సొంత దేశంలోనే రాజకీయ అధికారాలు కోల్పోతాం..
డీలిమిటేషన్‌పై స్టాలిన్
చెన్నై, మార్చి 22
కేంద్రం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెన్నైలో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని పార్టీలు తీర్మానించాయి. ఒక జేఏసీగా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతానికి జనాభాప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్‌తో కొన్ని రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని భావించాయి. అందుకే పాతికేళ్ల పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు చేసిన కొన్ని తీర్మానాలను సమావేశానికి హాజరైన నేతలు చర్చించి ఆమోదించాయి. కేంద్రం చేపట్టే చర్యలపై పోరాటానికి ప్రత్యేకంగా జేఏసీ ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్ణయించారు. వివిధ పరిస్థితులు కారణంగా వివిధ పార్టీలు సమావేశానికి రాలేకపోయాయని నేతలు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ కూడా కూడా ఈ సమావేశానికి రాలేకపోయిందని అన్నారు. ఆ పార్టీ తమతోనే ఉందని ఎంపీ కనిమొళి ప్రకటించారు. వచ్చే సమావేశానికి ఆ పార్టీ కచ్చితంగా వస్తుందని అభిప్రాయపడ్డారు. రెండో సమావేశం హైదరాబాద్‌లో పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. మిగతా నేతలతో చర్చించి ఓ నిర్ణయానికి వద్దామని ఆయనకు స్టాలిన్ సూచించారు. జేఏసీని ఎవరు లీడ్ చేయాలనే వాటిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని నేతలు తెలిపారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే అంశంపై చర్చించేందుకు తమిళనాడు రాజధాని చెన్నైలో అధికార పార్టీ అయిన డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మాట్లాడారు. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆయన ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని అన్నారు.డీలిమిటేషన్‌పై ఈ అఖిలపక్ష సమావేశం చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ప్రస్తుత జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. దీన్ని మనమంతా వ్యతిరేకించాలి. పార్లమెంట్‌లో మన ప్రాతినిధ్యం తగ్గితే, అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం కూడా తగ్గుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. మన సమ్మతి లేకుండానే చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతులకు మద్దతు తగ్గుతుంది. మన సంప్రదాయాలు, వృద్ధి ప్రమాదంలో పడతాయి. సామాజిక న్యాయం దెబ్బతింటుంది.
ఈ కొత్త పరిణామాలతో సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతాం’’ అని సిఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని స్టాలిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలనే తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కొన్ని దశాబ్దాలుగా పలు దక్షిణ భారత రాష్ట్రాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం అనేక విధానాలు కూడా తీసుకొచ్చాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జనాభా వృద్ధి విపరీతంగా ఉంది. జనాభా నియంత్రణపై మన చర్యలకు ఎలాంటి రివార్డ్ లభించలేదు సరికదా, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదంలో పడ్డాం’’ అని అన్నారు.చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగవంత్ మాన్, పినరయి విజయన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంతకుముందు కూడా చెప్పారు. అయితే ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తరపున ఏ పార్టీ రాకపోవడం గమనార్హం. అధికారంలోని టిడిపి, జనసేన పార్టీలు బిజేపీతో కూటమిలో ఉండగా.. రాష్ట్ర అధికారాల కోసం వైసీపీ కూడా హాజరుకాకపోవడం ఆశ్చర్యకరం.మరోవైపు ఈ సమావేశంపై బిజేపీ విమర్శలు చేసింది. నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని బిజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. కావేరీ జలాలు, ఇతర కీలక అంశాలపై ఇలాంటి అఖిలపక్ష సమావేశాలు ఎందుకు నిర్వహించట్లేదని ఆమె ప్రశ్నించారు.
Read more:Hyderabad:దక్షినాది రాష్ట్రాలపై వివక్ష పెరిగింది..డిలిమిటేషన్ తో అనేక నష్టాలు