసరత్తు చేశారు. కానీ అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిరసనలు చేపట్టారు. అయినా ఎలాగూ అధికారంలో ఉన్నామన్న ధైర్యంతో రైతుల నిరసనలను పట్టించుకోకుండా వారి భూములను బలవంతంగా సాఫ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ చివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో 15 లక్షల మందితో నిర్వహించాలనుకున్న సభ కాస్త రద్దయ్యింది.ఇప్పుడు పార్టీ 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభకు మరోసారి ప్లాన్ చేశారు. ఇందుకు మొదట వరంగల్ శివారు దేవన్నపేట ప్రాంతాన్నే పరిశీలించారు. కానీ గతంలో ఇక్కడి రైతుల నుంచి వ్యక్తమైన వ్యతిరేకత దృష్టా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం .
అనంతరం వరంగల్ భట్టుపల్లి ప్రాంతాన్ని కూడా చూశారు. కానీ అక్కడ అంత పెద్ద సభ నిర్వహణ సాధ్యం కాదన్న ఉద్దేశంతో భట్టుపల్లిని కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిసింది.దేవన్నపేట, భట్టుపల్లి అనంతరం గులాబీ దళపతి కేసీఆర్ ఘట్ కేసర్ పేరును తెరమీదకు తెచ్చారు. అక్కడి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సమాచారం అందించి, సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. దీంతో ఘట్ కేసర్ ఫిక్స్ అయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ బాబు విజ్ఞప్తి మేరకు సభను ఘట్ కేసర్ నుంచి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తికి మార్చినట్లు తెలిసింది.ఎల్కతుర్తి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం, ఇక్కడ సభ సక్సెస్ అయితే తనకు కూడా ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ఎల్కతుర్తిలోనే సభ నిర్వహించేందుకు వొడితెల సతీశ్ బాబు పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, మరికొందరు నేతలు ఎల్కతుర్తి, గోపాలపూర్, చింతలపల్లి పరిసర ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించారు.ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల జంక్షన్ గా ఉండటం, జన సమీకరణ, బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ఎన్హెచ్ 563, ఎన్హెచ్ 765డీజీ రోడ్లతో మెరుగైన రవాణా సదుపాయం ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపుగా ఎల్కతుర్తిని ఖరారు చేసినట్లు తెలిసింది.
వరంగల్ లో గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈసారి బీఆర్ఎస్ నేతలు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బహిరంగ సభకు ఎల్కతుర్తిని ప్రతిపాదించిన గులాబీ నేతలు ఇక్కడ భూములు ఉన్న రైతులు, బీఆర్ఎస్ నేతల నుంచి అంగీకార ఒప్పంద పత్రాలపై సంతకాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం కొంతమంది నుంచి సభ నిర్వహణకు స్థలం ఇచ్చేందుకు అంగీకార సంతకాలు తీసుకున్నారు.కాగా రాష్ట్రంలో బహిరంగ సభ నిర్వహణకు అనువైన ప్రదేశాల కోసం పరిశీలిస్తున్నామని, సభా వేదికను మాజీ సీఎం, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ చేయాల్సి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ నిర్ణయం తరువాతనే అధికారికంగా సభా వేదిక స్థలాన్ని ఖరారు చేసి, ప్రకటిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా సభను గ్రాండ్ చేయడంపై ఫోకస్ పెట్టిన మాజీ సీఎం కేసీఆర్.. తమ సత్తా చాటేందుకు ఏ ప్రాంతాన్ని బహిరంగ సభకు ఎంపిక చేస్తారో చూడాలి.