Andhra Pradesh:తిరుమలలో సేంద్రియ ఉత్పత్తుల బండారం:కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. శ్రీవారి నిత్య నైవేద్యాలు, ప్రసాదాల పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి ప్రసాదాల కోసం సరఫరా చేసిన సేంద్రియ ఉత్పత్తుల బండారం బయట పడింది. ఆర్గానిక్ సరుకుల వ్యవహారంలో డొంక కదిలింది. నిబంధనలకు విరుద్ధంగా దాతలకు ప్రయోజనాలు చేకూర్చినట్లు తేలడంతో టీటీడీ చర్యలు చేపట్టింది.
తిరుమలలో సేంద్రియ ఉత్పత్తుల బండారం
తిరుమల, మార్చి 28
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. శ్రీవారి నిత్య నైవేద్యాలు, ప్రసాదాల పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి ప్రసాదాల కోసం సరఫరా చేసిన సేంద్రియ ఉత్పత్తుల బండారం బయట పడింది. ఆర్గానిక్ సరుకుల వ్యవహారంలో డొంక కదిలింది. నిబంధనలకు విరుద్ధంగా దాతలకు ప్రయోజనాలు చేకూర్చినట్లు తేలడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్గానిక్ ప్రసాదాల తయారీని నిలిపి వేసిన టీటీడీ అంతులేని ప్రయోజనాలను పొందిన దాతలకు చెక్ పెట్టింది.తిరుమల శ్రీవెంకటేశ్వరుడు అలంకార ప్రియుడే కాదు. మంచి భోజన ప్రియుడు కూడా. అందుకే వెంకన్నకు రోజు వివిధ రకాల నిత్య నైవేద్యాలు ప్రసాదాలు శ్రీవారి వంటశాలలో తయారవుతాయి. ఎంతో రుచి సువాసన భక్తులను నోరూరించేలా ఉంటాయి. అయితే అలాంటి ప్రసాదాల తయారీ లో గత ప్రభుత్వం అపచారం జరిగిందన్న కూటమి ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తుల సరఫరాలో జరిగిన లాలూచీని బయటపెట్టింది.
శ్రీ వెంకటేశ్వర నిత్య నైవేద్యాలకు ఆర్గానిక్ సరుకులను వాడాలని తీర్మానించిన గత ప్రభుత్వం, ఇందులో భాగంగానే అప్పట్లో రైతుల నుంచి సేంద్రియ ఉత్పత్తులను సేకరించింది. ఈ మేరకు నిర్ణయించి అమలు చేసింది. 2021లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించి, సేంద్రియ ఉత్పత్తులతో వెంకన్న నిత్య నైవేద్యాలు తయారు చేసేందుకు టీటీడీ ఉపక్రమించింది. ఈ మేరకు తయారు చేసిన ప్రసాదాలు రుచిగా లేవన్న ఆరోపణలు అప్పట్లో వచ్చినా టీటీడీ పెద్దగా పట్టించుకోకుండానే ఆర్గానిక్ ఉత్పత్తులతోనే ప్రసాదాల తయారీ కొనసాగించింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్గానిక్ ఉత్పత్తులతో తయారు చేస్తున్న ప్రసాదాలను నిలిపి వేసింది. ఈ వ్యవహారంపై టీటీడీ పాలక మండలి కూడా దృష్టి పెట్టింది. ఎవరి ప్రయోజనాల కోసం సేంద్రియ ఉత్పత్తులను ప్రసాదాల తయారీ కోసం వినియోగించారు. సరఫరా చేసిన వాళ్లకు, దాతలుగా ఆర్గానిక్ సరుకులు ఇచ్చిన వారికి సమకూర్చిన ప్రయోజనాలపై ఆరా తీసింది.ఈ మేరకు గతేడాది అక్టోబర్ లో జరిగిన పాలక మండలిలోనే ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. నాసిరకం సరుకులకు చెక్ పెట్టి ప్రసాదాల తయారీలో నాణ్యత పెంచిన టీటీడీ ఆర్గానిక్ ఉత్పత్తుల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ నిర్వహించింది.
గత ప్రభుత్వ హయంలో టీటీడీకి ఆర్గానిక్ సరుకులు సరఫరా చేసిన వారి వివరాలను సేకరించింది. పొందిన ప్రయోజనాలపై దృష్టి పెట్టిన విజిలెన్స్, ప్రకృతి వ్యవసాయం చేసి ఉత్పత్తులను టీటీడీకి సరఫరా చేసిన రైతులను ఆరా తీసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమలాపురం కు చెందిన శ్రీనివాస సేవా ట్రస్ట్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాకం వెలుగు చూసింది.నిమ్మకాయల సత్యనారాయణ అనే వ్యక్తి సేంద్రియ ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా అంతులేని ప్రయోజనాలు పొందినట్లు గుర్తించిన విజిలెన్స్ ఈ మేరకు లోతుగా దర్యాప్తు నిర్వహించింది. ప్రకృతి వ్యవసాయం చేసి టీటీడీకి సేంద్రియ ఉత్పత్తులను సరఫరా చేసిన రైతులు 85 మంది వరకు ఉన్నారని, వాళ్లను దాతలుగా గుర్తించి డొనేషన్ పాసు పుస్తకాలు జారీ చేసినట్లు గుర్తించింది. శ్రీవారికి రూ.10 లక్షలు డొనేషన్ చేసే దాతలకు ఇచ్చే ప్రివిలైజ్‌ను కల్పించిన టీటీడీ ఈ మేరకు డొనేషన్ పాస్ పుస్తకాలులను జారీ చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఏడాదిలో మూడుసార్లు శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునేందుకు ఛాన్స్ ఉన్న డొనేషన్ పాస్ పుస్తకాన్ని పొందిన సత్యనారాయణ ఈ వ్యవహారంలో కింగ్ పిన్ గా గుర్తించింది.
ప్రకృతి వ్యవసాయం చేసి సేంద్రియ ఉత్పత్తులను టీటీడీకి సరఫరా చేశామన్న రైతుల వద్దకే వెళ్లి వివరాలు సేకరించింది. ఇందులో చాలామంది రైతులు అలాంటి ఉత్పత్తులు సాగు చేయలేదని, కొందరు రైతులే కాదని తేలింది. దీంతో అవాక్కైనా టీటీడీ మూడు రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి సేంద్రీయ సరుకుల పేరుతో నాసిరకం సరుకులు సరఫరా చేసినట్లుగా భావించింది.ఇక ఆర్గానిక్ సరుకులు సరఫరా చేసినట్లుగా ప్రివిలైజ్ పాసు పుస్తకాలు పొందిన దాతల ప్రయోజనాలను టీటీడీ కట్ చేసింది. ఇకపై ఆ దాత నుంచి ఎలాంటి దానాలు అక్కర్లేదన్న నిర్ణయాన్ని ప్రకటించిన టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది. డొనేషన్లుగా సరుకులు సరఫరా చేసి ప్రివిలేజ్‌గా పాసు పుస్తకాలు పొంది టీటీడీ ని బురిడీ కొట్టించిన దాతపై చర్యలకు సిద్ధమైంది.
Read more:Andhra Pradesh:సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్