Adilabad:సీసీఐపై సన్నగిల్లుతున్న ఆశలు:ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల పునరుద్ధరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. జిల్లాలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమలేవీ లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడింది. ఇటీవల వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సైతం అనుమతి వస్తుందని ప్రజలంతా భావించారు. కానీ వరంగల్‌కు అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును మాత్రం పక్కన పెట్టింది.
సీసీఐపై సన్నగిల్లుతున్న ఆశలు
అదిలాబాద్, మార్చి 21
ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల పునరుద్ధరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. జిల్లాలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమలేవీ లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడింది. ఇటీవల వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సైతం అనుమతి వస్తుందని ప్రజలంతా భావించారు. కానీ వరంగల్‌కు అనుమతి ఇచ్చిన కేంద్రం.. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును మాత్రం పక్కన పెట్టింది.మరో వైపు ముప్పై ఏండ్ల కింద మూతబడిన సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీని అయినా తిరిగి ప్రారంభిస్తారన్న ఆశతో ఉన్న ప్రజలకు మరోసారి నిరాశ తప్పలేదు. ఫ్యాక్టరీలోని సామగ్రిని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రం టెండర్లు పిలవడంతో ప్రజలంతా హతాశులయ్యారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలంటూ ఆందోళన బాట పడుతున్నారు.ఆదిలాబాద్ పట్టణ శివారులో ఏర్పాటైన సీసీఐ ఫ్యాక్టరీలో 1982 ఆగస్టు 15న సిమెంట్ ఉత్పత్తి ప్రారంభమైంది. సీసీఐకి సొంతంగా 870 ఎకరాలు ఉండగా మరో 2 వేల ఎకరాల భూమిని లీజుకు తీసుకుంది. ఫ్యాక్టరీలో సుమారు 4 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు పనిచేసేవారు. 1984లో అప్పటి సీఎం ఎన్‌టీ.రామారావు, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి తివారీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. అప్పటినుంచి 1991 వరకు సిమెంట్ ఉత్పత్తి చేస్తూ దేశంలోని నలుమూలలకు సరఫరా చేశారు.
1991, 1992, 1993లో మూడేళ్ల పాటు వేల కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో ప్రభుత్వం లేవీ పద్ధతి (60 శాతం ప్రభుత్వ కొనుగోళ్లు)ని రద్దు చేయడంతో సీసీఐకి బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయాయి. దీంతో 1993 అక్టోబర్‌లో సీసీఐలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫ్యాక్టరీని తెరిపించాలని ముప్పై ఏండ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.ముప్పై ఏండ్లుగా మూతబడిన ఫ్యాక్టరీ ఎన్నటికైనా తిరిగి ప్రారంభం అవుతుందని స్థానిక ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. కానీ సీసీఐ ఫ్యాక్టరీలోని యంత్రాలకు సంబంధించిన సామగ్రిని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రం మార్చి 7న టెండర్లు ఆహ్వానించింది. సిమెంటు ఉత్పత్తికి వినియోగించిన యంత్రాల సామగ్రి, ఇతర అవసరాలకు వినియోగించిన ఇనుము, పాత వాహనాలు.. ఇలా మొత్తం 71 యంత్రాలు, భవనాల ఇనుప తుక్కు సామగ్రిని అమ్మేందుకు నిర్ణయించిన కేంద్రం, మొత్తం రూ.43.30 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది.దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడం, జిల్లాలో ఆందోళనలతో పాటు కార్మిక సంఘాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో యాజమాన్యం టెండర్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ఎప్పటికైనా సీసీఐని అమ్మాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఉందంటూ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే సీసీఐని కాపాడుకునేందుకు పార్టీలు, సంఘాలకు అతీతంగా ఉద్యమ బాట పడుతున్నారు.సీసీఐ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలంటూ మూడేండ్ల కిందే సీసీఐ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా పట్టణ బంద్‌తో పాటు దీక్షలు, రాస్తారోకోల వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సీసీఐ ఫ్యాక్టరీ సామాగ్రిని తుక్కు కింద అమ్మేందుకు 2022లోనూ యాజమాన్యం టెండర్లు పిలిచింది. అప్పుడు ఆందోళనలు జరగడంతో ఆ ప్రక్రియ కాస్తా నిలిచిపోయింది. తాజాగా మరోసారి తుక్కు కింద అమ్మాలని నిర్ణయిండంతో సీసీఐ సాధన కమిటీ ఉద్యమబాట పట్టింది.ఇందులో భాగంగా రెండు రోజులుగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు. సీసీఐ పునరుద్ధరణపై ఎన్నికల సమయంలో బీజేపీ లీడర్లు హామీలు ఇస్తున్నారే తప్ప.. ఆచరణలో పెట్టడం లేదని, ఫ్యాక్టరీ పునరుద్ధరణలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు విఫలం అయ్యారంటూ ఆరోపిస్తున్నారు. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.