Andhra Pradesh:దుర్గగుడి భూముల లీజ్ పై నివేదిక:వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల లీజు పొడిగింపు వ్యవహారంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు ఎకరాల భూమి లీజు పొడిగింపుకు ముందే దుర్గగుడి భూముల ప్రస్తుత స్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల్ని యాభై ఏళ్లకు లీజు పొడిగించాలనే ప్రతిపాదనలు వెలుగులోకి రావడంతో దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది.
దుర్గగుడి భూముల లీజ్ పై నివేదిక
విజయవాడ, మార్చి 27
వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల లీజు పొడిగింపు వ్యవహారంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు ఎకరాల భూమి లీజు పొడిగింపుకు ముందే దుర్గగుడి భూముల ప్రస్తుత స్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల్ని యాభై ఏళ్లకు లీజు పొడిగించాలనే ప్రతిపాదనలు వెలుగులోకి రావడంతో దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సర్వే నంబర్ 17లొ ఉన్న 5 ఎకరాల 98 సెంట్ల భూముల ప్రస్తుత స్థితిపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు.విజయవాడ నగరం మధ్యలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఉన్న భూముల్ని పలు సంస్థలకు లీజుకు ఇచ్చారు. ఈ క్రమంలో సిద్ధార్థ అకాడమీకి ఇచ్చిన 5.98 ఎకరాల భూమి లీజు పొడిగింపుపై ఆ శాఖ కమిషనర్ ఫిబ్రవరి 5వ తేదీన దేవాదాయ శాఖలో ప్రతిపాదించారు.
దీనిపై అభ్యంతరాలు లేవనెత్తుతూ దేవాదాయశాఖ ఫిబ్రవరి 17 కమిషనర్‌కు మెమో పంపింది. ఆ తర్వాత ఫిబ్రవరి 17, 19 తేదీల్లో లీజు వ్యవహారంపై కమిషనర్ వివరణలు ఇచ్చారు.భూములపై కమిషనర్ ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందని దేవాదాయ శాఖ కార్యదర్శి వాటిపై పలు కొర్రీలు వేశారు. భూమి వాస్తవ స్థితితో పాటు దాని సరిహద్దుల్ని ఖరారు చేసి రీ సర్వే చేయడంతో పాటు వాటిని డిజిటలైజ్ చేయాలని సూచించారు. దుర్గ గుడికి చెందిన భూమి లీజుకు సంబంధించిన అసలు ప్రతులను జత చేయాలని, లీజు నియమ నిబంధనలు అమలు చేస్తున్నారో లేదో క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని మెమోలో పేర్కొన్నారు.విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్లకు అనుగుణంగా భూమి వినియోగాన్ని నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ శాఖ చట్టం 2003కు అనుగుణంగా నిబంధనలు అమలవుతున్నాయో లేదో స్పష్టం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
1978 డిసెంబర్ 6వ తేదీన జరిగిన దుర్గగుడి భూముల లీజ్ అగ్రిమెంట్ నిబంధనల అమలు స్థితిని తెలియచేయాలని, లీజుదారులు నిబంధనలు అమలు చేసిన తీరుపై సమగ్ర వివరాలు తెలియచేయాలని, అద్దె చెల్లింపులు, బకాయిల వివరాలను తెలియచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దుర్గ మల్లేశ్వర దేవస్థానం విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో జరిగే అన్ని పరిణామాలను బేరీజు వేసుకుని లీజు ధరను ఖరారు చేయాలని, దీనిపై అత్యవసరంగా నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్‌చంద్ ఉత్తర్వులు జారీ చేశారు.విజయవాడ నగరం మధ్యలో వందల కోట్ల ఖరీదు భూముల్లో నలభై ఐదు ఏళ్ల క్రితం విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. సిద్ధార్ధ అకాడమీ పేరుతో జరిగిన ఈ భూముల లీజు గడువు ముగియడంతో వాటిని పొడిగించాలనే ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు చేరాయి. లీజు గడువును యాభై ఏళ్లకు పొడిగించడంతో పాటు నామమాత్రపు రుసుము చెల్లించాలనే ప్రతిపాదనపై దేవాదాయశాఖ ఎస్టేట్స్ విభాగం అభ్యంతరం తెలిపింది.
ఈ తరహా ప్రతిపాదనలు దేవస్థానం ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని, యాభై ఏళ్ల తర్వాత భూముల పరిస్థితిని ఇప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో ఉన్న లీజుల్ని పొడిగించాలని ప్రభుత్వ స్థాయిలో ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో దేవాదాయ శాఖ అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏడాదికి రూ.10లక్షల రుపాయల లీజుతో యాభై ఏళ్ల పాటు ఈ లీజును పొడిగించాలనే ప్రతిపాదనలు ఆ శాఖకు చేరాయి. విజయవాడ నగరం మధ్యలో ఉన్న ఖరీదైన భూములు కావడం, లీజు ద్వారా వచ్చే ఆదాయం భూముల విలువకు తగినట్టు లేకపోవడంతో ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి దేవాదాయ శాఖ కార్యదర్శి సుముఖత చూపలేదు.విజయవాడ నగరంలో విద్యా సంస్థకు యాభై ఏళ్ల పాటు ఆరెకరాల లీజును పొడిగించాలనే ప్రతిపాదనలకు దేవాదాయ శాఖ అభ్యంతరం తెలిపింది. యాభై ఏళ్ల తర్వాత భూముల స్వాధీనత సాధ్యపడదని, ఇప్పటికే యాభై ఏళ్లుగా లీజులో ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసినట్టు దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. లీజును పొడిగించాలంటే మూడేళ్లకోసారి మాత్రమే పొడిగించాలని ఒకేసారి యాభై ఏళ్ల పాటు లీజు పొడిగించడం సరికాదనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.దుర్గగుడికి చెందిన భూముల లీజు పొడిగింపుపై సీఎంఓలో అధికారుల నుంచి దేవాదాయశాఖపై ఒత్తిడి పెరగడంతో భూముల వాస్తవ పరిస్థితిపై సమగ్ర సర్వే చేపట్టాలని దేవాదాయశాఖ కార్యదర్శి ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దేవాదాయ భూముల వివరాలను డిజిటలైజ్ చేయాలని, లీజుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సమగ్ర డేటా రూపొందించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే అవి అమలు కాలేదు.విజయవాడ దుర్గగుడి భూముల లీజు వ్యవహారం వెలుగు చూడటంతో దుర్గగుడి భూములపై సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ కార్యదర్శి కమిషనర్‌ను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత పదేళ్ల కాలంలో వందల కోట్ల దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమైనట్టు ఫిర్యాదులు అందడంతో సమగ్ర సర్వే చేపట్టాలని ఆ శాఖ భావిస్తోంది.విజయవాడ దుర్గగుడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైన ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావడానికి రాజకీయ నాయకులే కారణమని చెబుతున్నారు. లీజుల ద్వారా ప్రభుత్వానికి మార్కెట్ ధరల ప్రకారం రావాల్సిన ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించడంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది.మరోవైపు దేవాదాయ శాఖలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కమిషనర్లకు ఉంటుంది. వాటిని అమోదించడం వరకే సెక్రటరీ బాధ్యత కావడంతో వివాదాస్పద నిర్ణయాలకు అమోదించడానికి వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయస్థానాల్లో కేసులు నమోదైతే సెక్రటరీలు బాధ్యత వహించాల్సి వస్తుందనే కారణంతోనే లీజుల వ్యవహారానికి సుముఖత చూపడం లేదు.