Andhra Pradesh:వైఎస్ పేరు తీసేసిన నోరెత్తని వైసీపీ:ఏపీలో వైఎస్ అనేది ఒక బ్రాండ్.. దివంగత నేత అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు ఆ బ్రాండ్ క్రియేట్ చేశాయి. వైయస్సార్ బ్రాండ్ ఇమేజే వైసిపి ఆవిర్భావానికి పునాదులు వేసింది.. అయితే తండ్రి ఇమేజ్ ని కాపాడటానికి మాత్రం జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. వైయస్సార్ పేరును కనిపించకుండా చేయాలని జగన్ చూస్తున్నా పార్టీ నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తనదైన బ్రాండ్ చూపించగలిగారు.
వైఎస్ పేరు తీసేసిన నోరెత్తని వైసీపీ
విశాఖపట్టణం, మార్చి 25
ఏపీలో వైఎస్ అనేది ఒక బ్రాండ్.. దివంగత నేత అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు ఆ బ్రాండ్ క్రియేట్ చేశాయి. వైయస్సార్ బ్రాండ్ ఇమేజే వైసిపి ఆవిర్భావానికి పునాదులు వేసింది.. అయితే తండ్రి ఇమేజ్ ని కాపాడటానికి మాత్రం జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. వైయస్సార్ పేరును కనిపించకుండా చేయాలని జగన్ చూస్తున్నా పార్టీ నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తనదైన బ్రాండ్ చూపించగలిగారు. ప్రజా సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం లాంటి ప్రజాకర్ష పథకాలను అమలుచేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వైఎస్‌కి ఇప్పుడు ఆదరణ కరువైనట్లు కనిపిస్తుంది. ఆ ఆదరణ, అభిమానం మిస్ అవుతుంది ప్రజల్లో కాదు.. పార్టీ పేరులో ఆ దివంగత నేత పేరు పెట్టుకుని రాజకీయం చేస్తున్న వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో.. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వెల్లువెత్తిన అభిమానంతో వీధికో విగ్రహం పెట్టారు.వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకానికి ఆయన పేరు పెట్టారు. అధికారం కోసం, అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన వైఎస్ ఇమేజ్ అధికారం కోల్పోయిన వెంటనే తగ్గుతున్నట్లు కనిపిస్తుంది.
విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ పేరు తొలగిస్తే ఆ పార్టీ నేతలు స్పందించిన తీరే అందుకు ఉదాహరణ.అధికారంలో ఉన్న సమయంలో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరుని తొలగించి వైయస్సార్ పేరు పెట్టింది జగన్ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఉన్న వైఎస్సార్ పేరుని తొలగించి మళ్లీ ఎన్టీఆర్ పేరును పెట్టింది. హెల్త్ యూనివర్సిటీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీఆర్ పేరు ఉంది కాబట్టి తర్వాత వైఎస్ఆర్ పేరు మార్చినా ఎలాంటి విమర్శలు రాలేదు. కొత్త జిల్లాల ఏర్పాటులో కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి వైసిపి ప్రభుత్వం ఆ నాయకులకు గౌరవ ఇచ్చామని చెప్పుకుందివైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో చర్చించి విశాఖలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ పేరు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 9 నెలల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల కోసం స్టేడియం రెనోవేషన్ చేస్తున్న సందర్భంలో స్టేడియానికి వైఎస్ పేరు తొలగించి ఏసీఏ, వీ డిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు మార్చారు. ఇప్పుడు ఇదే పెద్ద రాజకీయ దుమారం లేపుతుంది.
విశాఖలోని క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరు తొలగించడం, వైయస్సార్ జిల్లాకు కడప యాడ్ చేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా ప్రతిపాదించడంతో వైఎస్ పేరు కనిపించకుండా, వినిపించకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందని వైసీపీ ఆరోపిస్తోందివిశాఖలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించిన వెంటనే వైసీపీ నాయకులు ఒక్కసారిగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు విశాఖ క్రికెట్ స్టేడియం వద్దకు చేరుకుని ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆందోళనకు పిలుపునివ్వడంతో వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి మళ్లీ వైయస్సార్ పేరు పెట్టే రేంజ్లో ఆందోళన చేస్తారని అందరూ భావించారు.అయితే వైసీపీ నాయకులు ఇచ్చిన పిలుపు, చేసిన ఆందోళన కేవలం ఉనికిని కాపాడుకోవడానికి తప్ప.. నిజంగా వైఎస్ మీద అభిమానంతో కాదని స్పష్టమైంది.
విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర వైసీపీ చేపట్టిన ఆందోళనకు కనీస స్పందన లేకపోవడం గమనార్హం.. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ తానే పిలుపునిచ్చారు కాబట్టి ఆందోళనకు హాజరవ్వక తప్పలేదు.. అమర్నాథ్‌తో పాటు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, అరకు మాజీ ఎంపీ గొట్టేటి మాధవి, విశాఖ నగర మేయర్ గొలగాని వెంకట కుమారి, కొంతమంది కార్పొరేటర్లు సహా.. మహా అయితే వంద మంది కార్యకర్తలు ఆ ఆందోళనలో కనిపించారు.విశాఖ నార్త్ వైసీపీ ఇన్చార్జ్ కేకే రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆందోళనకు రాలేదు. కూటమి ప్రభుత్వంతో పాటు సొంత పార్టీ నాయకుల్ని తీవ్రస్థాయిలో విమర్శించే విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లాంటి వ్యక్తి కూడా ఆందోళనకు హాజరు కాకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. దానికి తోడు ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు సైతం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం విమర్శల పాలవుతోంది.
పార్టీలోని కీలకమైన నాయకులే రాకపోతే సాధారణ కార్యకర్తలు ఎలా వస్తారు అనే చర్చ మొదలైంది.క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరు తొలగించడంతో ఇటు మీడియా ముందు, అటు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన వైసీపీనాయకులు కార్యకర్తలు ఆందోళనలో పాల్గొనడానికి మాత్రం ఆసక్తి చూపించలేదు. స్టేడియానికి తన తండ్రి పేరు తొలగింపుపై వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ఎక్కడా స్పందించలేదు. ఈ మధ్య సోషల్ మీడియా పోస్టులతో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వం చేసిన పని కరెక్ట్ కాదని ఎక్స్‌లో పోస్ట్ కూడా పెట్టలేదు. కన్న కొడుకే అలా ఉంటే పార్టీ నాయకులు కార్యకర్తలకు అంతకంటే ఏం అభిమానం ఉంటుందిలే అన్న సెటైర్లు వినిపిస్తున్నాయ.వైయస్సార్ పేరు క్రికెట్ స్టేడియం కు పునరుద్ధరించాలంటూ పిలుపునిస్తే ఉత్తరాంధ్ర నుంచి, కనీసం విశాఖ జిల్లా నుంచి 100 మంది కార్యకర్తలు కూడా హాజరు కాలేదంటే వైసీపీ శ్రేణులకు దివంగత నేతపై ఏంత ప్రేమ ఉందో అర్థమవుతోందంటున్నారు. వైఎస్ పేరుని వైసీపీ రాజకీయంగా వాడుకుంది తప్ప.. ఆయన ఇమేజ్‌ను కాపాడాలని జగనే భావించడం లేదని.. జగన్‌కి ఎంత సేపు సెల్ఫ్ ఇమేజే ముఖ్యమన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్ పేరు తొలగించారు కాబట్టి పార్టీ విమర్శలు పాలు కాకుండా ఉండడానికి ఓ ధర్నాకు పిలుపిచ్చి చేతులు దులుపుకున్నారని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తిరిగి అంతో ఇంతో ఫాంలోకి రావాలంటే ఏదో ఒక ఇష్యూ ఎత్తుకుని ఆందోళనలు, ఉద్యమాలతో ప్రజల్లో ఉండటానికి ప్రయత్నించాలి… అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలి. అయితే తన ప్యాలెస్ టూర్లకే పరిమితమవుతున్న జగన్ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్మలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి. ఇప్పుడు విశాఖ స్టేడియానికి తండ్రి పేరు తొలగించినా మాజీ ముఖ్యమంత్రి స్పందించే తీరిక లేకుండా పోయింది. ఆ ఇష్యూని వైసీపీ సరిగ్గా హ్యాండిల్ చేసుంటే వైఎస్‌కు ఉన్న ఇమేజ్‌తో వైసిపికి కూడా మైలేజ్ వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే జగన్ నోరు మెదపలేదు.. పార్టీ శ్రేణులు స్పందించకపోవడంతో ఆందోళన తూతూ మంత్రంగా ముగిసి.. ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారిందంటున్నారు.. అదే ఇప్పుడు వైజాగ్ వాసుల్లో చర్చనీయాంశంగా మారింది