Andhra Pradesh: లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది:వైసీపీ అధినేత జగన్ కు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కామ్ పై వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరాలా? లేక సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేయించాలా?
లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది.
రాజమండ్రి, మార్చి 27
వైసీపీ అధినేత జగన్ కు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ప్రస్తావించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కామ్ పై వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరాలా? లేక సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేయించాలా? అన్న దానిపై చంద్రబాబు నేడో, రేపో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి చర్చించడం కూడా దీనికి ప్రాధాన్యత లభించింది. గత జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వమే లిక్కర్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. లిక్కర్ షాపులను నిర్వహించడమే కాకుండా కేవలం నగదు లావాదేవీలను మాత్రమే అనుమతించింది. ఐదేళ్ల పాటు డిజిటల్ లావాదేవీలను అనుమతించకపోవడంతో అప్పటి కూటమి పార్టీల నేతలు కూడా లిక్కర్ లో భారీగా స్కామ్ జరిగినట్లు ఆరోపించారు.
ఎన్నికలకు ముందు విమర్శలు చేశారు. నగదును మందుబాబుల నుంచి వసూలు చేసి వైసీపీ అగ్రనేతల ఇళ్లకు వెళ్లాయన్న ఆరోపణలు కూడా చేశారు. ఇదే సమయంలో లిక్కర్ దుకాణంలో అప్పుడు ప్రయివేటు సిబ్బందిని నియమించడంతో పాటు వారు వసూలు చేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయన్న దానిపై విచారణ ప్రారంభం కానుంది. అయితే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం దుబాయ్ కు నాలుగు వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా వచ్చిన డబ్బులు పంపారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడమే కాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కోరడంతో ఇప్పుడు ఈడీ, సీబీఐ చేత దర్యాప్తు చేయించుతారా? లేక రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టి చర్యలు చేపడుతుందా? అన్నది నిర్ణయం జరగకపోయినా రెండు మూడు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ మద్యం స్కామ్ లో ఉన్న సునీల్ రెడ్డి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రముఖ బాండ్లను తొలగించడం, నాసిరకం బ్రాండ్లను పెట్టడంతో పాటు 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిస్టలరీ కంపెనీల వద్ద నుంచి పెద్దయెత్తున ముడుపులు స్వీకరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అతి పెద్ద కుంభకోణమని టీడీపీ నేతలు పదే పదే చెబుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. సీబీఐ అంటే మళ్లీ జాప్యం జరిగే అవకాశముందని భావించి రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసి జగన్ ను అరెస్ట్ చేయడానికి అవసరమైన అన్ని దారులు వెతుకుతున్నట్లే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో అధికారులున్నట్లు తెలిసింది.